Gaddala padma
-
చదువుతోనే మార్పు
విజ్ఞానం సాధించేందుకు చదువు చక్కని మార్గం అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం గొప్ప మార్పునకు సంకేతమని.. ఇది అమలు కావడంతో అనేక మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చారని చెబుతున్నారు. అయితే సభలు, సమావేశాల్లో మాట్లాడే అవకాశం.. వేదికపై కుర్చీలు ఇచ్చే విషయంలో ఇప్పటికీ అన్ని చోట్ల వివక్ష ఉందని.. ఈ పరిస్థితిలో మార్పు రావాలని కోరుతున్నారు. ఇదంతా ఒక్కరోజులో వచ్చేది కాదని.. మార్పు మొదలైందని.. అది మరింత వేగంగా జరగాలని ఆకాంక్షిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్: అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు స్వావలంబన సాధించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ పిలుపునిచ్చారు. ‘విజ్ఞానం పెంచుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. అప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు.. విజ్ఞానం సాధించేందుకు చదువు చక్కని మార్గం.’ అని అంటున్నారు. ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతుల్లో చోటుచేసుకుంటున్న మార్పులపై తన అభిప్రాయాలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. పద్మ ఏమంటున్నారో ఆమె మాటల్లోనే.. విజ్ఞానం పెంచుకోవాలి.. గతంతో పోల్చితే ఆడపిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వచ్చింది. మగ పిల్లలకు పోటీగా ఆడ పిల్లలను చదివిస్తున్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తున్నారు. గతంలో ఇంత చక్కని అవకాశం లేదు. ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకున్నప్పుడు మహిళా సాధికారత అనేది సాధ్యమవుతుంది. ఒత్తిడిని తగ్గించాలి.. మన కార్యాలయాలన్నీ పురుషుల పనితీరుకు తగ్గట్లుగానే ఉంటాయి. వర్కింగ్ ఉమెన్ కష్టానికి తగ్గట్లుగా పని ప్రదేశాల్లో మార్పు రావాలి. ఇంటి దగ్గర వంటతో మొదలు పెట్టి ఆఫీసు పని.. మళ్లీ సాయంత్రం ఇంటి పని.. ఇలా పొద్దంతా కష్టపడతారు. వారికి ఒత్తిడి తగ్గేలా ఆఫీసులో వాతావారణం ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో వెయిటింగ్ రూం అందుబాటులోకి తెచ్చాం. మధ్యాహ్నం లంచ్ చేసేందుకు మహిళా ఉద్యోగులు దీన్ని వినియోగిస్తున్నారు. కొంత ప్రైవసీ ఉంటుంది. ఈ కొంత ఎంతో ఒత్తిడిని తగ్గిస్తుంది. చేతల్లో చూపించాలి.. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అనే స్లోగన్లు అనేక చోట్ల కనిపిస్తాయి. ఇలా మాటల్లో, రాతల్లో ఉండే వాటిని చేతల్లో చూపించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం గొప్ప మార్పునకు సంకేతం. ఈ విధానం అమలు కావడం వల్ల అనేక మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చారు. సభలు, సమావేశాల్లో మాట్లాడే అవకాశం, వేదికపై కుర్చీలు ఇచ్చే విషయంలో ఇప్పటికీ అన్ని చోట్ల వివక్ష ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఇదంతా ఒక్కరోజులో వచ్చేది కాదు. మార్పు మొదలైంది. అది మరింత వేగంగా జరగాలి. ఇప్పటికే స్థానిక సంస్థలో పెద్ద ఎత్తున మహిళలు రాజకీయ ప్రవేశం చేశారు. రానున్న రోజుల్లో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే రోజు వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. -
అమృత హస్తాలు...
పల్లె.. పట్టణం.. నగరం.. ఎక్కడైనా మహిళలు, శిశువుల ఆరోగ్య సంరక్షణలో వారు భాగమవుతారు. పిల్లలను బడిబాట పట్టించడంలో ముందుంటారు. మొత్తంగా స్త్రీలు, శిశువులు, బాలల సంరక్షణలో వారిది కీలకపాత్ర. అలాంటి అంగన్వాడీ వర్కర్‌గా బాధ్యతలు నిర్వర్తించి.. జిల్లాలో ఉన్నతమైన జెడ్పీ చైర్పర్సన్ పదవిని చేపట్టారు గద్దల పద్మ. అంగన్వాడీల కష్టసుఖాలు, అనుభవాలు, సమస్యలు, అవసరాలను ‘సాక్షి’ తరఫున రిపోర్టర్‌గా మారి తెలుసుకున్నారు. అంగన్వాడీల సంక్షేమానికి కృషి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసిన నాకు.. వారి సమస్యలపై అవగాహన ఉంది. ప్రభుత్వం తరఫున అంగన్వాడీ కార్యకర్తలు, ఆయూలకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తా. జిల్లా స్థాయిలో, నా పరిధి మేరకు అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేస్తా. అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమం కోసం పని చేస్తా. - గద్దల పద్మ, జెడ్పీ చైర్పర్సన్ పద్మ : ఒకప్పుడు నేను అంగన్వాడీ కార్యకర్తనే. ఈ జాబ్ పట్ల మీ అభిప్రాయం ? జ్ఞానసుందరి : విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత తొలి గురువుగా వ్యవహరించే బాధ్యత మాది. పిల్లలకు ఆటపాటలతో కూడిన చదువు నేర్పించడమే కాకుండా, వారికి పోషకాహారం అందించే పని కూడా మాదే. ఇంకాచెప్పాలంటే బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే గర్భిణులకు జాగ్రత్తలు, పోషకాహారం అందించడం నుంచి మా పని మొదలవుతుంది. అందువల్లే జీతం తక్కువగా ఉన్నా... సేవాభావంతో ఈ ఉద్యోగాలు చేస్తున్నాం. పద్మ : చిన్నపిల్లలు అంగన్వాడీ సెంటర్‌కు రామని సతాయిస్తారు .. వారితో ఇబ్బంది అనిపించదా ? లలిత : చిన్నపిల్లల అల్లరి, మారం చేయని ఇళ్లు ఉండదు. పిల్లలను ఎలా సముదాయించాలో ప్రతి మహిళకూ అలవాటే. మేము ఆ పనిని ఇంకాస్త మెరుగ్గా చేస్తాం. చిన్న పిల్లలు అభినయంతో కూడిన విద్యను నేర్చుకోవడానికి ఇష్టపడుతారు. ఏడుస్తూ పిల్లలు అంగన్వాడీ సెంటర్‌కు రాగానే చప్పట్లు కొట్టడం, గట్టిగా అరవడం వంటి పనులు చేసి పిల్లల దృష్టి మరల్చుతాం. ఆ తర్వాత ఆటపాటల ద్వారా వారికి ప్రాథమిక విషయాలపై అవగాహన కల్పిస్తాం. పద్మ : పిల్లలకు ఆటపాటల ద్వారా చదువు ఎలా నేర్పిస్తారు ? లలిత : పాటలు పాడడం ద్వారా పిల్లలతో మమేకమవుతాం. తోటిపిల్లలతో ఎలా మెలగాలో నేర్పుతాం. క్రమశిక్షణ అలవాటు చేస్తాం. శుభ్రత పాటించేలా చూస్తాం. మా సెంటర్లోకి రాగానే పిల్లలందరు ఒకే చోట వరుసలో చెప్పులు విడుస్తారు. కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్లలో చైతన్యం కలిగించేందుకు పాటలు కూడా పాడతాం. (అంటూనే తల్లి కాబోతున్న చెల్లెలా అనే పాట పాడి వినిపించారు.) ప్రశ్న : మీరు చేస్తున్న పనిని ప్రజాప్రతినిధులు గుర్తిస్తున్నారా ? గ్రామ సభలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారా ? జవాబు : గ్రామాల్లో సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు మా సేవలను గుర్తిస్తున్నారు. సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. పద్మ : మీరు ఎదుర్కొనే సమస్యలు ? పూల : అంగన్వాడీ కార్యకర్తగా ఉండే పని చాలా ఎక్కువ. గ్రామస్థాయిలో ఇంటింటికి సేవలు అందించే బాధ్యత మాది. ప్రతి రోజూ 11 రిజిస్టర్లు రాయాలి. వీటితోనే మాకు సరిపోతుంది. వీటిని ఎప్పటికప్పుడు మా సూపర్వైజర్లు పర్యవేక్షిస్తుంటారు. వీటితోనే పని ఒత్తడి ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఇతర ప్రభుత్వ పథకాలకు చెందిన పనులు మాకు అప్పగించడం భారంగా మారుతోంది. సమగ్ర సర్వే, బీఎల్ఓ, పల్స్‌పోలియో వంటి పనులు తలకు మించిన భారంగా మారాయి. వీటితో మేము అంగన్వాడీ సెంటర్లకు దూరమవుతున్నాం. పద్మ : ఇతర పనులు చేసినందుకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా ? సరస్వతి : సమగ్ర సర్వేలో పాల్గొంటే మాకు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇంత వరకు రాలేదు. బీఎల్ఓ విధుల్లో పాల్గొంటే రూ.మూడు వేలు ఇస్తామని చెబుతున్నారు. ఇచ్చే డబ్బులతో పోల్చితే చేసే పని ఎక్కువ. పల్స్‌పోలియో డ్యూటీ ఉంటే ఏకంగా వారం పాటు సెంటర్‌కు దూరం కావాల్సి వస్తుంది. రమాతార : పట్టణ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించడం కష్టంగా ఉంటోంది. అంగన్వాడీ కేంద్రాలకు అద్దెగా ప్రభుత్వం రూ.3 వేలు చెల్లిస్తుంది. ఈ అద్దెలో భవనాలు లభించడం కష్టం. ఒకవేళ దొరికినా.. ప్రభుత్వం నుంచి క్రమం తప్పకుండా అద్దె రాదు. మా సెంటర్‌కు సంబంధించి 11 నెలలుగా అద్దె బిల్లు రావడం లేదు. మరోవైపు ఇంటి ఓనర్ల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. కొన్ని సందర్భాల్లో మా నెల జీతం నుంచి అద్దె చెల్లించాల్సి వస్తోంది. దీంతో మా ఇళ్లలో సమస్యలు ఎదుర్కొంటున్నాం. పద్మ : మీరు ఇతర పనుల్లో ఉన్నప్పుడు అంగన్వాడీ సెంటర్ల పరిస్థితి ? ప్రసన్న : ఆయాలు నిర్వహిస్తుంటారు. మా ఆయా పదో తరగతి వరకు చదివింది. ఆమె ఇంటింటికీ వెళ్లి పిల్లలను తీసుకొస్తుంది. వారి చేత పాటలు పాడిస్తుంది. పోషకాహారం వండిపెడుతుంది. విజయనిర్మల : చదువుకున్న ఆయాలు ఉండడం కలిసొస్తుంది. చాలా సార్లు ఆయాలకు వంట పనితోనే సరిపోతుంది. పద్మ : పోషకాహార లోపాలను ఎలా గుర్తిస్తారు ? అరుణ : పిల్లల వయసును బట్టి ఎంత బరువు ఉండాలనే చార్ట్ ప్రతి అంగన్వాడీ కార్యకర్త వద్ద ఉంటుంది. దీని ఆధారంగా పోషకలోపాలను గుర్తిస్తాం. అదేవిధంగా... తల్లిబిడ్డలకు తగ్గట్లుగా గర్భిణులు, బాలింతలకు అమృతహస్తం, బాలామృతం పథకాల ద్వారా పాలు, కోడిగుడ్లు, శనగలు అందిస్తాం. పద్మ : పాలు, కోడిగుడ్లు సక్రమంగా అందిస్తారా ? అరుణ : నెలకు 16 గుడ్లు అందించాలి. కానీ.. గుడ్లు సరఫరా చేసే వ్యక్తులు సకాలంలో అందివ్వట్లేదు. ఇచ్చే గుడ్లు సైతం చాలా నాసిరకంగా ఉంటాయి. శనగలు అయితే చాలా సార్లు పుచ్చు పట్టిపోయి ఉంటాయి. విద్యార్థులు, బాలింతలు, గర్భిణుల సంఖ్యకనుగుణంగా కాకుండా కాంట్రాక్టర్ ఇష్టారీతిగా సరఫరా చేస్తుంటారు. దీనివల్ల పోషకాహారం అందిచడంలో ఆలస్యమవుతోంది. చాలామంది ఈ గుడ్లను మేమే దాచుకుంటామని, అమ్ముకుంటామని అనుకుంటారు. పద్మ : పాడైన గుడ్లు, శనగలు పిల్లలకు పెడతారా ? అరుణ : లేదు... పాడైన గుడ్లు వచ్చినప్పుడు వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకెళతాం. పిల్లలకు పెట్టం. పద్మ : గుడ్ల నాణ్యతపై అధికారులకు ఫిర్యాదు చేయరా ? అరుణ : గుడ్లు బాగా లేకుంటే వెంటనే మాకు వద్దని చెబుతాం. సరఫరా చేసే వ్యక్తులు ఆటోల్లో వచ్చి ఇచ్చేసి వెళతారు. మా మాట పట్టించుకోరు. పుచ్చిపోయిన శనిగలు వచ్చినప్పుడూ ఇదే పరిస్థితి. వీటిని మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పరిస్థితిలో మార్పు రావడం లేదు. పద్మ : అంగన్వాడీ కార్యకర్తగా మీరు తెచ్చిన మార్పు ? షర్మిల : ఓల్డ్ బస్‌డిపో వెనక స్లమ్‌ఏరియా అంగన్వాడీ సెంటర్లో కార్యకర్తగా వెళ్లాను. అప్పుడు అక్కడ టాయిలెట్లు లేక పారిశుద్ధ్య నిర్వహణ దారుణంగా ఉండేది. ఇక్కడ చిలకజోస్యం చెప్పేవాళ్లు, ప్రతి రోజూ గంపలో సామాన్లు పెట్టుకుని అమ్ముకునే కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. రోగం వస్తే మంత్రాల వైద్యం, తాయెత్తులను నమ్మేవాళ్లు. మెల్లమెల్లగా వీరిలో ఒకరిగా కలిసిపోయాను. గర్భిణులు క్రమం తప్పకుండా ఆస్పత్రులకు వెళ్లేలా అలవాటు చేశాను. పిల్లలు అంగన్వాడీ సెంటర్లకు వస్తున్నారు. గతంలో ఇక్కడ మహిళలకు ప్రసవమైన తెల్లారే బిడ్డతో సహా నెత్తిన గంపతో బయటకు వెళ్లే వారు. దీని వల్ల తల్లీబిడ్డకు ఆరోగ్యసమస్యలు వచ్చేవి. ఇప్పుడు రెండు నెలల వరకు ఆగుతున్నారు. ఇప్పటికీ వీళ్లకు సూది అంటే భయం. దాన్ని పోగొట్టలేకపోయాను. పద్మ : అంగన్వాడీ సెంటర్లు మెరుగ్గా సేవలందించాలంటే ఏం చేయాలి? లలిత : అంగన్ వాడీ సెంటర్లను ప్లే స్కూళ్లుగా మారుస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అలా చేస్తే ఆయనకు వేలకోట్ల దండాలు. చిన్నారులను అంగన్వాడీ సెంటర్లలో చేర్చడం తప్పనిసరి చేయాలి. ఇక్కడి చేరిన వారికే స్కూళ్లలో అడ్మిషన్లకు అర్హులని ప్రకటించాలి. అంగన్వాడీ సెంటర్లకు నాణ్యమైన వస్తువులు సరఫరా అయ్యేలా చూడాలి. పద్మ : అంగన్వాడీ వర్కర్లుగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ? సరస్వతి : అంగన్వాడీ కార్యకర్తలు గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయమవుతూ పనిచేస్తారు. ప్రభుత్వం సైతం అనేక విషయాలపై వీరిపై ఆధారపడుతుంది. కాబట్టి అంగన్వాడీ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలి. పూర్తిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనాన్ని రూ.4,500 నుంచి రూ 15,000కు పెంచాలి. ఆయాల కనీస వేతనం రూ.10,000 చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ వంటి సౌకర్యాలు కల్పించాలి. -
బీఆర్జీఎఫ్ ప్రణాళికలకు డీపీసీ ఆమోదం
జిల్లాపరిషత్: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి(బీఆర్జీఎఫ్) పథకంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.32.47కోట్లతో రూపొందించిన ప్రణాళికలను జిల్లా ప్రణాళిక కమిటీ ఆమోదించింది. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం కమిటీ చైర్మన్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన సమన్వయ కార్యదర్శి, కలెక్టర్ జి.కిషన్ నేతృత్వంలో డీపీసీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన బీఆర్జీఎఫ్ నిధులు మంజూరయ్యాయని, ఇందుకనుగుణంగా ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. నిధుల్లో 50శాతం పంచాయతీలకు, 30శాతం మండల పరిషత్‌లకు, 20శాతం జిల్లా పరిషత్‌కు కేటాయిం చామని, ఆయా స్థానిక సంస్థల సర్వసభ్య సమావేశాల్లో సభ్యులు ప్రతిపాదించిన పనులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశం హడావుడిగా నిర్వహించడం సరికాదన్నారు. డీపీసీకి చట్టబద్ధమైన కమిటీ ఉన్నదన్నారు. స్థానిక సంస్థల నుంచి డీపీసీ సభ్యులు లేకున్నా, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నప్పటికీ... ప్రణాళికల రూపొందించిన సమయంలో ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు, ముఖ్యంగా వరంగల్ కార్పొరేషన్ నుంచి ఎంపీలుగా సభ్యులమైన తమకు ప్రతి పాదనల విషయం ఎందుకు చెప్పలేదని కలెక్టర్‌ను అడిగారు. సమయాభావం వల్ల ఇలా చేయాల్సి వచ్చిందని కలెక్టర్ కిషన్ సమాధానమిచ్చారు. నిధులు మురిగిపోతాయన్న కారణంగా ఈ ప్రతిపాదనలను ఆమోదించాల్సి వస్తోందని శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ సీతారాంనాయక్ మా ట్లాడుతూ డీపీసీ సమావేశాలను నిర్వహించేందుకు నిర్ణీత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రణాళికలన్నీ తయారు చేసి ఆమోదించాలని డీపీసీ ముందు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్సీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన డీపీసీ సమావేశమని సమాచారం ఇచ్చారని, ఆ తర్వాత 24, మళ్లీ 29న నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం సమావేశాలను వాయిదా వే సేందుకు వీలు లేదని, దీనికి పద్ధతి ఉంటుందన్నారు. వరంగల్ కౌన్సిల్లో ఏం పనులు ప్రతిపాదించారో తెలియదు. మండల పరిషత్‌లలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు గొడవలు జరుగుతున్నాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి. తప్పనిసరి అనడంతో డీపీసీలో ప్రణాళికలకు ఆమోదిస్తున్నామన్నారు. సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి, డీపీసీ సభ్యులు బూర ముత్తిలింగం, రావుల రవిచందర్‌రెడ్డి, జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. డీపీసీ నిర్వహణ తేదీపై తగిన సమయంలో సమాచారం ఇవ్వకపోవడం వల్ల తాము హాజరు కాలేక ోయామని, ఇలా ఎందుకు చేశారంటూ ఎంపీ గుండు సుధారాణీ, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్‌ను ప్రశ్నించారు. -
ఇది గొప్ప అనుభూతి!
చైర్పర్సన్ అవుతానని ఊహించలేదు నాపై నమ్మకముంచిన పార్టీకి రుణపడి ఉంటా ఉద్యోగం చేయడమే లక్ష్యమనుకున్నా.. పెళ్లయ్యే నాటికి వంటకూడా రాదు మావారి ఒత్తిడితో చదువు కొనసాగించా ఇప్పుడు నా లక్ష్యం ‘బంగారు తెలంగాణ’ జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ నిజానికి ఆమె ఓ సంచలనం. జీవితంలో అన్నీ అనూహ్య ఘటనలే. బాగా చదువుకుందామనుకునే సమయంలో పెళ్లి. అత్తారింటికి వెళ్లినా ఏమీ తెలియని తనం. భర్త ప్రోత్సాహంతో చదువు కొనసాగించిన ఆమె రాజకీయాలపై అవగాహన లేకున్నా ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచారు. అయినా రాజకీయాలు ఆసక్తిని పెంచలేకపోయాయి. ఆ తర్వాత తిరిగి డిగ్రీ పూర్తిచేసి టీచరై తన లక్ష్యం సాధించుకున్నారు. ఈసారి మరో మలుపు.. కలిసొచ్చిన అదృష్టం ఓ వైపు.. సాధించుకున్న ఉద్యోగం మరోవైపు.. తీవ్ర అంతర్మథనం.. చివరికి ఉద్యోగం వదిలేశారు. జెడ్పీటీసీ సభ్యురాలిగా బరిలోకి దిగి విజయకేతనం ఎగురవేశారు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనేనా.. అని ఆనందంలో ఉండగానే.. ఈసారి మరో మేలి మలుపు. కలలో కూడా ఊహించని జెడ్పీ చైర్పర్సన్ పదవి ఆమెను వరించింది. ఒకదాని తర్వాత ఒకటి.. తేరుకునేలోపే మరోటి. ‘అడగకుండానే పార్టీ ఎన్నో ఇచ్చింది. ఇప్పుడు నాకంటూ ఏ ఆశలూ లేవు. ప్రజలు మెచ్చేలా పనిచేయడం.. బంగారు తెలంగాణ సాధించడం.. ఇప్పుడిదే నా లక్ష్యం..’ అంటున్నారు జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ. పెళ్లయ్యే నాటికి వంట కూడా చేయడం రాదన్న పద్మ.. తన భర్త ప్రోత్సాహం, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహకారం వల్లే ఈస్థాయికి ఎదిగానని, ఇది తనకు గొప్ప అనుభూతి అని చెబుతున్నారు. తనపై ఎంతో నమ్మకంతో గెలిపించిన నర్మెట ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అంటున్న ఆమె.. తన అంతరంగాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. మాది రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురం. అమ్మ శాగ మాణిక్యమ్మ, నాన్న యాదగిరి. సాధారణ కుటుంబం. మా ఇంట్లో నేనే పెద్దదాన్ని. నాకు ఇద్దరు చెల్లెళ్లు అనిత, రజిత, తమ్ముడు సతీష్ ఉన్నారు. నాన్న లిడ్‌క్యాప్‌లో సేల్స్ మేనేజరుగా హైదరాబాద్‌లో పనిచేసేవారు. మొదట్లో మేమంతా గ్రామంలోనే ఉండేవాళ్లం. కానీ చదువుల కోసమని తర్వాత జనగామకు మ కాం మార్చాం. నాన్నేమో అక్కడి నుంచే హైదరాబాద్ వెళ్లి వచ్చేవారు. నేను పదో తరగతి చదువుతున్న సమయంలో నాన్న ఆరోగ్యం దెబ్బతినడంతో మేనత్త కొడుకు నర్సింగరావుతో నా పెళ్లి చెయ్యాలని ఇంట్లో నిర్ణయిం చారు. మూడు రోజుల్లో పెళ్లి అనగా నాన్న చనిపోయారు. దీంతో గౌతమి మహిళా కాలేజీలో ఇంటర్మీడియెట్‌లో చేరా. ఏడాదిలోపు శుభకార్యం చేయాలనే ఉ ద్దేశంతో 1994 ఫిబ్రవరి 28న పెళ్లి చే శారు. అలా నర్మెట్ట మండలం గండిరామారం కోడలుగా వెళ్లా. ఆడబిడ్డలే వంట నేర్పారు మేనరికమే కావడంతో అత్తారింట్లో నాకు అంతా తెలిసినవారే. కాబట్టి ఇబ్బందులేమీ లేవు. పెళ్లయ్యే నాటికి నాకు వంట కూడా రాదు. ఇంట్లో అంతా అమ్మే చూసుకునేది. నాన్న కూడా మాకు ఇంటి పనులేవీ చెప్పనిచ్చేవారు కాదు. నాకు వంటరాదని తెలిసి ఆడబిడ్డలే వంట నేర్పారు. నాకు నలుగురు ఆడబిడ్డలు కాగా ఇద్దరు ఊర్లోనే ఉండేవారు. నన్ను ఎంతోబాగా చూసుకునేవారు. పెళ్లయ్యాక మావారి సహకారంతో ఇంటర్మీడియెట్‌లో చేరా. కాలేజీకి రోజూ జనగామ వచ్చి వెళ్లేదాన్ని. ఎక్కువసార్లు మావారు తోడుగా వచ్చేవారు. అయితే రెండు పరీక్షలకు హాజరుకాకపోవడంతో ఇంటర్మీడియట్ తప్పా. దీంతో 2006లో దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేశా. వ్యవసాయం ఉండడంతో ఆర్థికంగా మాకు పెద్దగా ఇబ్బందులు ఉండేవి కావు. ఎమ్మెల్యే అండగా నిలిచారు పోటీలోకి దిగే విషయంలో ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్న సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాకు అండగా నిలిచారు. మీకేం పర్వాలేదు. అండగా ఉంటా. మీరు పోటీచేయడం.. అంటూ భరోసా ఇచ్చారు. ఆయన మద్దతు, ప్రోత్సాహంతో బరిలోకి దిగా. 4,300 ఓట్ల మెజారిటీతో విజయం సాధించా. నన్ను గెలిపించిన నర్మెట ప్రజలకు రుణపడి ఉంటా. ప్రస్తుతం నేనీ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఎమ్మెల్యే సహకారమే. అనూహ్యంగా రాజకీయాల్లోకి.. బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం చేయాలని ఉండేది. ముఖ్యంగా టీచర్ కావాలని కలలు కనేదానిని. 2001లో గండి రామారం ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. అప్పటికే మా ఆయన టీఆర్ఎస్లో పనిచేస్తున్నారు. ఆయన ఒత్తిడితో రాజకీయాల్లోకి రాక తప్పలేదు. టీఆర్ఎస్ తరపున పోటీచేసి ఆ ఎన్నికల్లో విజయం సాధించా. రాజకీయాలంటే ఏమాత్రం అవగాహన లేని నాకు అంతా కొత్తగా అనిపించే ది. మండల అభివృద్ధి సమీక్ష సమావేశాలకు వెళ్లేదాన్ని. ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొనేదాన్ని. ఆ తర్వాత క్రమంగా రాజకీయాలపై అవగహన పెరిగింది. నేను ఎన్నికైన ఎంపీటీసీ స్థానం పరిధిలో మూడు గ్రామాలుండేవి. అందులో రెండు గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడేవారు. దీంతో ఆయా గ్రామాల ప్రజల రవాణా ఇబ్బందులు పరిష్కరించేందుకు పట్టుబట్టి బ్రిడ్జి నిర్మాణాలకు అవసరమైన నిధులు సాధించడం.. అవి పూర్తిచేయడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎంపీటీసీ సభ్యురాలిగా నా స్థాయిలో గ్రామానికి చేయాల్సింది చేశా. కలలో కూడా ఊహించలేదు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మావారు పార్టీలో పనిచేస్తున్నారు. అంతకుముందు ఓ పత్రికలో నర్మెట విలేకరిగా పనిచేసేవారు. 2006లో ఆ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీకోసం క్రమశిక్షణగా, నిబద్ధతతో పనిచేసేవారు. అదే నాకు జెడ్పీటీసీ సభ్యురాలిగా పోటీచేసే అవకాశం తెచ్చిపెట్టింది. అక్కడితోనే సంతృప్తి చెందినా ఆ తర్వాత పార్టీ మాకు జెడ్పీ చైర్‌పర్సన్‌గా మరో పెద్ద అవకాశం ఇచ్చింది. ఈ పదవి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. పార్టీ పెద్దలు మమ్మల్ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చారు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను జెడ్పీ చైర్పర్సన్ కావడం మాటలకందని అనుభూతి. పార్టీకి మేం రుణపడి ఉంటాం. పార్టీ నేతల సమష్టి కృషి వల్లే జిల్లా పరిషత్ పీఠం దక్కింది. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాంనాయక్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు, స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఎ.చందులాల్, కొండా సురేఖ, అరూరి రమేశ్, శంకర్‌నాయక్ ఎంతో మద్దతు తెలిపారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, నేతలు ఇచ్చిన మద్దతును మర్చిపోలేను. వదులుకోబుద్ధి కాలేదు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో మా ఆయన నర్సింగరావు నర్మెట మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఉద్యమంలో, పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా పనిచేశారు. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నర్మెట జెడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. నాకు పోటీలోకి దిగాలనిపించలేదు. ఎన్నికల్లోకి దిగితే ఉద్యోగం వదులుకోవాలి. పైగా ఖర్చు. దీంతో పోటీచేసేందుకు వెనకాముందు ఆలోచించా. బంగారు తెలంగాణే లక్ష్యంగా.. ఊహించని పదవి వచ్చింది. నాకంటూ ఏ ఆశలూ లేవు. అందరూ మెచ్చేలా పనిచేయడమే ఇప్పుడు నా ముందు న్న లక్ష్యం. చారిత్రక నేపథ్యం ఉన్న జిల్లాకు చైర్పర్సన్ కావడం అరుదైన అవకాశంగా భావిస్తున్నా. అన్ని వర్గాల ప్రజల కష్టాలు నాకు తెలుసు. మహిళా సాధికారత, దళితుల అభ్యన్నతికి కృషి చేస్తా. నా బాధ్యతలను పారదర్శకంగా నిర్వహిస్తా. అందరి సహకారంతో సమష్టిగా ముందుకెళ్తా. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తా. నా శక్తి మేరకు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా. అయినా.. ఆసక్తి పెరగలే ఎంపీటీసీ సభ్యురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించినా రాజకీయాలపై మాత్రం ఆసక్తి పెరగలేదు. దీంతో పదవీ కాలం ముగిసిన తర్వాత డిగ్రీ పూర్తిచేసి మా ఊరు గండిరామారంలో అంగన్వాడీ-2 సెంటర్లో టీచర్‌గా చేరా. జనగామలో అద్దె ఇంట్లో ఉంటూనే పిల్లల చదువులు, నా ఉద్యోగం చూసుకునేదాన్ని. మాకు ఇద్దరు పిల్లలు అఖిల్, నిఖిల్. పెద్దోడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తొమ్మిదో తరగతి, చిన్నోడు ఇక్కడే తేజస్వీ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నారు. 2010 నుంచి జెడ్పీటీసీ సభ్యురాలిగా నామినేషన్ వేసే వరకు టీచర్‌గా పనిచేశాను. నేను చైర్పర్సన్ అయ్యాక నా బాల్యస్నేహితులు వచ్చి అభినందించడం నాకు గొప్ప అనుభూతిని మిగిల్చింది.