భార్య, కొడుకును కాల్చేస్తానన్న ఎస్సై!
నాంపల్లి: కట్టుకున్న భార్యను, రెండన్నరేళ్ల కొడుకును సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపుతానని ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ బెదిరించాడు. ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఏపీ బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు చేసిన ఈ ఫిర్యాదు మేరకు వివరాలివి.. సంగారెడ్డి టౌన్ సబ్ ఇన్‌స్పెక్టర్ పెద్దోళ్ల లక్ష్మారెడ్డి పరస్త్రీ వ్యామోహంలో పడి.. భార్యా పిల్లలను చావబాదుతున్నాడు. వారు ఎదురు మాట్లాడితే సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించడమే కాకుండా ఇంటి నుంచి గెంటివేశాడు’ అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలు ఏపీ బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయగా సంబంధిత పోలీసు ఉన్నతాధికారులకు వెంటనే ఫిర్యాదు చేశామని, అక్కడి అధికారులు సదరు ఎస్సైపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుండటంతో రాష్ట్రమానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించామని ఆయన తెలిపారు. భార్య, రెండన్నరేళ్ల బాలుడిపై హత్యాయత్నానికి పాల్పడిన సబ్ ఇన్‌స్పెక్టర్ పెద్దోళ్ళ లక్ష్మారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. తమ ఫిర్యాదుపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ వారంలోగా ఈ కేసుకు సంబంధించిన సమగ్రమైన నివేదికను అందజేయాలని సంగారెడ్డి ఎస్పీకి ఆదేశాలు జారీ చేసిందని అచ్యుతరావు తెలిపారు.