‘నా నుదుట బొట్టు పెట్టనిదే కదలను’ | woman Mentally trouble in Huzoor Nagar | Sakshi
Sakshi News home page

‘నా నుదుట బొట్టు పెట్టనిదే కదలను’

Published Fri, May 8 2015 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

woman Mentally trouble in Huzoor Nagar

చేతబడి చేశాడంటూ మహిళ
 హల్‌చల్
 మహిళకు అండగా నిలిచిన
 గ్రామస్తులు, బంధువులు
 పోలీసులను సైతం నిలువరించిన గ్రామస్తులు
 
 ‘‘ నాకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చేతబడి చేశాడు.. మరణించిన అతడి కూతురు ఆత్మ నాలో ప్రవేశించింది.. అతడు నాకు బొట్టుపెడితేనే నేను మీకు దక్కుతా.. అతడు వచ్చి నా నుదుట బొట్టు పెట్టేంత వరకు నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు’’ అంటూ హుజూర్‌నగర్ మండలం సీతారాంపురంలో బుధవారం ఓ మహిళ హల్‌చల్ సృష్టించింది. స్థానికుల కథనం
 - సీతారాంపురం (హుజూర్‌నగర్)
 
 హుజూర్‌నగర్ మండలం లింగగిరి  గ్రామపంచాయతీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన తురక నరేష్, త్రివేణి దంపతులు. వీరు  స్థానికంగా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవిస్తున్నారు. అంతేగాక గ్రామంలోని శ్రీలక్ష్మీతిరుపతమ్మ దేవాలయంలో అనువంశిక సేవకులుగా కొనసాగుతున్నారు. అయితే ఈ నెల 2వ తేదీ నుంచి త్రివేణి అనారోగ్యం బారిన పడింది. మానసికంగా ఇబ్బంది పడుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. త్రివేణికి చేతబడి చేశారని ఆమె బంధువులు సమీప గ్రామంలోని భూతవైద్యులను సంప్రదించారు.
 
 అయినా త్రివేణి మానసిక పరిస్థితి మరింతగా దిగజారింది. ఈ క్రమంలో ‘‘సీతారాంపురం గ్రామానికి చెందిన ఇనుగుర్తి సాంబయ్యచారి తనకు చేతబడి చేశాడని, అతడు వచ్చి నా నుదుట బొట్టు పెడితేనే నేను మీకు దక్కుతానంటూ శోకిస్తూ చెప్పడం ప్రారంభించింది.’’ వెంటనే త్రివేణి బంధువులు గ్రామ పెద్దలను సంప్రదించి సాంబయ్యచారిని బొట్టు పెట్టాలంటూ పిలిచారు. భయాందోళనకు గురైన సాంబయ్యచారి తన ఇంటి నుంచి తప్పించుకుని పక్క గ్రామానికి పారిపోయాడు. అయితే సాంబయ్యచారి ఇంటిలో లేని విషయం గ్రామపెద్దలు తెలపడంతో వెంటనే త్రివేణి పరుగున అతడి ఇంటికి వెళ్లి అక్కడే కూర్చొని సాంబయ్యచారి పేరు ఉచ్చరిస్తూ తిట్ల పురాణం మొదలు పెట్టడంతో పాటు శోకించడం ప్రారంభించింది.
 
 ఉద్రిక్త పరిస్థితి
 త్రివేణికి ఆమె తల్లిదండ్రులు, బంధువులు, గ్రా మస్తులు ఆసాంతం అండగా నిలిచారు. దీంతో గ్రామంలోని సాంబయ్యచారి ఇంటి  వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.సాంబయ్యాచారి కుటుంబ సభ్యులు ఇంటిలోనే మౌనంగా ఉండి తలుపులు బిగించుకుని కూర్చున్నారు. సమాచారం తెలుసుకున్న హుజూర్‌నగర్ ఎస్‌ఐ పి.వీరరాఘవులు సిబ్బందితో హుటాహుటిన సీతారాంపురం చేరుకున్నారు. అక్కడ త్రివేణి బంధువులు, గ్రామస్థులతో మాట్లాడి మూఢ నమ్మకాలను నమ్మవద్దని బాణామతి, చేతబడులు ఉండవంటూ కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ గ్రామస్తులు, త్రివేణి బంధువులు ససేమిరా అన్నారు.
 
 సాంబయ్యచారిని తీసుకువచ్చి త్రివేణికి బొట్టు పెట్టించాలని పోలీసులతో సైతం వాగ్వాదానికి దిగారు. మూడుగంటల పాటు పోలీసులు సముదాయించినా వినకపోవడంతో వెంటనే త్రివేణిని పోలీస్ వాహనంలోకి ఎక్కించుకుని బయలుదేరారు. అయితే త్రివేణిని తీసుకు వెళ్లవద్దని పొలిమేర దాటితే ఆమె చనిపోతుందంటూ కొందరు గ్రామస్తులు, మహిళలు పోలీస్  వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే  పోలీసులు వాహనానికి అడ్డుగా వచ్చిన వారిని పక్కకు నెట్టివేసి నేరుగా త్రివేణిని హుజూర్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement