తాండూరు రూరల్ (రంగారెడ్డి జిల్లా) : గ్రామాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్టు షాపులను నియంత్రించాలని మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు శకుంతల సోమవారం ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.... గ్రామాల్లో బెల్టుషాపులు నియంత్రించాలని గతంలో అనేకసార్లు వికారాబాద్ సబ్‌కలెక్టర్, ఎక్సైజ్ అధికారులను కోరినా పట్టించుకోలేదన్నారు. ఈ బెల్టుషాపుల వలన గ్రామాల్లోని ప్రజలు మద్యం మత్తులో తూగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం తాగి విచక్షణ కొల్పోయి అనేక నేరాలు జరిగాయన్నారు. మొన్నటికి మొన్న యాలాల మండలం అచ్యుతాపూర్‌లో ఓ మతిస్థిమితంలేని అమ్మాయిపై అత్యాచారం చేశారన్నారు.
అలాగే తాండూరు మండలం మల్కాపూర్‌లో మద్యం మత్తులో ఓ భర్త గొడ్డలితో భార్యను హత్య చేశారని శకుంతల గుర్తుచేశారు. గ్రామాల్లో కొనసాగుతున్న బెల్టు షాపులను అధికారులు నియంత్రించాలని...లేదంటే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని ఆమె హెచ్చరించారు. మహిళలపై ఇన్ని సంఘటనలు జరిగినా అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో గౌతపూర్ ఉప సర్పంచు హాకిం, వార్డు సభ్యులు నర్సిములు, గ్రామస్తులు వెంకట్‌స్వామి, బాలయ్య, మహేష్, నర్సింహారెడ్డిలు పాల్గొన్నారు.
'గ్రామాల్లో బెల్టుషాపులను నియంత్రించండి'
Published Mon, Sep 7 2015 3:44 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement