నాలుగేళ్లలో తెలంగాణ మాదే
* బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధీమా
* తెలంగాణలో సభ్యత్వ నమోదు లక్ష్యం 35 లక్షలు
* కొత్తవారిని పార్టీలో చేర్చుకుంటాం, పాతవారికీ ప్రాధాన్యమిస్తాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. రాష్ర్టంలో ఇప్పటికే పార్టీకి సానుకూల వాతావరణం ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని ధీమా వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో పార్టీ ఎలా విస్తరిస్తుందో, అధికారంలోకి ఎలా వస్తుందో మీరే చూస్తారుగా..’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని సమీక్షించడానికి రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన గురువారం పార్టీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశమయ్యా రు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ ముఖ్య నేతలు లక్ష్మణ్, నాగం జనార్దన్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. గ్రామ స్థాయిలో పునాదులు ఏర్పడేలా పార్టీ శాఖలను విస్తరింపజేస్తామన్నారు. తెలంగాణలో 35 లక్షల మందికి సభ్యత్వం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇందుకు పార్టీ రాష్ట్ర శాఖ రూపొందిం చిన ప్రణాళిక బాగుందని కితాబిచ్చారు. తెలంగాణపై కేంద్రానికి శీతకన్ను ఉందంటూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని షా పేర్కొన్నారు. కేంద్రంలో ప్రభుత్వంలో చేరతామని టీఆర్‌ఎస్ ఎప్పుడూ అడగలేదని, ఏ ఇతర మాధ్యమాల నుంచి కూడా సమాచారం అందలేదని చెప్పారు.
రాజ్యసభలోనూ బలం పెంచుకుంటాం
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించడానికి అమిత్ షా నిరాకరించారు. అయితే బలవంతంగా, ప్రలోభాలు పెట్టి మతమార్పిళ్లకు పాల్పడరాదన్నదే పార్టీ వైఖరిగా స్పష్టం చేశారు. ‘ప్రలోభాలు పెట్టి, బలవంతంగా మతమార్పిళ్లు చేయొద్దని చట్టం తీసుకురావాలంటున్నాం. ఈ బిల్లుకు సూడో సెక్యుల రిస్టు పార్టీలు ఎందుకు మద్దతివ్వడం లేదని, మీడియాతోపాటు ప్రజాస్వామ్య, లౌకికవాదులంతా నిలదీయాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయాన్ని మరిచిపోలేదన్నారు. రాజ్యసభలో బలం లేకనే కొన్ని ఆర్డినెన్సులు తీసుకురావాల్సి వచ్చిందని, ఎగువసభలో బలం కోసం రాష్ట్రాల్లోనూ విస్తరిస్తున్నామని, త్వరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుందన్నారు.
కేంద్రంలో అధికారం చేపట్టిన ఈ ఏడు నెలల్లో చాలానే చేశామని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను క్రమంగా అమలు చేస్తున్నామన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించామని, పెట్రోల్, డీజిల్ రేట్లు, నిత్యావసరాల ధరలు తగ్గడంతో మధ్యతరగతిపై భారం తగ్గిందన్నారు. జన్‌ధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా తదితర పథకాలను, ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త సంస్థ ‘నీతి ఆయోగ్’ ఏర్పాటును ఈ సందర్భంగా అమిత్ షా ప్రస్తావించారు. అభివృద్ధి ప్రణాళికల్లో ఇకపై రాష్ట్రాలకూ భాగస్వామ్యం ఉంటుందన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత అన్ని వర్గాల్లో విశ్వాసం పెరుగుతోందని, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడమే అందు కు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ కొత్తవారిని పార్టీలో చేర్చుకుంటామని, పాతవారికీ ప్రాధాన్యమిస్తామని చెప్పారు. పార్టీలో ఎవరి స్థానం వారికి ఉంటుందన్నారు.
మురళీధర్‌రావుకు పరామర్శ
ఛాతీనొప్పితో బాధపడుతూ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావును గురువారం సాయంత్రం అమిత్‌షా పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు స్పష్టం చేశారు. బుధవారం రాత్రి యాంజియోగ్రామ్‌తో పాటు యాంజియోప్లాస్టీ చేసినట్లు తెలిపారు.