
విక్రమ్.. ఎక్కడ?
ఎదురుకాల్పుల్లో త్రుటిలో తప్పించుకున్న మావోయిస్టు విక్రమ్ కోసం పోలీసుల గాలింపు ముమ్మరంగా సాగుతోంది. నల్లమలను జల్లెడపడుతూ ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. విక్రమ్ ఏకే-47 వదిలివెళ్లడానికి అవకాశమే లేదని, తప్పించుకుంటే ఆయుధంతోనే వెళ్లేవాడనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో అతడు అడవిలో ఉన్నాడా.. లేక పోలీసుల అదుపులో ఉన్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అచ్చంపేట / మన్ననూర్ : ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం నల్లమల అటవీప్రాంతంలోని మురారి కురువ వద్ద నాలుగు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు విక్రమ్ తప్పించుకున్నట్లు భావి స్తున్న పోలీసులు కృష్ణాతీరం, లోతట్టు అటవీప్రాంతంలో పాలమూరు జిల్లా పోలీసులతో పాటు రెండు ప్రత్యేక బృందాలే విస్తృతంగా గాలిస్తున్నాయి. ఓఎస్‌డీ పర్యవేక్షణలో నాగర్‌కర్నూల్ డీఎస్పీ అంథోనప్ప ఆధ్వర్యంలో గాలిం పు చర్యలు సాగుతున్నాయి.
మరోవైపు ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల పోలీసులు గాలిస్తున్నారు. గతేడాది జూన్20న మహబూబ్‌నగర్ కోర్టు సమూదాయం నుంచి ఎత్తికెళ్లిన ఏకే-47, ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం అటవీప్రాంతంలోని మురారి కురువ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ ఘటన స్థలం వద్ద లభ్యమైనది ఒక్కటేనని పోలీసులు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. దీనిని ఎత్తుకెళ్లిన విక్రమ్ తప్పించుకున్నట్లు పోలీసులు భావించి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంగా ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాల పోలీసులు గాలి స్తున్నా.. అతని ఆచూకీ లభ్యం కావడం లేదు.
పోలీసుల అదుపులో విక్రమ్?
విక్రమ్ ఏకే-47 వదిలివెళ్లడానికి అవకాశమే లేదని, అతను తప్పించుకుంటే ఆయుధంతోనే వెళ్లేవాడని వివిధ ప్రజాసంఘాల నాయకులు, విద్యావంతులు, మేధావులు భావిస్తున్నారు. ఏకే-47 ఈ జిల్లాదే అని నిర్ధారణకు రావడంతో పాటు పోలీసులకు విక్రమ్ దొరికి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతని పట్టుకుని మావోయిస్టుల వివరాలు ఆరా తీస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి.
అయితే పోలీసులకు విక్రం దొరికితే అటవీప్రాంతంలో ఇంత శ్రమటోడ్చి గాలింపు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏముందని చెబుతున్నా రు. విక్రమ్ స్వగ్రామం అమ్రాబాద్ మండ లం తిర్మలాపూర్ (బీకే). అతడు ఇక్కడికి వస్తాడనే అనుమానంతో నదీపరివాహక ప్రాంతం వెంట ప్రత్యేక బలగాలు గాలింపు చేపడుతున్నాయి. అటవీ సరి హద్దు గ్రామాలు, చెంచుపెంటలపై పోలీసులు అంతర్గతంగా గట్టి నిఘా ఉంచారు. రెండు రోజుల క్రితం డీఎస్పీ ఆంథోనప్ప అమ్రాబాద్ మండలంలోని కొందరు ఆర్‌ఎంపీ డాక్టర్లను పిలిచి అనుమానితులు వస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించినట్లు సమాచారం. అటవీప్రాంతంలో పోలీసుల గాలింపుతో చెంచుపెంటల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
ఏడేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నల్లమలలో ఈ ఎన్‌కౌంటర్‌తో మరోసారి ఉలికిపడుతున్నారు. మృతిచెందిన మావోయిస్టురాలు నాగమ్మ, తప్పించుకున్నట్లు అనుమానిస్తున్నా.. విక్రం ఈ మం డలం వారే కావడంతో ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. విక్రం ఎక్కడ ఉన్నాడనేది ఇంకా స్పష్టం కాలేదు. మావోయిస్టులతో కలిశాడా? లేక పోలీసుల అదుపులో ఉన్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాయాలైన అతడు ఇప్పటికీ వైద్యం చేయించుకోకుండా ఎలా ఉంటాడని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతేనేం మురారి కురువ వద్ద జరిగిన ఎన్ కౌంటర్ నల్లమలలో అలజడి రేపింది.