పైప్‌లైన్ గుంతలో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న అరుణ
సాక్షి, హైదరాబాద్ : కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా మురికి కాల్వలు, మ్యాన్ హోళ్లు నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ వినూత్న నిరసనకు దిగారు. ఏకంగా మురికి గుంతలో కూర్చుని డ్రైనేజీ పైప్‌లైన్ పనులను అడ్డుకున్నారు. శుక్రవారం మొదలైన ఆమె నిరసన కార్యక్రమం శనివారం (48 గంటలు) కూడా కొనసాగుతోంది. వివరాలు.. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ 30 ఫీట్ల రోడ్డులో కొంత కాలంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు తలెత్తాయి.
దీంతో స్థానికులు సొంతంగా సేకరించిన నిధులతో సుమారు 200 మీటర్ల మేర యూజీడీ పైప్‌లైన్ నిర్మాణ పనులను చేపట్టారు. అయితే ఇష్టానుసారం పైప్‌లైన్లు నిర్మిస్తున్నారని పేర్కొంటూ కాలనీకి చెందిన అరుణ అనే మహిళ పనులను అడ్డుకుంది. డ్రైనేజీ పైప్‌లైన్ కోసం ఏర్పాటు చేసిన గుంతలో కూర్చొని నిరసనకు దిగారు. కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులను జీహెచ్‌ఎంసీ చేస్తుందని... మీరెందుకు చేస్తున్నారంటూ పనులను అడ్డుకుంది. అయితే, సొంత నిధులతో కాలనీని అభివృద్ధి చేసుకోవడంలో తప్పేంటని, తమ పనులకు అడ్డు రావద్దని కాలనీవాసులు ఆమెకు సూచించారు.
అధికారులు ఏం చేస్తున్నారు..
ఇష్టానుసారంగా మురికి నీటి కాల్వలు నిర్మిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురౌతాయని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళిక బద్దంగా డ్రైనేజీ పైప్‌లైన్లు నిర్మించాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. అందుకే ఈ కాలనీలో నివసిస్తున్న మహిళగా నిరసన తెలుపుతున్నానని స్పష్టం చేశారు. చందానగర్ డిప్యూటీ కమిషనర్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, పోలీస్ అధికారులకు ఇదే విషయాన్ని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా మురికి కాలువలు, మ్యాన్ హోళ్లు నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment