ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీతో..
ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీతో..
Published Fri, Sep 1 2017 10:07 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM
భద్రాద్రి: ఓ యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన జిల్లాలోని బూర్గంపహాడ మండలం మోరంపల్లి బంజర గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఎడమకంటి మౌనిక(21) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి మౌనికకు పెళ్లి జరిగిందని.. ఆమె క్యారెక్టర్ మంచిది కాదని అసభ్య రాతలు రాస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన మౌనిక ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు తెలిపారు.
కాగా.. గతంలో వీరిద్దరు తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు మధ్య సఖ్యత లోపించి గొడవలు జరగడంతో తిరిగి ఎవరి ఇళ్లకు వారు చేరారు. అప్పటి నుంచి మౌనిక పై కోపం పెంచుకున్న వెంకట్‌రెడ్డి పారిపోయిన సమయంలో వారు దిగిన ఫోటోలను సామాజిక మాద్యమాల్లో పోస్టు చేస్తూ మౌనికను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులను చంపుతానని, నకిలీ కేసుల్లో ఇరికిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన మౌనిక సూసైడ్ నోట్ రాసి గురువారం రాత్రి ఎలుకల మందు తాగింది. ఈ అంశంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి లాభం లేదని.. వాడికి పోలీసుల సపోర్టుతో పాటు రాజకీయ పలుకుబడి కూడా ఉండటంతో బలవన్మరణానికి పాల్పడుతున్నానని సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
Advertisement
Advertisement