మద్నూర్ : మండలంలోని సోముర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలోని ఓ గదిలో కొంత కాలంగా కాలం చెల్లిన మందులు పడిఉన్నాయి. దీనిపై ఈ నెల 25న ‘ సాక్షిలో ’లో ‘ కాలం చెల్లినా కనిపించవా? ’ అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనిపై ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా ఎస్‌పీహెచ్‌వో ( సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారి ) చంద్రశేఖర్ శనివారం సోముర్ అంగన్‌వాడీ కేంద్రంలో విచారణ చేపట్టి, ఏఎన్‌ఎం స్వరూపకు మెమో అందించారు.
అంగన్‌వాడీ కేంద్రంలో మందులను విచ్చలవిడగా ఎందుకు పారేశారని, వాటిని చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి చక్కెర బిల్లలు అనుకొని తింటే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు అంగన్‌వాడీ కేంద్రంలో మందులు ఎందుకు ఉంచారని ఆయన ప్రశ్నించారు.అంతే కాకుండా కాలం చెల్లిన ఐ డ్రాప్‌లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఎందుకు ఉన్నాయని, వెంటనే ఎందుకు పారేయలేదన్నారు.
మందులు కాలం చెల్లకుంటే ముందే గ్రామాల్లో తిరిగి అవసరం ఉన్న వారికి పంపిణీ చేయాలని, ఇలా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమయ్యేలా చూడొద్దని సూచిం చారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని, ఇది చిన్న విషయం కాదని హెచ్చరించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని ఆయన తెలిపారు. ఆయనతో పాటు డోంగ్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు మమత,హెచ్‌ఈ సంజీవ్‌రెడ్డి, అంగన్‌వాడీ కార్యకర్త శోభ ఉన్నారు.
‘కాలం చెల్లిన మందుల’పై విచారణ
Published Sun, Jul 27 2014 3:12 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
Advertisement
Advertisement