ఇది గొప్ప అనుభూతి! | chairperson Padma | Sakshi
Sakshi News home page

ఇది గొప్ప అనుభూతి!

Published Sun, Aug 3 2014 4:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

ఇది గొప్ప అనుభూతి!

ఇది గొప్ప అనుభూతి!

  •       చైర్‌పర్సన్ అవుతానని ఊహించలేదు
  •      నాపై నమ్మకముంచిన పార్టీకి రుణపడి ఉంటా
  •      ఉద్యోగం చేయడమే లక్ష్యమనుకున్నా..
  •      పెళ్లయ్యే నాటికి వంటకూడా రాదు
  •      మావారి ఒత్తిడితో చదువు కొనసాగించా
  •      ఇప్పుడు నా లక్ష్యం ‘బంగారు తెలంగాణ’
  •      జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ
  • నిజానికి ఆమె ఓ సంచలనం. జీవితంలో అన్నీ అనూహ్య ఘటనలే. బాగా చదువుకుందామనుకునే సమయంలో పెళ్లి. అత్తారింటికి వెళ్లినా ఏమీ తెలియని తనం. భర్త ప్రోత్సాహంతో చదువు కొనసాగించిన ఆమె రాజకీయాలపై అవగాహన లేకున్నా ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచారు. అయినా రాజకీయాలు  ఆసక్తిని పెంచలేకపోయాయి. ఆ తర్వాత తిరిగి డిగ్రీ పూర్తిచేసి టీచరై తన లక్ష్యం సాధించుకున్నారు. ఈసారి మరో మలుపు.. కలిసొచ్చిన అదృష్టం ఓ వైపు.. సాధించుకున్న ఉద్యోగం మరోవైపు.. తీవ్ర అంతర్మథనం.. చివరికి ఉద్యోగం వదిలేశారు.  జెడ్పీటీసీ సభ్యురాలిగా బరిలోకి దిగి విజయకేతనం ఎగురవేశారు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనేనా.. అని ఆనందంలో ఉండగానే.. ఈసారి మరో మేలి మలుపు. కలలో కూడా ఊహించని జెడ్పీ చైర్‌పర్సన్ పదవి ఆమెను వరించింది. ఒకదాని తర్వాత ఒకటి.. తేరుకునేలోపే మరోటి. ‘అడగకుండానే పార్టీ ఎన్నో ఇచ్చింది. ఇప్పుడు నాకంటూ ఏ ఆశలూ లేవు. ప్రజలు మెచ్చేలా పనిచేయడం.. బంగారు తెలంగాణ సాధించడం.. ఇప్పుడిదే నా లక్ష్యం..’ అంటున్నారు జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ. పెళ్లయ్యే నాటికి వంట కూడా చేయడం రాదన్న పద్మ.. తన భర్త ప్రోత్సాహం, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహకారం వల్లే ఈస్థాయికి ఎదిగానని, ఇది తనకు గొప్ప అనుభూతి అని చెబుతున్నారు. తనపై ఎంతో నమ్మకంతో గెలిపించిన నర్మెట ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అంటున్న ఆమె.. తన అంతరంగాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.
     
    మాది రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురం. అమ్మ శాగ మాణిక్యమ్మ, నాన్న యాదగిరి. సాధారణ కుటుంబం. మా ఇంట్లో నేనే పెద్దదాన్ని. నాకు ఇద్దరు చెల్లెళ్లు అనిత, రజిత, తమ్ముడు సతీష్ ఉన్నారు. నాన్న లిడ్‌క్యాప్‌లో సేల్స్ మేనేజరుగా హైదరాబాద్‌లో పనిచేసేవారు. మొదట్లో మేమంతా గ్రామంలోనే ఉండేవాళ్లం. కానీ చదువుల కోసమని తర్వాత జనగామకు మ కాం మార్చాం. నాన్నేమో అక్కడి నుంచే హైదరాబాద్ వెళ్లి వచ్చేవారు.

    నేను పదో తరగతి చదువుతున్న సమయంలో నాన్న ఆరోగ్యం దెబ్బతినడంతో మేనత్త కొడుకు నర్సింగరావుతో నా పెళ్లి చెయ్యాలని ఇంట్లో నిర్ణయిం చారు. మూడు రోజుల్లో పెళ్లి అనగా నాన్న చనిపోయారు. దీంతో గౌతమి మహిళా కాలేజీలో ఇంటర్మీడియెట్‌లో చేరా. ఏడాదిలోపు శుభకార్యం చేయాలనే ఉ ద్దేశంతో 1994 ఫిబ్రవరి 28న పెళ్లి చే శారు. అలా నర్మెట్ట మండలం గండిరామారం కోడలుగా వెళ్లా.
     
    ఆడబిడ్డలే వంట నేర్పారు
     
    మేనరికమే కావడంతో అత్తారింట్లో నాకు అంతా తెలిసినవారే. కాబట్టి ఇబ్బందులేమీ లేవు. పెళ్లయ్యే నాటికి నాకు వంట కూడా రాదు. ఇంట్లో అంతా అమ్మే చూసుకునేది. నాన్న కూడా మాకు ఇంటి పనులేవీ చెప్పనిచ్చేవారు కాదు. నాకు వంటరాదని తెలిసి ఆడబిడ్డలే వంట నేర్పారు. నాకు నలుగురు ఆడబిడ్డలు కాగా ఇద్దరు ఊర్లోనే ఉండేవారు. నన్ను ఎంతోబాగా చూసుకునేవారు. పెళ్లయ్యాక మావారి సహకారంతో ఇంటర్మీడియెట్‌లో చేరా. కాలేజీకి రోజూ జనగామ వచ్చి వెళ్లేదాన్ని. ఎక్కువసార్లు మావారు తోడుగా వచ్చేవారు. అయితే రెండు పరీక్షలకు హాజరుకాకపోవడంతో ఇంటర్మీడియట్ తప్పా. దీంతో 2006లో దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేశా. వ్యవసాయం ఉండడంతో ఆర్థికంగా మాకు పెద్దగా ఇబ్బందులు ఉండేవి కావు.
     
    ఎమ్మెల్యే అండగా నిలిచారు


    పోటీలోకి దిగే విషయంలో ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్న సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాకు అండగా నిలిచారు. మీకేం పర్వాలేదు. అండగా ఉంటా. మీరు పోటీచేయడం.. అంటూ భరోసా ఇచ్చారు. ఆయన మద్దతు, ప్రోత్సాహంతో బరిలోకి దిగా. 4,300 ఓట్ల మెజారిటీతో విజయం సాధించా. నన్ను గెలిపించిన నర్మెట ప్రజలకు రుణపడి ఉంటా. ప్రస్తుతం నేనీ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఎమ్మెల్యే సహకారమే.
     
    అనూహ్యంగా రాజకీయాల్లోకి..

     
    బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం చేయాలని ఉండేది. ముఖ్యంగా టీచర్ కావాలని కలలు కనేదానిని. 2001లో గండి రామారం ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. అప్పటికే మా ఆయన టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నారు. ఆయన ఒత్తిడితో రాజకీయాల్లోకి రాక తప్పలేదు. టీఆర్‌ఎస్ తరపున పోటీచేసి ఆ ఎన్నికల్లో విజయం సాధించా. రాజకీయాలంటే ఏమాత్రం అవగాహన లేని నాకు అంతా కొత్తగా అనిపించే ది. మండల అభివృద్ధి సమీక్ష సమావేశాలకు వెళ్లేదాన్ని. ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొనేదాన్ని. ఆ తర్వాత క్రమంగా రాజకీయాలపై అవగహన పెరిగింది. నేను ఎన్నికైన ఎంపీటీసీ స్థానం పరిధిలో మూడు గ్రామాలుండేవి. అందులో రెండు గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడేవారు. దీంతో ఆయా గ్రామాల ప్రజల రవాణా ఇబ్బందులు పరిష్కరించేందుకు పట్టుబట్టి బ్రిడ్జి నిర్మాణాలకు అవసరమైన నిధులు సాధించడం.. అవి పూర్తిచేయడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎంపీటీసీ సభ్యురాలిగా నా స్థాయిలో గ్రామానికి చేయాల్సింది చేశా.
     
    కలలో కూడా ఊహించలేదు
     
    టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి మావారు పార్టీలో పనిచేస్తున్నారు. అంతకుముందు ఓ పత్రికలో నర్మెట విలేకరిగా పనిచేసేవారు. 2006లో ఆ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీకోసం క్రమశిక్షణగా, నిబద్ధతతో పనిచేసేవారు. అదే నాకు జెడ్పీటీసీ సభ్యురాలిగా పోటీచేసే అవకాశం తెచ్చిపెట్టింది. అక్కడితోనే సంతృప్తి చెందినా ఆ తర్వాత పార్టీ మాకు జెడ్పీ చైర్‌పర్సన్‌గా మరో పెద్ద అవకాశం ఇచ్చింది. ఈ పదవి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. పార్టీ పెద్దలు మమ్మల్ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చారు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను జెడ్పీ చైర్‌పర్సన్ కావడం మాటలకందని అనుభూతి. పార్టీకి మేం రుణపడి ఉంటాం. పార్టీ నేతల సమష్టి కృషి వల్లే జిల్లా పరిషత్ పీఠం దక్కింది. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాంనాయక్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు, స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఎ.చందులాల్, కొండా సురేఖ, అరూరి రమేశ్, శంకర్‌నాయక్ ఎంతో మద్దతు తెలిపారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, నేతలు ఇచ్చిన మద్దతును మర్చిపోలేను.
     
    వదులుకోబుద్ధి కాలేదు

    తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో మా ఆయన నర్సింగరావు నర్మెట మండలం టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఉద్యమంలో, పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా పనిచేశారు. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నర్మెట జెడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. నాకు పోటీలోకి దిగాలనిపించలేదు.   ఎన్నికల్లోకి దిగితే ఉద్యోగం వదులుకోవాలి. పైగా ఖర్చు. దీంతో పోటీచేసేందుకు వెనకాముందు ఆలోచించా.
     
    బంగారు తెలంగాణే లక్ష్యంగా..

    ఊహించని పదవి వచ్చింది.  నాకంటూ ఏ ఆశలూ లేవు. అందరూ మెచ్చేలా పనిచేయడమే ఇప్పుడు నా ముందు న్న లక్ష్యం. చారిత్రక నేపథ్యం ఉన్న జిల్లాకు చైర్‌పర్సన్ కావడం అరుదైన అవకాశంగా భావిస్తున్నా. అన్ని వర్గాల ప్రజల కష్టాలు నాకు తెలుసు. మహిళా సాధికారత, దళితుల అభ్యన్నతికి కృషి చేస్తా. నా బాధ్యతలను పారదర్శకంగా నిర్వహిస్తా. అందరి సహకారంతో సమష్టిగా ముందుకెళ్తా.  టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తా. నా శక్తి మేరకు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా.
     
    అయినా.. ఆసక్తి పెరగలే

    ఎంపీటీసీ సభ్యురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించినా రాజకీయాలపై మాత్రం ఆసక్తి పెరగలేదు. దీంతో పదవీ కాలం ముగిసిన తర్వాత డిగ్రీ పూర్తిచేసి మా ఊరు గండిరామారంలో అంగన్‌వాడీ-2 సెంటర్‌లో టీచర్‌గా చేరా. జనగామలో అద్దె ఇంట్లో ఉంటూనే పిల్లల చదువులు, నా ఉద్యోగం చూసుకునేదాన్ని. మాకు ఇద్దరు పిల్లలు అఖిల్, నిఖిల్. పెద్దోడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి, చిన్నోడు ఇక్కడే తేజస్వీ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్నారు. 2010 నుంచి జెడ్పీటీసీ సభ్యురాలిగా నామినేషన్ వేసే వరకు టీచర్‌గా పనిచేశాను. నేను చైర్‌పర్సన్ అయ్యాక నా బాల్యస్నేహితులు వచ్చి అభినందించడం నాకు గొప్ప అనుభూతిని మిగిల్చింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement