జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ
విజ్ఞానం సాధించేందుకు చదువు చక్కని మార్గం అని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం గొప్ప మార్పునకు సంకేతమని.. ఇది అమలు కావడంతో అనేక మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చారని చెబుతున్నారు. అయితే సభలు, సమావేశాల్లో మాట్లాడే అవకాశం.. వేదికపై కుర్చీలు ఇచ్చే విషయంలో ఇప్పటికీ అన్ని చోట్ల వివక్ష ఉందని.. ఈ పరిస్థితిలో మార్పు రావాలని కోరుతున్నారు. ఇదంతా ఒక్కరోజులో వచ్చేది కాదని.. మార్పు మొదలైందని.. అది మరింత వేగంగా జరగాలని ఆకాంక్షిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, వరంగల్: అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు స్వావలంబన సాధించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ పిలుపునిచ్చారు. ‘విజ్ఞానం పెంచుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. అప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు.. విజ్ఞానం సాధించేందుకు చదువు చక్కని మార్గం.’ అని అంటున్నారు. ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతుల్లో చోటుచేసుకుంటున్న మార్పులపై తన అభిప్రాయాలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. పద్మ ఏమంటున్నారో ఆమె మాటల్లోనే..
విజ్ఞానం పెంచుకోవాలి..
గతంతో పోల్చితే ఆడపిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వచ్చింది. మగ పిల్లలకు పోటీగా ఆడ పిల్లలను చదివిస్తున్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తున్నారు. గతంలో ఇంత చక్కని అవకాశం లేదు. ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకున్నప్పుడు మహిళా సాధికారత అనేది సాధ్యమవుతుంది.
ఒత్తిడిని తగ్గించాలి..
మన కార్యాలయాలన్నీ పురుషుల పనితీరుకు తగ్గట్లుగానే ఉంటాయి. వర్కింగ్ ఉమెన్ కష్టానికి తగ్గట్లుగా పని ప్రదేశాల్లో మార్పు రావాలి. ఇంటి దగ్గర వంటతో మొదలు పెట్టి ఆఫీసు పని.. మళ్లీ సాయంత్రం ఇంటి పని.. ఇలా పొద్దంతా కష్టపడతారు. వారికి ఒత్తిడి తగ్గేలా ఆఫీసులో వాతావారణం ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో వెయిటింగ్ రూం అందుబాటులోకి తెచ్చాం. మధ్యాహ్నం లంచ్ చేసేందుకు మహిళా ఉద్యోగులు దీన్ని వినియోగిస్తున్నారు. కొంత ప్రైవసీ ఉంటుంది. ఈ కొంత ఎంతో ఒత్తిడిని తగ్గిస్తుంది.
చేతల్లో చూపించాలి..
స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అనే స్లోగన్లు అనేక చోట్ల కనిపిస్తాయి. ఇలా మాటల్లో, రాతల్లో ఉండే వాటిని చేతల్లో చూపించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం గొప్ప మార్పునకు సంకేతం. ఈ విధానం అమలు కావడం వల్ల అనేక మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చారు. సభలు, సమావేశాల్లో మాట్లాడే అవకాశం, వేదికపై కుర్చీలు ఇచ్చే విషయంలో ఇప్పటికీ అన్ని చోట్ల వివక్ష ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఇదంతా ఒక్కరోజులో వచ్చేది కాదు. మార్పు మొదలైంది. అది మరింత వేగంగా జరగాలి. ఇప్పటికే స్థానిక సంస్థలో పెద్ద ఎత్తున మహిళలు రాజకీయ ప్రవేశం చేశారు. రానున్న రోజుల్లో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే రోజు వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment