కేంద్రంపై ఒత్తిడి తెస్తా
అర్హులందరికీ ‘డబుల్ బెడ్‌రూమ్’
నిజామాబాద్ ఎంపీ కవిత
జగిత్యాల రూరల్ : జిల్లాలో కరువు మండలాల గుర్తింపుపై కేంద్రంపై ఒత్తిడి తెస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నర్సింగాపూర్‌లో రూ.13 లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన శంకుస్థాపన చేశారు. నర్సింగాపూర్ నుంచి వెల్దుర్తి ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు రూ.84 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని మండలాలు ఎస్సారెస్పీ ఆయకట్టు కాగా, మరికొన్ని మండలాల్లో తేమశాతం ఆధారంగా కరువు మండలాలుగా గుర్తించలేదని అన్నారు. ఈ విషయమై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో మాట్లాడి కరువు మండలాలను ఎక్కువగా ప్రకటించేందుకు ఒత్తిడి తెస్తానన్నారు. నిరుపేదలందరికీ దశలవారీగా డబుల్ బెడ్‌రూమ్ పథకం వర్తిస్తుందన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి అదనంగా ఇళ్లు మంజూరు చేసేందుకు సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానన్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని కొన్ని మండలాలు తీవ్ర దుర్భిక్షంలో ఉన్నాయని, కరువు మండలాల ఎంపికలో తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఉపాధిహామీ పథకం రైతులకు ఉపయోగపడేలా చూడాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్, ఎంపీపీ గర్వం దుల మానస నరేశ్‌గౌడ్, సబ్‌కలెక్టర్ శశాంక, ట్రెయినీ కలెక్టర్ గౌతంకుమార్, తహశీల్దార్ మధుసూదన్, ఎంపీడీవో శ్రీలతారెడ్డి, సర్పంచ్ జనగం రాణి నరేశ్, ఎంపీటీసీ రొండి రాజనర్సయ్య, నాయకులు పాల్గొన్నారు.