సాక్షి, ఖమ్మం : మున్సిపల్ ఫలితం ముగిసింది.. ఇక పరిషత్ పైనే అందరి చూపు. జెడ్పీ చైర్మన్ పీఠం ఎవరికి దక్కనుందో ఈ ఫలితంతో తేలనుంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం 8 గంటలకు ఈ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఏజెన్సీలోని పలు మండలాల్లో రాత్రి పొద్దుపోయే వరకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే జెడ్పీ చైర్మన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో.. ఆయా అభ్యర్థులు పోటీచేసిన జెడ్పీటీసీ స్థానాల్లో విజేతలెవరోననే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..
జిల్లాలోని 44 జెడ్పీటీసీ స్థానాలకు 191 మంది, 625 ఎంపీటీసీ స్థానాలకు 2,320 మంది అభ్యర్థులు పోటీ చేశారు.రెండు విడతల పరిషత్ ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 14,95,270 మంది ఓటర్లకు గాను 12,55,188 మంది ఓటు వేశారు. ఈ ఎన్నికల లెక్కింపునకు 339 టేబుళ్లు ఏర్పాటు చేయడంతో పాటు 339 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లను, 44 మంది సూపర్‌వైజర్లను, 1017 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు. భద్రతా కారణాల దృష్ట్యా భద్రాచలం నియోజకవర్గంలోని 8 మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఓట్ల లెక్కింపు అంతా భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. మిగతా 36 మండలాలకు సబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఓట్లు ఆయా మండల కేంద్రాల్లోనే లెక్కిస్తారు. పేపర్ బ్యాలెట్లు కావడంతో భద్రాచలం, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లో పలు మండలాల జెడ్పీటీసీ ఓట్ల తుది ఫలితం రాత్రి వరకు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఆ స్థానాలే కీలకం..
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ఏజెన్సీలోని వాజేడు, వెంకటాపురం, చర్ల, పినపాక జెడ్పీటీసీ స్థానాలు ఎస్సీ మహిళలకు రిజర్వు అయ్యాయి. అలాగే అశ్వాపురం, ఏన్కూరు, భద్రాచలం, కొత్తగూడెం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. జెడ్పీ పీఠం దక్కించుకోవడానికి ఇక్కడ అన్ని పార్టీలు బలమైన మహిళా అభ్యర్థులను బరిలోకి దించాయి. 44 స్థానాల్లో ఎక్కువ జెడ్పీటీసీలు ఏ పార్టీకి రావడం ఒక ఎత్తయితే.. ఇక్కడ చైర్‌పర్సన్ అభ్యర్థులుగా బరిలో దిగినవారు విజయం సాధించడం మరోఎత్తు. ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్ కింద రిజర్వు అయ్యి, మహిళలు పోటీచేసిన ఈ స్థానాల్లో అభ్యర్థుల విజయంపైనే అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి.
ఈ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఆయా మండలాల స్థానికులనే బరిలో దించగా టీడీపీ, కాంగ్రెస్ మాత్రం ఇతర మండలాల్లోని నేతలను పోటీకి పెట్టాయి. ఈ పరిస్థితులతో ఇక్కడ ఫలితం ఏమవుతుందోనని అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనుచర నేతగా నేలకొండపల్లికి చెందిన సోడేపొంగు లక్ష్మి వాజేడు నుంచి, వెంకటాపురం మండలం నుంచి మల్లు భట్టివిక్రమార్క అనుచర అభ్యర్థిగా వైరాకు చెందిన నంబూరి సుజాత పోటీ చేశారు. అలాగే పినపాక జెడ్పీటీసీ స్థానానికి హైదరాబాద్‌లో స్థిరపడిన జాడి జమునతో రేగా కాంతారావు వ్యూహాత్మకంగా నామినేషన్ వేయించారు.
టీడీపీ నుంచి వెంకటాపురం జెడ్పీటీసీ స్థానానికి ఎమ్మెల్యే తుమ్మల వర్గం నేత కొత్తగూడెంనకు చెందిన గడిపల్లి కవిత నామినేషన్ వేశారు. చర్ల అభ్యర్థి తోటమల్ల హరిత తుమ్మల వర్గం అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. మణుగూరుకు చెందిన జాడి వాణి టీడీపీ తరఫున పినపాక జెడ్పీటీసీ స్థానంలో బరిలో ఉన్నారు. ఈమెను ఎంపీ నామా నాగేశ్వరరావు తన అభ్యర్థిగా బరిలోకి దించారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అలాగే అశ్వాపురంలో టీడీపీ తరఫున నామా వర్గం అభ్యర్థిగా తోకల లత బరిలో ఉన్నారు. ఇలా ఎవరికి వారు వర్గాల వారీగా తమ అభ్యర్థులను బరిలోకి దింపి.. జెడ్పీ పీఠం తమ అనుచరులకే దక్కాలని ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.
పరిషత్ విజేతలెవరో..?
Published Tue, May 13 2014 2:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement