నాన్నా... అమ్మను చూపించవా?
* హత్య విషయం తెలిసి తల్లడిల్లిన సునీత కుమార్తె
*మృతదేహమైనా చూపమంటూ తండ్రికి వేడుకోలు
*ఇంకా దొరకని హతురాలి తల, కొన్ని శరీరభాగాలు
సాక్షి, హైదరాబాద్: ‘నాన్నా... అమ్మని ఒక్కసారి చూపించు’... అంటూ తన తల్లి హత్యకు గురైందని తెలిసిన క్షణం నుంచి సునీత పదేళ్ల కుమార్తె గుండెపగలిలేలా రోదిస్తూనే ఉంది. ఇంకా తల లభించని, గుర్తించడానికీ వీలులేని, భయంకర స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఆ చిన్నారికి చూపించలేక అప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న కృష్ణ పంటి బిగువనే తన బాధను దిగమింగుకుంటున్నారు. ఇది కుటుంబీకులు, బంధువులనే కాదు పరిచయస్తులు కాని వారినీ కూడా కంటతడి పెట్టించింది. మరోపక్క వరుసగా రెండో రోజూ మూసీ నదిలో సునీత మృతదేహం కోసం గాలింపు కొనసాగింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పెళ్లైన 21 ఏళ్లకు పుట్టిన శ్రావణి...
అంబర్‌పేట్‌కు చెందిన కృష్ణ, సునీతలకు ఇద్దరు సంతానం. వివాహమైన 22 ఏళ్లకు (కుమారుడు పుట్టిన 11 ఏళ్లకు) జన్మించిన కుమార్తె శ్రావణి (10) అంటే వీరికి ప్రాణం. తండ్రి వ్యాపార, ఉద్యోగాల నిమిత్తం వివిధ చోట్లకు తిరుగుతూ ఉండటంతో శ్రావణికి తల్లితోనే అనుబంధం ఎక్కువ. గతనెల 16న సునీత అదృశ్యమైనప్పటి నుంచి కంటిమీద కునుకు లేకుండానే గడిపింది.
ఎప్పటికైనా తనను అమితంగా ఇష్టపడే తల్లి తిరిగి వస్తుందనే ఆశతో ఉంది. సునీత హత్య విషయం బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చినా... గురువారం వరకు కుమారుడు, కుమార్తె శ్రావణికి తెలియకుండా గోప్యంగా ఉంచారు. అయితే బంధువులు రాకతో పాటు పరిస్థితుల్ని గమనించిన శ్రావణి కాస్త అనుమానం వ్యక్తం చేయడంతో తప్పనిసరై కృష్ణ విషయాన్ని బయటపెట్టారు.
ఆ క్షణం నుంచి తల్లడిల్లిపోతున్న చిన్నారి ‘మమ్మీని ఒక్కసారి చూపించు డాడీ’ అంటూ విలపిస్తూనే ఉంది. అయితే ఓ పక్క ముక్కలైన మృతదేహం, మరోపక్క హత్య జరిగి 20 రోజులు దాటడంతో కుళ్లిన స్థితిలో ఉన్న అవయవాలు... ఈ రెంటికీ మించి 36 గంటలుగా గాలిస్తున్నా ఇంకా దొరకని తల. ఈ స్థితిలో తల్లి మృతదేహాన్ని చూస్తే శ్రావణి అనుభవించే క్షోభను ఊహిస్తున్న కృష్ణ కుమార్తెను మార్చురీ దగ్గరకు తీసుకువచ్చే సాహసం చేయలేకపోతున్నారు.
మూసీలో మాంసం ముద్దలు ఏరుతూ...
సునీత మృతదేహాన్ని జగన్నాథనాయుడు ముక్కలుగా చేసి మూసీలో పడేసిన విషయం గుర్తించిన పోలీసులు బుధవారం ఉదయం నుంచి అత్తాపూర్‌లోని మూసీలో కుటుంబీకుల సాయంతో గాలిస్తున్నారు. బుధవారం దొరికిన కొన్ని ముక్కలు మినహా ఎలాంటి ఫలితం కనిపించలేదు. కనీసం హతురాలి తలనైనా వెతికి తీయాలనే ఉద్దేశంతో గురువారం ఉదయం నుంచి గాలింపు చేపట్టారు. మధ్యాహ్నం మూడు సంచుల్లో కొన్ని మాంసం ముద్దలు కనిపించడంతో వాటిని వెంటనే ఉస్మానియా మార్చురీకి తరలించారు. పరిశీలించిన ఫోరెన్సిక్ వైద్యులు అవి హలీంకు సంబంధించినవని చెప్పడంతో మళ్లీ గాలింపు మొదలెట్టారు. గురువారం చీకటి పడటంతో తాత్కాలికంగా ఆపేసి తిరిగి శుక్రవారం ప్రారంభించాలని నిర్ణయించారు.
కర్కశుల అసలు టార్గెట్ చిన్నారే...
సునీత హత్య కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఏర్పాడిన విభేదాలు, స్పర్థల నేపథ్యంలో కృష్ణపై ఉన్న కక్షతో మాజీ వ్యాపార భాగస్వామి, జగన్నాథనాయుడు అతడిని మానసికంగా కుంగదీసి, కోలుకోలేని దెబ్బతీయాలని భావించారు. దీనికోసం ఆ కుటుంబం అల్లారుముద్దుగా చూసుకునే శ్రావణిని టార్గెట్‌గా చేసుకున్నారు.
జూన్ 15 వరకు చిన్నారిని అపహరించి, హతమార్చాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆఖరి నిమిషంలో సునీతను టార్గెట్‌గా చేసుకుని జూన్ 16న పథకాన్ని అమలు చేశారు. సునీతను అత్తాపూర్‌లోని జగన్నాథనాయుడికి చెందిన కార్యాలయానికి తీసుకువెళ్లి ఆమె చీరతోనే ఉరిబిగించి చంపేశారు. ఆపై విషయాన్ని మాజీ వ్యాపార భాగస్వామికి తెలిపి, అక్కడకు రప్పించి చూపించారు. తర్వాత ఐదు గన్నీ బ్యాగ్స్‌లు కొనితెచ్చారు. మృతదేహాన్ని ముక్కలు చేసి.. బ్యాగుల్లో పెట్టి మూసీలో పడేశారని వెలుగులోకి వచ్చింది.