సీఎం వస్తే పిల్లలు సెంటర్లకు వెళ్లరంట!
అనంతపురం టౌన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తే అంగన్‌వాడీ సెంటర్లలోని పిల్లలు చదువుకోవడానికి కేంద్రాలకు వెళ్లరంట.. ఈ మాటన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం. శుక్రవారం మడకశిరలో 'చంద్రన్న పసుపు–కుంకుమ ప్రదానం' కార్యక్రమం జరగడంతో మహిళా సంఘాల సభ్యులనే కాకుండా మడకశిర ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు తప్పనిసరిగా రావాలని ఆదేశాలు జారీ చేయడంతో విధి లేని పరిస్థితుల్లో వారంతా వచ్చారు.
దీంతో ప్రాజెక్ట్ పరిధిలోని 378 మెయిన్, 60 మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లోని 90 శాతం సెంటర్లు మూతపడ్డాయి. ఆయా సెంటర్లలో 24 వేల మంది వరకు చిన్నారులు నమోదై ఉండగా వారందరికీ అనధికారికంగా సెలవు ప్రకటించారు. ఈ విషయమై పీడీని 'సాక్షి' వివరణ కోరగా ఆమె పై విధంగా స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమం కావడంతో కొందరు అధికారులను డ్యూటీకి వేశామని చెబుతూనే.. అయినా సీఎం వస్తే పిల్లలను తల్లిదండ్రులు సెంటర్లకు పంపించరు కదా అని అన్నారు.