కరీంనగర్ జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామం శివారులో శుక్రవారం ఓ ఆగంతకుడు మహిళా రైతు మెడలో బంగారు గొలుసును అపహరించుకుపోయాడు. అనంతమ్మ అనే మహిళ మొక్కజొన్న పొలానికి యూరియా చల్లుతున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి దాహం వేస్తోందని నీరు కావాలని అడిగాడు. ఆమె తాగేందుకు నీళ్లు లేవని సమాధానం చెప్పడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయి మళ్లీ పది నిమిషాల తర్వాత వచ్చాడు.
నీళ్లు తాగావా? అని ఆమె అడగ్గా.. తాగాను, పొలానికి ఏం చల్లుతున్నారని అడుగుతూ దగ్గరకు వచ్చి ఆమె మెడలోని గొలుసును తెంపుకున్నాడు. చెవి కమ్మలు కూడా ఇవ్వాలని బెదిరించగా ఆమె తీసి ఇచ్చేలోపు అటువైపు ఓ వాటర్ ట్యాంకర్ వస్తుండడంతో అతడు బైక్‌పై పరారయ్యాడు. సుమారు రెండు తులాల బంగారు గొలుసు అపహరించుకుపోయాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.