కట్టంగూరులో యువతి దారుణహత్య
కట్టంగూర్ : నువ్వే నా ప్రాణం అంటూ నమ్మబలికాడు.. నువ్వు లేకుంటే జీవించలేనని ప్రేమ ఊబిలోకి దించాడు..మూడేళ్లుగా చిలకా గోరింకలా తిరిగారు..పెళ్లి చేసుకోమని కోరగానే కాదు పొమ్మన్నాడు.. ఒత్తిడిచేస్తే చివరకు ప్రియురాలి ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాడు. ఇదీ కట్టంగూరు మండల కేంద్రంలో గురువారం దారుణహత్యకు గురైన యువతి విషాదగాథ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన కందాల యాదగిరిరెడ్డి మూడో కూతురు శ్రీవిద్య (19) సూర్యాపేటలో పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. కట్టంగూర్‌కు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు డ్రైవర్ యాదగిరి రెగ్యులర్‌గా నల్లగొండ నుంచి సూర్యాపేటకు వెళుతుంటాడు . అయితే అదే బస్సులో రోజూ ప్రయాణించే శ్రీవిద్యతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇద్దరూ మూడేళ్లగా ప్రేమించుకుంటున్నారు.
కాగా,ఇటీవల ఫైనల్ ఇయర్ పూర్తికావడంతో శ్రీ విద్య నల్లగొండలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ప్రాజెక్ట్‌వర్క్ చేస్తోంది. తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్న శ్రీ విద్యను యాదగిరి గురువారం ఇందిరమ్మ కాలనీలోని తన తండ్రి ఎనమల చంద్రయ్య ఇంటికి తీసుకువచ్చి గొడ్డలితో నరికాడు. మెడ, ఛాతిపై నరకడంతో శ్రీ విద్య అక్కడికక్కడే కుప్పకులి మృతిచెందింది. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.నల్లగొండ డీఎస్పీ రాంమోహన్‌రావు, నకిరేకర్ రూరల్ సీఐ రాఘవరావు, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి ఎస్‌ఐలు పర్వతాలు, ప్రసాదరావు, శ్రీనివాస్‌తో పాటు క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.