సాక్షి, హైదరాబాద్: గురుకులాలన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతోపాటు, నియోజకవర్గానికి 10 గురుకులాలు ఏర్పాటుచేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఒకే గొడుగు కిందకు అంటే ఒకే సొసైటీ కిందకు తెస్తారా లేక విడిగా ఒక డెరైక్టరేట్ ఏర్పాటు చేస్తారా అన్న అంశంపై దీని భవితవ్యం ఆధారపడి ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. వేర్వేరు స్వభావాలున్న గురుకులాలన్నిటిని ఏకీకృతం చేయడం ఎలా సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ప్రస్తుతమున్నవి 855 గురుకులాలు...
ప్రస్తుతం మొత్తం 855 రెసిడెన్షియల్‌స్కూళ్లలో సాంఘిక సంక్షేమ గురుకులాలు 173, ఎస్టీ గురుకులాలు 150, జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్లు 22, బీసీ గురుకులాలు 22, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్-12, టీఎస్ కస్తూర్భాగాంధీ బాలికా వికాస్ స్కూళ్లు (సర్వశిక్షఅభియాన్) 187, మోడల్ స్కూల్స్ 192 ఉన్నాయి. వీటిలో 3,09,185 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, 16 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు వేర్వేరుగా నడుస్తున్నాయి. సీట్ల రిజర్వేషన్లు, సిబ్బంది సర్వీసు రూల్స్ కూడా వేర్వేరుగా ఉన్నాయి.
ఒక్కో సంస్థది ఒక్కో విధానం...
ఎస్సీ గురుకులాల్లో ప్రిన్సిపల్ పోస్టు రాష్ట్రస్థాయిది కాగా, మిగతా వాటిలో అవి జోనల్‌పోస్టులు. ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులుంటాయి. ఎస్సీ గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచర్ల సర్వీసు రెగ్యులైరె జ్ కాగా, బీసీ, ఎస్టీ, ఇతర వాటిలో రెగ్యులర్ కాలేదు. విద్యార్థుల ప్రవేశం, ఇతరత్రా అంశాల రిజర్వేషన్ విధానం వేర్వేరుగా ఉంటుంది. ఒక్కో గురుకులంలో 640 మంది విద్యార్థులను చేర్చుకునే వీలుంది.
సీఎం చెబుతున్న దానిని బట్టి వెయ్యిమంది పిల్లలను చేర్చుకుంటే సదుపాయాలు సరిపోవు. కాగా, ఒకే సొసైటీ కిందకు తీసుకురావడం కంటే విడిగా డెరైక్టరేట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పరిధిలోకి తెస్తేనే ప్రయోజనమని గురుకులాల ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు అన్ని గురుకులాలను కలిపి డెరైక్టరేట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదననను ఆయా కులసంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
గురుకులాల భవితవ్యం ఏమిటి?
Published Mon, Aug 17 2015 3:44 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement