రైతుల పక్షాన పోరాడతా
టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి
కొల్లాపూర్ : ప్రాజెక్టుల పేరిట రైతులకు ఇష్టం లేకున్నా బలవంతంగా భూములు లాక్కునేందుకు అధికారులు ఎవరు ప్రయత్నించినా వారికి ఎదురు తిరగండి. మొండికేస్తే టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించండి.. రైతుల పక్షాన పోరాడటానికి నేనున్నా.. నని టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి భూ నిర్వాసితులకు భరోసానిచ్చారు. పాలమూరు ప్రాజెక్టు కాలువల డిజైన్ మార్చాలని డిమాండ్ చేస్తూ 15 రోజులుగా కొల్లాపూర్‌లో కుడికిళ్ల గ్రామస్తులు చేస్తున్న రిలేనిరాహార దీక్ష శిబిరాన్ని రేవంత్‌రెడ్డి సందర్శించారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు.
రైతుల దీక్షలకు సిద్దిపేట, గజ్వేల్‌లో ప్రభుత్వం దిగివచ్చిందని, కొల్లాపూర్‌లో కూడా రైతులు పట్టువిడవకుండా పోరాటం చేస్తే న్యాయం జరుగుతుందన్నారు. పాలకులకు ఎవ్వరికి కోపం వచ్చినా ఏదో ఒక ప్రాజెక్టు పేరుతో కొల్లాపూర్ ప్రజలను ముంచేస్తున్నారని, నాటి శ్రీశైలం ప్రాజెక్టు కోసం వేలాది మంది ఇప్పటికే నిరాశ్రయులయ్యారని, నిన్నటి కేఎల్‌ఏ ప్రాజెక్టు కోసం వేలాది ఎకరాల భూములు కోల్పోయారని, ఇప్పుడు వాటర్‌గ్రిడ్, పాలమూరు ప్రాజెక్టు కోసం కూడా భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును మొదటగా జూరాల వద్ద డిజైన్ చేసి కొడంగల్‌లో రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాన్ వేశారని, రెండు చోట్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లేకపోవడంతో కమీషన్లు రావని ఆ ప్రాజెక్టును కొల్లాపూర్‌కు మార్చార ని ఆరోపించారు.
కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావుకు వ్యతిరేకంగా పోరాడేందుకు పార్టీలు, ప్రజాసంఘాలు ఏకం కావాలని, టీఆర్‌ఎస్ వైఖరిని ప్రొఫెసర్ కోదండరాం కూడా విమర్శిస్తున్నారని, నిర్వాసితులు ఆయనతోపాటు ప్రజాకవి గోరేటి వెంకన్నను ఆశ్రయించి ఉద్యమించాలన్నారు. సభలో టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దేవని సతీష్‌మాదిగ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పగిడాల శ్రీనివాస్, నాయకులు చంద్రశేఖర్‌శెట్టి, పసుపుల నర్సింహ, శివానందం, కాంగ్రెస్ నాయకులు కాటం జంబులయ్య, నాగరాజు, బండివెంకటరెడ్డిలు ప్రసంగించారు.