కామారెడ్డిలో రాహుల్ పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎన్నికల పరిశీలకుడు, ఏఐసీసీ కార్యదర్శి సలీం హైమద్, మండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్‌అలీ
సాక్షి, కామారెడ్డి: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచార సభను కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల నుంచే కాకుండా నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల నుంచి కూడా సభకు జనాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. హెలిప్యాడ్ కోసం ఇందిరాగాంధీ స్టేడియాన్ని ఎంపిక చేశారు.
ఈ నెల 20న ఆదిలాబాద్ జిల్లా పర్యటన అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు రాహుల్‌గాంధీ హెలికాప్టర్‌లో కామారెడ్డికి చేరుకుంటారు. స్టేడియంలో దిగిన తరువాత అక్కడ పార్టీ నేతల పరిచయ కార్యక్రమం జరుగుతుంది. అక్కడి నుంచి నేరుగా డిగ్రీ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. ఈ సభకు పెద్ద ఎత్తున జనాలను తరలించడం సభను సక్సెస్ చేయడానికి పార్టీ నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. జిల్లాలో కీలకమైన నాయకుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ నేతృత్వంలో సభ ఏర్పాట్లు మొదలయ్యాయి.
కామారెడ్డికి వచ్చిన ఏఐసీసీ పరిశీలకుడు..
రాహుల్ బహిరంగ సభ ఏర్పాట్లు మొదలు, సభ పూర్తయ్యే వరకు ఎన్నికల పరిశీలకుడిగా ఏఐసీసీ కార్యదర్శి సలీం హైమద్ వ్యవహరించనున్నారు. శనివారం కామారెడ్డికి చేరుకున్న ఆయన, షబ్బీర్ అలీతో కలిసి కళాశాల గ్రౌండ్‌తో పాటు స్టేడియాన్ని పరిశీలించారు. జిల్లాలోని ఆయా నియోజక వర్గాలకు చెందిన పార్టీ నేతలను సమన్వయం చేస్తూ, సభకు భారీ జన సమీకరణ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించనున్నారు. సభకు భారీగా జనాలను తరలించే బాధ్యతను ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నేతల పైనే పెట్టారు. కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్‌అలీకి టికెట్ దాదాపు ఖరారైంది. నియోజక వర్గంలో జనాలను తరలించే బాధ్యత ఆయన పైనే ఉంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు ఎంత మంది జనాలను తీసుకొస్తారన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. రాహుల్ పర్యటనకు ముందుగానే బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నందున జన సమీకరణకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
జిల్లాకు తొలిసారిగా రాహుల్...
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జిల్లా కేంద్రానికి తొలిసారిగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తద్వారా జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఊపు తీసుకురావాలని ఆరాటపడుతున్నారు. 30 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ కామారెడ్డిలో జరిగిన బహిరంగ స¿భలో పాల్గొన్నారు.
వాళ్ల కుటుంబం నుంచి ఇప్పుడు రాహుల్ జిల్లాకు రానున్నారు. సభకు ఆరు రోజుల సమయం మాత్రమే ఉండడంతో పాటు బతుకమ్మ, దసరా పండుగలు రావడంతో ఏర్పాట్లలో నిర్లక్ష్యం చేయొద్దని నేతలు చెబుతున్నారు. ఏదేమైనా రాహుల్ పర్యటన పార్టీ నేతలకు ప్రతిష్టాత్మకంగా మారిందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment