బిడ్డను కోల్పోయిన తల్లి
ఏమైందీ కమ్యూనిస్టులకి? తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపింది ఈ కమ్యూనిస్టులేనా? స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు వచ్చాయని చెప్పుకుం టున్న భరత భూమిలో అదీ తెలంగాణ పోరు గడ్డపై కాంట్రాక్టర్ దాష్టీకానికి పసి పిల్ల పాలకోసం ఏడ్చి ఏడ్చి కన్నుమూయడమా? ఇంతటి దారుణం హైటెక్ నగరంగా చెప్పుకునే హైదరాబాద్‌కు పట్టు మని వంద కిలోమీటర్ల దూరం కూడా లేని మెదక్ జిల్లాలో జరిగింది. ఆనాడు ముసునూరు దేశ్‌ము ఖ్‌ను తలపించిన ఇప్పటి నయా కాంట్రాక్టర్ ఘాతుకం పట్ల కమ్యూనిస్టులు స్పందించాల్సిన తీరు ఇదేనా? ‘అమ్మనూ రమ్మని, పాలిచ్చి పొమ్మని.. కాకితోనే కబురంపాను.. కబురు అందలేదో, కామందు పంపలేదో.. అమ్మ రానేలేదు.. పాపా ఏడుపాపలేదు.. ’ అంటూ ఓ యధార్ధ సంఘటనతో జనాన్ని చైతన్య పరిచి ఓ చేత్తో వడిశెల, మరో చేత్తో తుపాకీ పట్టించిన ఎర్రదళాలు నేడు ఏమయ్యాయి. మెదక్ జిల్లా హత్నూరు మండలం తుర్కలఖాన్ పూర్‌లో ఇటీవల ఆర్నెల్ల పసిగుడ్డు పాలకి ఏడ్చిఏడ్చి చచ్చిపోతే నాగరిక సమాజం, పౌర సమాజం నుంచి వచ్చిన స్పందన నామమాత్రం. అన్యాయాన్ని ఎది రించే గొంతుకలు సైతం ఎందుకు పూడుకుపోయాయి? నాడు నైజాం పాలనకు ఏమాత్రం తీసి పోని ఇంతటి ఘాతుకం స్వతంత్ర తెలంగాణలో జరిగితే ఇంతవరకు ఆ కాంట్రాక్టర్‌ను అరెస్ట్ చేయమని ప్రశ్నించిన పార్టీ నేతలు లేకపోవడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు. అన్యాయాన్ని ఎదిరించేందుకు అన్నలొస్తారని, ఉపరితల కమ్యూనిస్టులు ఊతమిస్తారని గర్భశోకంతో ఉన్న ఆ మాతృమూర్తి ఎదురుచూడకపోయినా నా లాంటి వాళ్లు చాలా మంది ఆతృత పడ్డారు. ముసునూరు దేశ్‌ముఖ్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన కమ్యూనిస్టులు ఇంతటి అన్యాయాన్ని చూస్తూ ఊరకుండరని ఆశించా. అన్యాయాన్ని వేనోళ్ల తెగనాడుతున్న నేటి తరం నేతలు నిలదీ స్తారని ఎదురుచూశా.
ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ఎవ్వరూ అడక్కుండానే స్వచ్ఛందంగా కేసులు నమోదు చేసి నివేదికలు పంపమని కోరే మానవ హక్కులు ఏమయ్యాయో, కూలీల బాగో గులు చూసే కార్మిక శాఖ ఎక్కడ కళ్లు మూసు కుందో, లేనిపోని వ్యవహారాలపై నానా హంగామా చేసే బాలల సంఘాలు ఎందుకు మౌనం దాల్చా యో అర్ధం కావడం లేదు. బిడ్డ చచ్చిపోయిన వెం టనే హడావిడిగా పూడ్చివేయించి ఆ కూలీల జం టను స్వస్థలమైన మహబూబ్‌నగర్‌కు పంపిన ఆ కాంట్రాక్టర్ క్రూరత్వాన్ని ఇంతవరకు పాలకులు కనీ సం ఖండించకపోవడం దురదృష్టకరం. ఆ కాం ట్రాక్టర్‌తో పని చేయిస్తున్న ఆ ఫార్మా కంపెనీ ఇంత వరకు ఆ ఘటనపై స్పందించకపోవడం వెనుక ఏ మతలబు దాగి ఉంది? జిల్లా రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటుంటే వాళ్లను నిలదీయాల్సిన పెద్దలు ఇంతవరకు నోరు మెదపకపోవడం, ఆ ఘటనపై నిజనిర్ధారణకు పూనుకోకపోవడం దేనికి సంకేతం. అందువల్ల ముఖ్యమంత్రిగారూ, కమ్యూనిస్టుల కొడవళ్లు మొద్దుబారిపోయాయి. ఆనాటి పోరాట పటిమ కలికానికి కూడా కానరాకుండా పోయింది. ముఖ స్తుతి పోరాటాలకు అలవాటు పడిన వీరిని వదిలేసి కనీసం మీరైనా స్పందించండి. ఆ కాంట్రాక్టర్ ధర్మ రాజు అధర్మంగా, అన్యాయంగా, అమానుషంగా ప్రవర్తించారని ప్రకటించండి. నాగరిక ప్రపంచం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించిన ఆ కాం ట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించి మానవత్వం ఇంకా మిగిలే ఉందని నిరూపించండి.
ఎ.ప్రదీప్ హైదరాబాద్