
రాజేంద్రప్రసాద్, మానస పెళ్లిఫొటో
సాక్షి, వరంగల్: బిర్యానీ వండట్లేదని.. భార్యను వద్దన్నాడు ఓ ప్రబుద్ధుడు. బిర్యానీ వండటం రాదన్న సాకుతో పెళ్ళైన రెండు నెలలకే భార్యను పుట్టింటికి పంపాడు భర్త. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు దీక్షకు దిగింది ఓ వివాహిత.
వివరాలు... వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తికి ఖాజిపేట దర్గాకు చెందిన మానస అనే యువతితో 2016 నవంబరులో వివాహం జరిగింది. సుమారు రూ. 7 లక్షల కట్నం ఇచ్చారు. పెళ్ళైన రెండు నెలలకే బిర్యానీ వండట్లేదని గొడవ చేసి ఇంట్లో నుండి వెళ్లగొట్టాడని బాధితురాలు మానస తెలిపింది. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసే రాజేంద్రప్రసాద్ రోజు తాగి వచ్చి గొడవ చేసేవాడని, అత్త, ఆడపడుచు సైతం తిట్టేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 10 నెలలు గడిచినా భర్త తీసుకెళ్లడానికి రాకపోవడంతో ఆవేదనకు గురైన మానస తన తల్లి తండ్రులతో కలిసి భర్త ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగింది. తనకు న్యాయం జరిగేవరకు తన భర్త ఇంటి ముందు నుంచి కదిలేది లేదని ఆమె స్పష్టం చేసింది. మానస ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి విషయం ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment