భర్తను కాపురానికి ఒప్పించాలని భార్య ఆత్మహత్యాయత్నం | Wife attempt to suicide to agree for staying with husband | Sakshi
Sakshi News home page

భర్తను కాపురానికి ఒప్పించాలని భార్య ఆత్మహత్యాయత్నం

Published Fri, Apr 10 2015 11:10 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

Wife attempt to suicide to agree for staying with husband

కవాడిగూడ(హైదరాబాద్): తనతో కలసి ఉండేలా భర్తను ఒప్పించాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన శుక్రవారం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. బాధితురాలు, ముషీరాబాద్ ఎస్‌ఐ సురేందర్ తెలిపిన కథనం ప్రకారం వివరాలివీ.. రాంనగర్ హరినగర్‌లోని రిసాలగడ్డలో నివాసం ఉండే భవానీ (18)కి గత ఏడాది ఫిబ్రవరిలో మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందిన విజయ్‌కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి ఓ పాప. గత 6 నెలల క్రితం భర్త విజయ్‌కుమార్, అత్త సుజాతలు వేధిస్తున్నారని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భవానీ ఫిర్యాదు చేసింది. ఇందుకు ముషీరాబాద్ పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అనంతరం కొన్నాళ్ల తర్వాత తనను భర్త మళ్లీ వేధిస్తున్నాడని, అదనపు కట్నం కోసం ఇబ్బందులు పెడుతున్నారని భవానీ డిసెంబర్‌లో పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. దీంతో భర్త విజయ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.

కొద్ది రోజుల క్రితం విజయ్‌కుమార్ జైలు నుంచి విడుదలయ్యాక కోర్టులో కేసు నడుస్తుండగానే పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భార్యాభర్తలిద్దరూ కలసి ఉంటున్నారు. ఈ నెల 7వ తేదీన మరలా భర్త విజయ్‌కుమార్ వేధిస్తున్నాడని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా భర్త విజయ్‌కుమార్ నాతో కాపురం చేసేలా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని, లేదంటే విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని భీష్మించుకొని పోలీస్ స్టేషన్ మెట్లపై కూర్చుంది. కేసు కోర్టులో ఉండగా మళ్లా కేసు నమోదు చేయడం కుదరదని పోలీసులు చెప్పడంతో భవానీ ముందుగానే తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను తాగబోయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమె వద్ద ఉన్న యాసిడ్ బాటిల్ లాక్కున్నారు. రెండు రోజుల్లో విజయ్‌కుమార్‌ను పిలిపించి, సమస్య పరిష్కరిస్తామని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌కుమార్ హామీ ఇవ్వటంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement