
ఎవరీ సెబాస్టియన్ హారీ!
* టీడీపీ క్రిస్టియన్ విభాగం నాయకుడు ముడుపుల డీల్‌లో రేవంత్‌తో అరెస్టు
* హారీ ద్వారా ‘డీల్’కు తెర తీసింది బాబే!
* ‘బాస్‌తో టచ్ ఉన్నాన’ంటూ రికార్డెడ్‌గా దొరికిన హారీ
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు అరెస్టయిన సెబాస్టియన్ హారీ టీడీపీ క్రిస్టియన్ విభాగం నాయకుడు. తనకు సన్నిహితుడైన సెబాస్టియన్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబే ఈ ముడుపుల డీల్‌కు సంబంధించి స్వయంగా తెరవెనుక మంత్రాంగం నడిపినట్లు భావిస్తున్నారు. తాను రేవంత్‌రెడ్డితోనే కాకుండా బాస్ (చంద్రబాబు)తో కూడా టచ్‌లో ఉన్నట్లు సెబాస్టియన్ పేర్కొనడం రహస్య కెమెరాలో రికార్డయిందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అతను రెండు పర్యాయాలు రేవంత్‌తో పాటు స్టీఫెన్‌సన్ వద్దకు వెళ్లాడు. ఆదివారం కూడా డబ్బులతో పాటు స్టీఫన్‌సన్ వద్దకు వెళ్లాడు. ఈ వ్యవహారంలో హారీయే మధ్యవర్తి అని, ఆయనను ప్రశ్నిస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి. విచారణలో వెల్లడయ్యే అంశాలను బట్టి ఆయనను నిందితుడిగా, లేదా సాక్షిగా చేస్తామని పేర్కొన్నాయి.
జిమ్మి, మత్తయ్య అనే రెండుపేర్లు కూడా సంభాషణల్లో బయటపడ్డాయని, వారెవరనేది పరిశీలించి, వారిని కూడా విచారిస్తామని తెలిపాయి. మరోవైపు, స్టీఫెన్‌సన్‌కు ముడుపులు ఇవ్వజూపిన సందర్భంగా రేవంత్ తనకు వచ్చిన ఒక ఫోన్ కాల్‌కు బదులిచ్చారని ఏసీబీ అధికారులు తెలిపారు. దాని ఆధారంగా, ఆయన ఏ మొబైల్ టవర్ లొకేషన్‌లో ఉన్నారో కూడా స్పష్టమైందని వివరించారు. ఈ వ్యవహారంలో ఇది కూడా సాక్ష్యంగా మారనుందని వారు చెబుతున్నారు. దీంతోపాటు రేవంత్ కాల్‌డేటా రికార్డులను కూడా ఈ వ్యవహారంలో సాక్ష్యంగా ఏసీబీ ఉపయోగించుకోనుంది. స్టీఫెన్‌సన్‌కు డబ్బులిచ్చిన సందర్భంగా రేవంత్ అక్కడ ఒక గ్లాస్ మంచినీళ్లు తాగారు. ఆ గ్లాస్‌పై పడిన రేవంత్ వేలిముద్రలను కూడా సాక్ష్యంగా ఏసీబీ సేకరించింది. ఇవన్నీ ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తాయని ఏసీబీ అధికారులు చె బుతున్నారు.