నిశ్చితార్థం నిలిచిపోయిందని.. | woman died Engagement cancelled | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థం నిలిచిపోయిందని..

Published Sun, May 17 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

నిశ్చితార్థం నిలిచిపోయిందని..

నిశ్చితార్థం నిలిచిపోయిందని..

 భూదాన్‌పోచంపల్లి : నిశ్చిదార్థం నిలిచిపోయిందని మనస్తాపం చెందిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని జిబ్లక్‌పల్లిలో శనివారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ ఈరటి నర్సింహ, వసంత దంపతులకు మమత(19) ఏకైక కుమార్తె. మమత చౌటుప్పల్‌లోని ఓ ప్రైవే ట్ కళాశాలలో గత ఏడాది ఇంటర్ పూర్తి చేసి, ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో మండలంలోని ముక్తాపూర్ గ్రా మానికి చెందిన దూరపు బంధువు ముద్దం బాలరాజుతో వివాహం చేయడానికి రెండు కుటుంబాల పెద్ద మనుషులు నిశ్చయించారు.
 
  20తులాల బంగారంతో పాటు మొత్తం రూ.12లక్షలు కట్నం కానుకలు ఇచ్చేందుకు వధువు తల్లిదండ్రులు అంగీకరించారు. గత నెల 29న నిశ్చిదార్థం, ఈ నెల 15న పెళ్లి జరిపించేందుకు నిశ్చయించారు. అందులో భాగంగానే వధూవరుల కోసం నూతన వస్త్రాలు కొనుగోలు చేశారు. పెళ్లి కోసమని పోచంపల్లిలో ఓ ఫంక్షన్‌హాలుకు అడ్వాన్స్ కూడా చెల్లించారు. వీడియో,ఫొటోగ్రాఫర్, ముత్యాల పందిరి డెకరేషన్ వారందరికీ సైతం అడ్వాన్స్‌లు ఇచ్చేసి పెళ్లి పనిలో నిమగ్నమయ్యారు.
 
 కట్నకానుకలు ముందుగా సమర్పిస్తేనే....
 ముందుగా అంగీకరించినట్లుగా నిశ్చిదార్థం రోజునే 20తులాల బంగారం, రెండు లక్షల కట్నం ఇవ్వాలని, లేదంటే పెళ్లి జరుగదని వరుడు, అతడి తల్లిదండ్రులు పేచి పెట్టారు. పెళ్లి నాటికి పూర్తిగా కట్నకానుకలు సమర్పిస్తానని ఎలాగైనా నిశ్చిదార్థం జరిపించాలని వధువు తల్లిదండ్రులు బతిమిలాడారు. కానీ అందుకు వరుడి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో గత నెల 29న జరగాల్సిన నిశ్చిదార్థం అర్ధం తరంగా నిలిచిపోయింది. ఆ తరువాత గ్రామ కులపెద్దలు కల్పించుకుని ఈ నెల 13న ముక్తాపూర్‌లోని వరుడి ఇంటికి వెళ్లారు. జరిగిపోయిందేదో జరిగిందని, అంగీకారం ప్రకారం వధువు తల్లిదండ్రులు కట్నం ఇవ్వకుంటే, తాము ఇస్తామని వారికి భరో సా ఇచ్చారు. వధువు తండ్రి నర్సింహ కాళ్ల్లు పట్టుకుని బతిమిలాడారు. అయినా వారి మనుసు కరుగలేదు.  
 
 అందరికీ ఏం సమాధానం చెప్పాలని..
 పీటల వరకు వచ్చిన పెళ్లి నిలిచిపోవడంతో మమత తీవ్ర మనస్తాపానికి గురైంది. తన పెళ్లి ఖాయమైందని, అందరూ రావాలని తన స్నేహితులు, కాలేజ్ లెక్చరర్స్‌కు మమత ముందుగానే చెప్పింది. పెళ్లి అర్ధంతరంగా ఆగిపోవడంతో వారికి ఏమి సమాధానం చెప్పాలని లోలోన తీవ్ర మదనపడింది. శుక్రవారం మమత తల్లిదండ్రులు హయాత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చేరిన సమీప బంధువును పరామర్శించడానికి వెళ్లారు. మమత ఇంట్లో ఒక్కతే ఉంది. మధ్యా హ్న సమయంలో మమత వరుడు బాలరాజుకు చాలాసార్లు ఫోన్ చేసింది. అయినా అతడి నుంచి స్పందన లభించలేదు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై  ఆమె ఇంటి బయటి నుంచి తాళం వేసి, ఇంటి వెనుక నుంచి  వెళ్లి తలుపులు బిగించుకుని చీరతో ఇంటిపైకప్పు కొక్కానికి ఉరివేసుకుంది.
 
 ఫోన్‌లిఫ్ట్ చేయకపోవడంతో....
 ఊరికి వెళ్లిన తల్లిదండ్రులు మధ్యాహ్న సమయంలో మమత సెల్‌ఫోన్‌కు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా లిఫ్ట్ చేయలేదు. దాంతో ఆందోళన చెందిన వారు వెంటనే సాయంత్రం వరకు ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి, ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉంది. అనుమానం వచ్చి తాళాన్ని పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇంటి పై కప్పు కొక్కానికి మమత చీరతో ఉరివేసి వేలాడుతూ కన్పించింది. కిందికి దింపి చూడగా అప్పటికే మృతి చెందింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు శనివారం సంఘటన స్థలానికి చేరుకొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.
 
 అన్ని సవ్యంగా జరిగితే..
 ముందుగా నిశ్చయించినట్లు అన్ని సవ్యంగా జరిగితే ఈ నెల 15న బాజా భజంత్రీలతో ఆ ఇంట్లో పెళ్లి ఘనంగా జరిగేది. కానీ అదే రోజు వధువు కావాల్సిన యువతి విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. కట్నం కోసం నా బిడ్డను బలితీసుకున్న బాలరాజు, అతడి తల్లిదండ్రులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాగా వరుడు బాలరాజు, అతడి తల్లిదండ్రులు ముందస్తుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement