బ్రీఫ్‌డ్ కేస్
పంచ్‌నామా
ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి చిక్కులు తప్పవు. మనం జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన సరిపోదు. అవతలి వాళ్లు అప్రమత్తం కాకుండా చూసుకోవడం కూడా మన పనే. ఇదంతా ఎందుకంటే... చంద్రబాబు నాయుడి కేసు గురించే. తెలంగాణ ఏసీబీ వారికి కించిత్ మర్యాద లేదు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆట పట్టించకూడదన్న ఇంగితం అసలే లేదు. థర్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ నడిపిన సీనియర్‌ని అల్లరి చేయకూడదన్న మంచితనం ఏ కోశానా లేదు. ఏమీ లేవు కాబట్టే... తెలంగాణ ఏసీబీ వారు అందరూ మర్చిపోయిన ఓటుకు కోట్లు కేసు వ్యవహారాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చారు. ఓటుకు కోట్లు కేసులో ఛార్జిషీటు దాఖలు చేసిన ఏసీబీవారు అందులో చంద్రబాబు నామజపమే చేశారు. ఏకంగా 22సార్లు చంద్రబాబు పేరును ప్రస్తావించారు.
పాపం చంద్రబాబు నాయుడు ఎంతో గుట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికలో తమ అభ్యర్ధిని గెలిపించుకోవడం కోసం జస్ట్ ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుక్కుందామని ప్రయత్నిస్తే ఆ ప్లాన్ అంతా చెడగొట్టింది ఏసీబీ. చేసింది చాలదన్నట్లు... ఆ ఎమ్మెల్యేలను కొనడానికి చంద్రబాబు నాయుడు ఏం ప్లాన్ వేశారో రేవంత్ రెడ్డి చేతికి డబ్బుల సూట్‌కేస్ ఇచ్చి ఎలా పంపారో... స్టీఫెన్ సన్‌తో చంద్రబాబు ఏమేం బేరసారాలు ఆడారో అంతా రహస్యంగా రికార్డు చేసింది ఏసీబీ. పెద్దమనుషులు ఏదో వ్యవహారంలో రహస్యంగా బేరసారాలు ఆడుకుంటూ ఉంటే ఆ ఫోను సంభాషణ వినడమే తప్పు. విన్నది కాక దాన్ని రికార్డు చేయడం అత్యంత అమర్యాదకరమైన విషయం.
పోనీ రికార్డు చేశారే అనుకుందాం... దాన్ని ఏసీబీ వారు తమకి బోరు కొట్టినపుడు కాలక్షేపానికి వింటే సరిపోతుంది. అలా చేయకుండా దాన్ని మొత్తం పబ్లిక్‌కి తెలిసేలా చేయడం... మహాదారుణం. ‘ఎక్కడికి వెళ్తున్నాం మనం’ అని వాపోతున్నారు బాబు. ఈ దేశంలో ఎంత రహస్యంగా పనులు చేసుకుందామన్నా కుదరడం లేదని పాపం చంద్రబాబు నాయుడు ఎంతగా మనస్తాపం చెందారో? ముఖ్యమంత్రి పదవిలోఉన్నాక... తమ పార్టీకి ఓ ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోడానికి... ఎమ్మెల్యేలను కొనడం నేరమెలా అవుతుంది? ఎమ్మెల్యేలకు డబ్బులు కూడా ఇవ్వకుండా వారి మద్దతు అడిగితే తప్పవుతుంది కానీ... చక్కగా యాభై లక్షల సూట్ కేస్ ఇచ్చి పంపిన ధర్మప్రభువు చంద్రబాబు నాయుడి విషయంలో ఏసీబీ వారు వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గంగానే ఉందని మర్యాదస్థులంతా చాలా మర్యాదగా చెవులు కొరుక్కుంటున్నారు.
ఇది చాలదన్నట్లు ఇదే సమయంలో సుప్రీం కోర్టు కూడా చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేసింది. అది కూడా ఓటుకు కోట్లు కేసుకు సంబంధించినదే.ఇవన్నీ చూశాక చంద్రబాబులాంటి మనుషులకు ఇవి రోజులు కావేమోనన్న బెంగ గుండెల్ని కోసేస్తోంది. అయితే సుప్రీం నోటీసుల గురించి ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని... అలాంటి కేసులు నోటీసులు తాను చాలానే చూశానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అనుచరుల్లో ఇపుడు అదే చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు ధీమాకి కారణం ఏమిటా అని వారు ఆలోచిస్తున్నారు. ‘ఇలాంటి కేసులు ఎన్ని చూడలేదు?’ అంటే అర్ధం... ఇంకా ఇలాంటి వ్యవహారాలు చాపకింద చాలా తోసేశారా? అని పచ్చచొక్కాలు నర్వస్‌గా బెల్లు కొట్టేసుకుంటున్నారు.
మీడియానీ రాజకీయనాయకులనూ మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు ఇపుడేం చేస్తారా అని వారంతా అలజడితో సైకిల్ టైర్లలో గాలి తీసి కొడుతూ... తీసి కొడుతూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడి బ్రీఫింగ్ అండ్ బ్రీఫ్‌కేస్ గ్యాంగ్ మాత్రం మా బాస్ రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కేసులు లేకుండా చేయగలరు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏంటో వారి ధీమా? వాళ్ల బ్రీఫ్‌కేసులలో ఎంత ధీమా ఉందో?... మీరే ఆలోచించండి.
- నానాయాజీ