రేవంత్ రవ్వంత మాట తూలినా...
(వెబ్ సైట్ ప్రత్యేకం)
మాజీ డీజీపీ ఏకే మహంతి అవినీతి నిరోదక శాఖ అధిపతిగా ఉన్న రోజుల్లో ఓ రైతు దగ్గర నుండి కేవలం 50 రూపాయలు...(అవును 50 రూపాయలు) లంచం తీసుకున్న నేరానికి ఒక విద్యుత్ శాఖ లైన్మెన్ను అరెస్ట్ చేశారు. రిమాండ్ కూడా చేశారు. యాభై రూపాయల లంచానికి అరెస్టా?... ఆ రైతుకు ఆ దశలో 50 రూపాయలు ఎక్కువే. రైతు అవసరాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం నేరమే... చట్టానికి విరుద్ధంగా ఏమి చేసినా నేరమే... చిన్నదా...పెద్దదా అని ఉండదు. యాభై రూపాయలకైనా 50 లక్షల రూపాయలకైనా సెక్షన్లు ఒకటే. కోర్టు విధించే శిక్షలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు అనేది ఏసీబీ వాదన.
దాదాపు దశాబ్దంన్నర తర్వాత యాభై లక్షల రూపాయల ఉదంతం...అదే సూత్రం వర్తిస్తుంది కదా...
ఏసీబీ దాడి వ్యూహాత్మకంగానే ఉంటుంది. లంచం ఇచ్చే నోట్ల నంబర్లతో సహా నోట్ చేసుకుంటారు. పోటాషియం పర్మాంగనేట్ పౌడర్ని నోట్లకి అద్దుతారు. దాడి అనంతరం ఆ నోట్లు తీసుకున్న వ్యక్తి చేతుల్ని కడుగుతారు. నీళ్లు పర్పుల్ (ఉదా రంగు)లోకి మారుతాయి. కాట్ రెడ్ హ్యాండెడ్ అంటే అర్థం ఇదే.
మరి రేవంత్ రెడ్డి వ్యవహారంలో 'కుట్ర దాగి ఉంది' అనే గొంతుకలు ఎందుకు వినబడుతున్నాయి. అసలు కుట్ర అంటే ఏమిటి? రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని రెండు రకాలుగా విశ్లేషించే వీలుంది.
ఇప్పుడు ఏం జరిగింది: తెలుగుదేశం నాయకులు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ని కదిలించారు. డబ్బులు ఆశ చూపారు. స్టీవెన్సన్ ఏసీబీని కలిశారు. ఏసీబీ ప్రణాళిక రచించింది. ఉచ్చులో రేవంత్ రెడ్డి పడ్డారు. చాలా విషయాలు...సందర్భానికి అవసరం లేని అంశాలు కూడా మాట్లాడారు. నోట్లకట్టలు అందచేసి పట్టుబడ్డారు. వీడియోలు బయటకు రాకముందు మీసం మెలేశారు. ఆ పార్టీ నాయకులు ఇంకో అడుగు ముందుకు వేసి పాపం రేవంత్...పేదవాడు. పసివాడు.. కుట్రలో బలైపోయాడు అని కెమెరా ఏడ్పులు కూడా ఏడ్చారు..
నిజంగానే టీడీపీ నిప్పులో కాల్చిన బంగారం అనుకుంటే ఏం చేసుండాల్సింది. వాళ్లు చెప్పినట్టుగానే స్టీవెన్సన్ వాళ్లని తనకు తానుగా సంప్రదించి ఉంటే ఎమ్మెల్యే లంచం అడుగుతున్నాడని తెలుసు కాబట్టి ఈ ట్రాప్ ఏదో వాళ్లే చేయించి ఉండాలి. ప్రణాళిక ప్రకారం ఉచ్చు బిగించి డబ్బులు ఇస్తూ వీడియో తీసి ఇదిగో ఇదీ స్టీవెన్సన్ నీతి అని బాహాటంగా మీడియా సమావేశం పెట్టి 'కడిగిన ముత్యం' లా ప్రపంచానికి తెలియచేసి ఉండాలి. ఇపుడు నిందితులుగా నిలబడ్డవారు గర్వంగా తలెత్తుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడం అని ఢంకా భజాయించి మరీ చెప్పే వీలుండేది. ప్రజలు కూడా ఔరా అనుకునేవాళ్లు. ప్రజాస్వామ్యం చిరునవ్వులు చిందిస్తూ ఉండేది. కానీ ఏం జరిగిందో దేశానికి తెలుసు. ఇరు రాష్ట్రాల ప్రజలకు ఇంకా బాగా తెలుసు.
చంద్రబాబు...బాబుగారు...నాయుడుగారు...బాస్... ఒక టీడీపీ శాసనసభాపక్ష ఉప నాయకుడి నోటి వెంట ఈ పదాలు పదేపదే వస్తే ఎవరిని ఉద్దేశించి చేశారో రెండు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెపుతారు. ఆ జవాబు కోసం ఐన్స్టీన్ లాంటి మేధస్సు ఉండాల్సిన అవసరం లేదు. బాస్ మాత్రం మౌనం వీడరు..నీతి... నిజాయితి పుట్టింట్లో తానే మేనమామ అన్నట్టుగా మాట్లాడతారు. నా జీవితం తెరిచిన పుస్తకం అంటారు. సమస్యను పక్కదోవ పట్టించేందుకు అసందర్భ ప్రస్తావనలు ఎన్నో చేస్తారు. ఏసీబీ కేసీఆర్ జేబు సంస్థ అంటారు. ఎనిమిది సంవత్సరాల ఎనిమిదినెలల పదమూడు రోజులు ముఖ్యమంత్రిగా చేసి 12 నెలలుగా మరోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి.. ప్రభుత్వ సంస్థలు ఎలా పని చేస్తాయో తెలియనంత అమాయకుడు అనుకోవాలా! ఎన్నోసార్లు మంత్రులుగా చేసి, చేస్తున్న వ్యక్తుల మాటలు తీరు కూడా రెండు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా ఏమీ అనిపించలేదు. ఆశ్చర్యపోయారని అనుకోవడానికి ఏమీలేదు.
కాకి లెక్కలే ఆధారంగా 'శత్రువులను' జైలుగోడల మధ్య బంధించి ఉంచాలని చీకటి ప్రయాణాలు చేసి చిదంబర రహస్యాలను పంచుకొని నవ్వుకున్న వ్యక్తులకు ఇపుడేమో 'మనసు కలత చెంది' నిద్ర పట్టడం లేదట. పాపం...ప్రజాస్వామ్యం ఇలా అయిపోయిందేమోననే బెంగా? లేక రేవంత్ రవ్వంత మాట తూలినా మొదటికే మోసం వస్తుందన్న భయమా...
మాట్లాడితే ట్విట్టర్, ఫేస్బుక్ కామెంట్స్లో ప్రతాపం చూపే ముఖ్యమైన గొంతుకలు పాపం మూగపోయాయి. ఎందుకో ప్రజలకు తెలియదా... గతంలో పేజీలకు పేజీలు నింపి గంటలకు గంటలు చర్చలు పెట్టిన కలాలకు, గొంతుకలకు పాపం ఊపిరాడుతున్నట్టు లేదు. ఎవరి ఎజెండా వారిది. ఇంకా ఎలా సమర్థించుకుంటున్నారు? ఒక టీనేజర్ అడిగిన ప్రశ్న. సమర్థించుకోవడానికి గొంతు ఉంటే చాలు...వేరే ఏమీ అక్కర్లేదు.
రేవంత్ తనకు తానుగా చేశారా...బాస్ చెపితే చేశారా..? జవాబు ఏదయినా సమస్య బాస్కే. రేవంత్ను అలా వదిలేస్తే.. అసలే దూకుడుగా వ్యవహరించే రేవంత్ ఆ బాస్ ఎవరో చెపితే.. కొంపలంటుకోవా? పోని రేవంత్ తప్పేమీ లేదు అంటే ఆ తప్పుకు కుట్ర ఎవరిదో కూడా తెలియాలి కదా! రేవంత్...ఆయన అజ్ఞాత బాస్...ఇద్దరూ బయటకు వచ్చి చెప్పుకోలేక పోవచ్చు. కాని గుట్టు విప్పాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వానిదే.
ఈ ప్రయత్నంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైతే రేపటి నుండి వేడివేడి కొలిమిల్లోంచి నిఖార్సయిన బంగారాలు బయలుదేరుతాయి. అప్పుడు టీవీల నిండా పేపర్లనిండా రోజు నోట్లకట్టలే. ప్రజలు కూడా అలవాటు పడతారేమో!.