గండేడ్ మండల పరిషత్ కార్యాలయంలో దళిత రైతులతో సమావేశమైన పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, మహబూబ్‌నగర్: గండేడ్ మండలం కుక్కరాళ్లగుట్ట, రెడ్డిపల్లికి చెందిన దళిత రైతులపై వరాల జల్లు కురిసింది. రూర్బన్ పథకం కింద మంజూరైన అభివృద్ధి పనుల కోసం అవసరం మేరకు భూములిస్తే దానికి బదులు వేరేచోట సాగు భూమి, డబుల్‌బెడ్‌రూం ఇల్లు, ఆ ప్రాంతంలో ఏర్పాటయ్యే సంస్థల్లో కుటుంబానికో ఉద్యోగం ఇస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం గండేడ్ తహసీల్దార్ జ్యోతితో కలిసి మండల పరిషత్ కార్యాలయంలో దళిత రైతులతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ రూర్బన్ పథకానికి ఎంపికైన మండలానికి అనేక అభివృద్ధి పనులు మంజూరైన నేపథ్యంలో మండల, గ్రామ అభివృద్ధి కోసం తమ వంతుగా సహాకారం అందించాలని కోరారు. అయినా రైతులు మాత్రం మెట్టు దిగి రాలేదు. భూములిచ్చే విషయంపై పూర్తిగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అప్పటివరకు తమ భూములను వదిలిపెట్టాలన్నారు.
సముదాయించే ప్రయత్నం
సుమారు 50ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం నిరుపేద దళితులకు ఇచ్చిన 80ఎకరాల్లో ఇప్పుడు అభివృద్ధి పేరిట 30ఎకరాల స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే. కొన్ని నెలలుగా దళిత రైతులు దీనిని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బుధవారం ‘లాగేసుకుంటున్నారు!’ అనే శీర్షికతో ‘సాక్షి’తో సమగ్ర కథనం ప్రచురించితమైంది. దీంతో రంగంలో దిగిన ఎమ్మెల్యే, తహసీల్దార్ అక్కడి రైతులతో మాట్లాడి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. కొందరు గ్రామ పెద్దలు మాత్రం ప్రభుత్వం భూముల్ని అభివృద్ధి కోసం తీసుకుంటున్నందున పునరాలోచించాలని దళిత రైతులకు సూచించారు. వాస్తవానికి గండేడ్ మండల కేంద్రానికి ఆనుకునే ఉన్న కుక్కరాళ్లగుట్ట వద్ద సర్వే నం.313లో 71.39 ఎకరాలు, రెడ్డిపల్లి రెవెన్యూ శివారులోని సర్వే నం.40లో 29.04 ఎకరాలు ఇలా మొత్తం 100.43 ఎకరాలున్నాయి. వీటిలో 80ఎకరాలను ఆయా గ్రామాలకు చెందిన సుమారు 40కుటుంబాలకు 1970లోనే అప్పటి ప్రభుత్వం అసైన్డ్ చేసింది.
మిగిలిన 20.43 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే దళితులకు అప్పట్లో ఎకరన్నర నుంచి మూడున్నర ఎకరాల వరకు భూములు పంపిణీ చేశారు. మొత్తం గుట్ట ప్రాంతంలో ఉన్న భూములను ఎంతో కష్టపడి సాగుకు యోగ్యంగా మార్చుకున్న రైతులు వాటిలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. ఇందులో రైతుల నుంచి ప్రస్తుతం ఎనిమిదెకరాలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతుండగా రైతులు మాత్రం 30 ఎకరాల వరకు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేకరించే ఈ భూముల్లో మినీస్టేడియం, డబుల్‌బెడ్‌రూం ఏడెకరాల చొప్పున, అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్, హర్టికల్చర్‌కు ఐదెకరాల చొప్పున, అగ్రికల్చెర్ గోడౌన్‌కు మూడెకరాలు, డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, కన్వెన్షన్‌హాల్, మాణికేశ్వరి టెంపుల్‌కు ఎకరం చొప్పున, ఆడిటోరియం, మిల్క్‌ప్రాసెసింగ్ యూనిట్‌కు రెండెకరాల చొప్పున నిర్మాణాలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment