రాములమ్మ! మౌనం ఎందుకమ్మా..
రాములమ్మ! మౌనం ఎందుకమ్మా..
Published Thu, Aug 21 2014 3:32 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు సరైనవి కానప్పుడు మనమీద మనకే సహజంగా అసహ్యం వేస్తుంది. మన నిర్ణయాలు తప్పు అని భావిస్తే మౌనం శరణ్యం. తల్లి తెలంగాణ పార్టీతో తెలంగాణలో తనదైన జోరును కొనసాగించిన విజయశాంతి ప్రస్తుతం మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి ఎంపీగా ఎన్నికైన రాములమ్మ అక్కడ కూడా మౌనం వహించాల్సి వచ్చింది.
తప్పని పరిస్థితిలో ఐదేళ్లు మౌనమునిగా కనిపించిన విజయశాంతి.. చివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడంతో ఇక కాంగ్రెస్ కు తిరుగు ఉండదేమో అనే భావనతో ఆపార్టీలోకి జంప్ కొట్టేసింది. అనంతరం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మెదక్ లోకసభ నుంచి శాసనసభకు షిఫ్ట్ అయిన ఈ ఫైర్ బ్రాండ్ పొలిటిషియన్ కు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దాంతో ఆమెకు అప్పుడు కూడా మౌనం దాల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటమి తర్వాత రాములమ్మ ఎక్కడ కనిపించకపోగా.. మాట కూడా వినిపించలేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర సర్వేకు దూరంగా ఉండి తన నిరసన తెలిపింది.
అయితే మెదక్ జిల్లా రాజకీయాల్లో మరోసారి తన పాత్ర పోషించాల్సి వచ్చినా... ఆ ప్రభావాన్ని విజయశాంతి చూపించలేకపోయిందని చెప్పవచ్చు. తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఏర్పాటు చేసిన మెదక్ జిల్లా నేతల సమావేశానికి ఆమె దూరంగా ఉంది. జిల్లా నేతలందరూ హాజరైనా.. రాములమ్మ ఉనికి కనిపించడం లేదు. జిల్లాలో హోరాహోరీ పోటీకి తెర తీసిన మెదక్ లోకసభ ఉప ఎన్నికలు తనకు పట్టనట్టుగా ఉండటం రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇక విజయశాంతి బీజేపీలోకి చేరుతుందని వచ్చిన వార్తల్నిఆమె ఖండించనూ లేదు.. సమర్ధించనూ లేదు. మరోవైపు సినిమారంగంపై దృష్టి పెట్టారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాములమ్మ అప్పట్లో వచ్చిన హిట్ చిత్రం 'నరసింహా'లో రమ్యకృష్ణలా గృహనిర్భంధం విధించుకున్నట్టుగా ఈ 'లేడి అమితాబ్' ఎంట్రీ ఎప్పుడా అని సినీ, రాజకీయ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా 'బంగారు తెలంగాణ' సాధించడానికి తన గళాన్ని విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని రాములమ్మ తెలుసుకోవాల్సిందే.
Advertisement