అమృత హస్తాలు... | 'Sakshi' on behalf of the Reporter as gaddala padma zp chairperson | Sakshi
Sakshi News home page

అమృత హస్తాలు...

Published Mon, Nov 24 2014 4:18 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

అమృత హస్తాలు... - Sakshi

అమృత హస్తాలు...

పల్లె.. పట్టణం.. నగరం.. ఎక్కడైనా మహిళలు, శిశువుల ఆరోగ్య సంరక్షణలో వారు భాగమవుతారు. పిల్లలను బడిబాట పట్టించడంలో ముందుంటారు. మొత్తంగా స్త్రీలు, శిశువులు, బాలల సంరక్షణలో వారిది కీలకపాత్ర. అలాంటి అంగన్‌వాడీ వర్కర్‌గా బాధ్యతలు నిర్వర్తించి.. జిల్లాలో ఉన్నతమైన జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని చేపట్టారు గద్దల పద్మ. అంగన్‌వాడీల కష్టసుఖాలు, అనుభవాలు, సమస్యలు, అవసరాలను ‘సాక్షి’ తరఫున రిపోర్టర్‌గా మారి తెలుసుకున్నారు.
 
అంగన్‌వాడీల సంక్షేమానికి కృషి
అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేసిన నాకు.. వారి సమస్యలపై అవగాహన ఉంది. ప్రభుత్వం తరఫున అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయూలకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తా. జిల్లా స్థాయిలో, నా పరిధి మేరకు అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేస్తా. అంగన్‌వాడీ కార్యకర్తల సంక్షేమం కోసం పని చేస్తా.
- గద్దల పద్మ, జెడ్పీ చైర్‌పర్సన్
 
పద్మ : ఒకప్పుడు నేను అంగన్‌వాడీ కార్యకర్తనే. ఈ జాబ్ పట్ల మీ అభిప్రాయం ?
జ్ఞానసుందరి :
  విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత తొలి గురువుగా వ్యవహరించే బాధ్యత మాది. పిల్లలకు ఆటపాటలతో కూడిన చదువు నేర్పించడమే కాకుండా, వారికి పోషకాహారం అందించే పని కూడా మాదే. ఇంకాచెప్పాలంటే బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే గర్భిణులకు జాగ్రత్తలు, పోషకాహారం అందించడం నుంచి మా పని మొదలవుతుంది. అందువల్లే జీతం తక్కువగా ఉన్నా... సేవాభావంతో ఈ ఉద్యోగాలు చేస్తున్నాం.
 
పద్మ : చిన్నపిల్లలు అంగన్‌వాడీ సెంటర్‌కు  రామని సతాయిస్తారు .. వారితో ఇబ్బంది అనిపించదా ?
లలిత : చిన్నపిల్లల అల్లరి, మారం చేయని ఇళ్లు ఉండదు. పిల్లలను ఎలా సముదాయించాలో ప్రతి మహిళకూ అలవాటే. మేము ఆ పనిని ఇంకాస్త మెరుగ్గా చేస్తాం. చిన్న పిల్లలు అభినయంతో కూడిన విద్యను నేర్చుకోవడానికి ఇష్టపడుతారు. ఏడుస్తూ పిల్లలు అంగన్‌వాడీ సెంటర్‌కు రాగానే చప్పట్లు కొట్టడం, గట్టిగా అరవడం వంటి పనులు చేసి పిల్లల దృష్టి మరల్చుతాం. ఆ తర్వాత ఆటపాటల ద్వారా వారికి ప్రాథమిక విషయాలపై అవగాహన కల్పిస్తాం.
 
పద్మ : పిల్లలకు ఆటపాటల ద్వారా చదువు ఎలా నేర్పిస్తారు ?
లలిత : పాటలు పాడడం ద్వారా పిల్లలతో మమేకమవుతాం. తోటిపిల్లలతో ఎలా మెలగాలో నేర్పుతాం. క్రమశిక్షణ అలవాటు చేస్తాం. శుభ్రత పాటించేలా చూస్తాం. మా సెంటర్‌లోకి రాగానే పిల్లలందరు ఒకే చోట వరుసలో చెప్పులు విడుస్తారు.  కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్లలో చైతన్యం కలిగించేందుకు పాటలు కూడా పాడతాం. (అంటూనే తల్లి కాబోతున్న చెల్లెలా అనే పాట పాడి వినిపించారు.)
 ప్రశ్న : మీరు చేస్తున్న పనిని ప్రజాప్రతినిధులు గుర్తిస్తున్నారా ? గ్రామ సభలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారా ?
 జవాబు : గ్రామాల్లో సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు మా సేవలను గుర్తిస్తున్నారు. సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు.
 
పద్మ : మీరు ఎదుర్కొనే సమస్యలు ?
పూల : అంగన్‌వాడీ కార్యకర్తగా ఉండే పని చాలా ఎక్కువ. గ్రామస్థాయిలో ఇంటింటికి సేవలు అందించే  బాధ్యత మాది. ప్రతి రోజూ 11 రిజిస్టర్లు రాయాలి. వీటితోనే మాకు సరిపోతుంది. వీటిని ఎప్పటికప్పుడు మా సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తుంటారు. వీటితోనే పని ఒత్తడి ఎక్కువగా ఉంటుంది.  కానీ.. ఇతర ప్రభుత్వ పథకాలకు చెందిన పనులు మాకు అప్పగించడం భారంగా మారుతోంది. సమగ్ర సర్వే, బీఎల్‌ఓ, పల్స్‌పోలియో వంటి పనులు తలకు మించిన భారంగా మారాయి. వీటితో మేము అంగన్‌వాడీ సెంటర్లకు దూరమవుతున్నాం.
 
పద్మ : ఇతర పనులు చేసినందుకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా ?
సరస్వతి : సమగ్ర సర్వేలో పాల్గొంటే మాకు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇంత వరకు రాలేదు. బీఎల్‌ఓ విధుల్లో పాల్గొంటే రూ.మూడు వేలు ఇస్తామని చెబుతున్నారు. ఇచ్చే డబ్బులతో పోల్చితే చేసే పని ఎక్కువ. పల్స్‌పోలియో డ్యూటీ ఉంటే ఏకంగా వారం పాటు సెంటర్‌కు దూరం కావాల్సి వస్తుంది.
రమాతార : పట్టణ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించడం కష్టంగా ఉంటోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దెగా ప్రభుత్వం రూ.3 వేలు చెల్లిస్తుంది. ఈ అద్దెలో భవనాలు లభించడం కష్టం. ఒకవేళ దొరికినా.. ప్రభుత్వం నుంచి క్రమం తప్పకుండా అద్దె రాదు. మా సెంటర్‌కు సంబంధించి 11 నెలలుగా అద్దె బిల్లు రావడం లేదు. మరోవైపు ఇంటి ఓనర్ల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. కొన్ని సందర్భాల్లో మా నెల జీతం నుంచి అద్దె చెల్లించాల్సి వస్తోంది. దీంతో మా ఇళ్లలో సమస్యలు ఎదుర్కొంటున్నాం.
 
పద్మ : మీరు ఇతర పనుల్లో ఉన్నప్పుడు అంగన్‌వాడీ సెంటర్ల పరిస్థితి ?
ప్రసన్న : ఆయాలు నిర్వహిస్తుంటారు. మా ఆయా పదో తరగతి వరకు చదివింది. ఆమె ఇంటింటికీ వెళ్లి పిల్లలను తీసుకొస్తుంది. వారి చేత పాటలు పాడిస్తుంది. పోషకాహారం వండిపెడుతుంది.
 విజయనిర్మల : చదువుకున్న ఆయాలు ఉండడం కలిసొస్తుంది. చాలా సార్లు ఆయాలకు వంట పనితోనే సరిపోతుంది.
 
పద్మ : పోషకాహార లోపాలను ఎలా గుర్తిస్తారు ?

అరుణ : పిల్లల వయసును బట్టి ఎంత బరువు ఉండాలనే చార్ట్ ప్రతి అంగన్‌వాడీ కార్యకర్త వద్ద ఉంటుంది. దీని ఆధారంగా పోషకలోపాలను గుర్తిస్తాం. అదేవిధంగా... తల్లిబిడ్డలకు తగ్గట్లుగా గర్భిణులు, బాలింతలకు అమృతహస్తం, బాలామృతం పథకాల ద్వారా పాలు, కోడిగుడ్లు, శనగలు అందిస్తాం.
 
పద్మ : పాలు, కోడిగుడ్లు సక్రమంగా అందిస్తారా ?
అరుణ : నెలకు 16 గుడ్లు అందించాలి. కానీ.. గుడ్లు సరఫరా చేసే వ్యక్తులు సకాలంలో అందివ్వట్లేదు. ఇచ్చే గుడ్లు సైతం చాలా నాసిరకంగా ఉంటాయి. శనగలు అయితే చాలా సార్లు పుచ్చు పట్టిపోయి ఉంటాయి. విద్యార్థులు, బాలింతలు, గర్భిణుల సంఖ్యకనుగుణంగా కాకుండా కాంట్రాక్టర్ ఇష్టారీతిగా సరఫరా చేస్తుంటారు. దీనివల్ల పోషకాహారం అందిచడంలో ఆలస్యమవుతోంది. చాలామంది ఈ గుడ్లను మేమే దాచుకుంటామని, అమ్ముకుంటామని అనుకుంటారు.
 
పద్మ : పాడైన గుడ్లు, శనగలు పిల్లలకు పెడతారా ?

అరుణ : లేదు... పాడైన గుడ్లు వచ్చినప్పుడు వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకెళతాం. పిల్లలకు పెట్టం.
 
పద్మ : గుడ్ల నాణ్యతపై అధికారులకు ఫిర్యాదు చేయరా ?
అరుణ : గుడ్లు బాగా లేకుంటే వెంటనే మాకు వద్దని చెబుతాం. సరఫరా చేసే వ్యక్తులు ఆటోల్లో వచ్చి ఇచ్చేసి వెళతారు. మా మాట పట్టించుకోరు. పుచ్చిపోయిన శనిగలు వచ్చినప్పుడూ ఇదే పరిస్థితి.  వీటిని మేము
 పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పరిస్థితిలో మార్పు రావడం లేదు.

 పద్మ : అంగన్‌వాడీ కార్యకర్తగా మీరు తెచ్చిన మార్పు ?
 షర్మిల : ఓల్డ్ బస్‌డిపో వెనక స్లమ్‌ఏరియా అంగన్‌వాడీ సెంటర్‌లో కార్యకర్తగా వెళ్లాను. అప్పుడు అక్కడ  టాయిలెట్లు లేక పారిశుద్ధ్య నిర్వహణ దారుణంగా ఉండేది. ఇక్కడ చిలకజోస్యం చెప్పేవాళ్లు, ప్రతి రోజూ గంపలో సామాన్లు పెట్టుకుని అమ్ముకునే కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. రోగం వస్తే మంత్రాల వైద్యం, తాయెత్తులను నమ్మేవాళ్లు. మెల్లమెల్లగా వీరిలో ఒకరిగా కలిసిపోయాను. గర్భిణులు క్రమం తప్పకుండా ఆస్పత్రులకు వెళ్లేలా అలవాటు చేశాను. పిల్లలు అంగన్‌వాడీ సెంటర్లకు వస్తున్నారు. గతంలో ఇక్కడ మహిళలకు ప్రసవమైన తెల్లారే బిడ్డతో సహా నెత్తిన గంపతో బయటకు వెళ్లే వారు. దీని వల్ల తల్లీబిడ్డకు ఆరోగ్యసమస్యలు వచ్చేవి. ఇప్పుడు రెండు నెలల వరకు ఆగుతున్నారు. ఇప్పటికీ వీళ్లకు సూది అంటే భయం. దాన్ని పోగొట్టలేకపోయాను.
 
పద్మ : అంగన్‌వాడీ సెంటర్లు మెరుగ్గా సేవలందించాలంటే ఏం చేయాలి?
లలిత : అంగన్ వాడీ సెంటర్లను ప్లే స్కూళ్లుగా మారుస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అలా చేస్తే ఆయనకు వేలకోట్ల దండాలు. చిన్నారులను అంగన్‌వాడీ  సెంటర్లలో చేర్చడం తప్పనిసరి చేయాలి. ఇక్కడి చేరిన వారికే స్కూళ్లలో అడ్మిషన్లకు అర్హులని ప్రకటించాలి. అంగన్‌వాడీ సెంటర్లకు నాణ్యమైన వస్తువులు సరఫరా అయ్యేలా చూడాలి.
 
పద్మ :  అంగన్‌వాడీ వర్కర్లుగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ?
సరస్వతి : అంగన్‌వాడీ కార్యకర్తలు గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయమవుతూ పనిచేస్తారు. ప్రభుత్వం సైతం అనేక విషయాలపై వీరిపై ఆధారపడుతుంది. కాబట్టి అంగన్‌వాడీ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలి. పూర్తిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్‌వాడీ వర్కర్లకు కనీస వేతనాన్ని రూ.4,500 నుంచి రూ 15,000కు పెంచాలి. ఆయాల కనీస వేతనం రూ.10,000 చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ వంటి సౌకర్యాలు కల్పించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement