
సిద్దిపేట పట్టణ శివారులో తడిసిన ధాన్యాన్ని ఎత్తుతున్న మహిళలు
సాక్షి నెట్‌వర్క్: తెలంగాణలో శనివారం పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్ల వాన, ఈదురుగాలులు, ఉరుములు, పిడుగుల శబ్దంతో జనం బెంబేలెత్తిపోయారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డారు. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి ఉంచిన ధాన్యం తడిసిపోగా.. ఈదురుగాలులకు చెట్లు, ఇళ్ల పైకప్పులు, విద్యుత్ స్తంభాలు, పౌల్ట్రీఫారాలు నేలకూలాయి. నోటికాడికి వచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్ జిల్లాల్లోని పలుచోట్ల వర్షానికి కొనుగోలు కేంద్రాలు కుంటలను తలపించాయి. వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది.
చొప్పదండి (కరీంనగర్‌జిల్లా) : వడగండ్లను చూపిస్తున్న గుమ్లాపూర్ రైతు
సిద్దిపేట రూరల్ మండలం తోర్నాలలో కూలిపోయిన పౌల్ట్రీఫాం
కళ్లముందే ధాన్యం కొట్టుకుపోవడంతో రైతన్న కన్నీటి పర్యంతమయ్యాడు. టార్పాలిన్ కవర్లు కప్పేందుకు యత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో వడగండ్లు పడటంతో రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యుత్ తీగలు తెగిపడటంతో పలుచోట్ల సరఫరా నిలిచిపోయింది. సిద్దిపేట జిల్లా తోర్నాల గ్రామంలో పౌల్ట్రీఫాం కుప్పకూలడంతో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. అలాగే.. నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవూర్ గ్రామంలో పిడుగు పడి కొబ్బరి చెట్టు కాలిపోయింది. భారీ శబ్దం రావడంతో జనం పరుగులు తీశారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డుపై ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అరగంట పాటు గాలివాన బీభత్సం సృష్టించింది. మొత్తానికి అకాల వర్షం రైతులను నిండా ముంచింది.
గోవూర్ (నిజామాబాద్‌జిల్లా) లో పిడుగు పడటంతో కాలుతున్న కొబ్బరి చెట్టు
Comments
Please login to add a commentAdd a comment