‘టీఎస్‌పీఎస్సీ’ మాకు క్లారిటీ ఇవ్వదా?
హైదరాబాద్: గురుకుల ఉపాధ్యాయ నియామకాల మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ లాంగ్వేజ్ పరీక్షల విషయం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాథ్స్, బయాలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, పిజికల్ డైరెక్టర్ సబ్జెక్టుల్లో టీజీటీ, పీజీటీ పోస్టులకు మెయిన్స్ ఎప్పుడు నిర్వహించేది క్లారిటీ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ మాతృభాష అయిన తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్లం మెయిన్స్ విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో తమ పరీక్షలు ఎప్పుడు ఉంటాయో తెలియక గందరగోళంగా ఉందని అంటున్నారు.
అలాగే, ఇతర సబ్జెక్టులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించిన రెండు రోజుల్లోనే ప్రాథమిక కీని విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ లాంగ్వేజెస్‌కు స్క్రీనింగ్ టెస్ట్ పూర్తయి వారం గడుస్తున్నా ‘కీ’ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఫైనల్ కీని కూడా ఆ సబ్జెక్టులకు ప్రకటించారని, నేడు గానీ, రేపు గానీ వాటి ఫలితాలు కూడా ప్రకటించనున్నట్లు తెలిపిందని, కానీ, ఇప్పటి వరకు తమకు ప్రాథమిక కీని ప్రకటించకపోవడం అన్యాయం అని వాపోతున్నారు. నేడు, రేపో ఫలితాలు రానుండటంతో ఇప్పటికే మెయిన్స్ ఎప్పుడు ఉంటాయో స్పష్టత ఉన్నందున మ్యాథ్స్, బయాలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, పిజికల్ డైరెక్టర్ పోస్టుల వారు చదువుకుంటారని, కానీ, తమ పరిస్థితి మాత్రం గందరగోళంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే టీఎస్‌పీఎస్సీ ఇటీవల లాంగ్వెజెస్‌కు నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ‘కీ’ని విడుదల చేయడంతోపాటు తమకు మెయిన్స్ పరీక్షల షెడ్యూలు కూడా ప్రకటించాలని వారు ముక్తకంఠంగా డిమాండ్ చేస్తున్నారు. ముందు చెప్పినట్లుగా కాకుండా పాత షెడ్యూల్ స్థానంలో సవరణ చేసిన మెయిన్స్ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. స్ర్కీనింగ్ టెస్టు ఫలితాలు వెల్లడి కాకపోవటం, ఈ నెల 29 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో చదువుకునేందుకు కొంత సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని పరీక్షలను 15 నుంచి 20 రోజులు వాయిదా వేసినట్టు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ వాణీ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, లాంగ్వెజెస్ పరీక్షలకు సంబంధించిన కీ విడుదల కాకపోవడం, మెయిన్స్ షెడ్యూల్ ప్రకటించకపోవడంతో వారు తాజాగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.