తొలి అడుగే ధీమాగా
‘‘ఇంతియని చింతించవలదు... ఘనములెన్నియో చేసి చూపింతుము’’ అన్న ఓ కవి వాక్కులను వారు నిజం చేశారు. పాలనలో తొలి అడుగే అయినా ధీమాగా వేశారు. ఇటు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే, అటు ఆఫీసు పనులను చక్కబెట్టారు. తమ మీద నమ్మకముంచి అందలమెక్కించిన జనం సమస్యల పరిష్కారంలోనూ ముందుంటున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి దాదాపు ఆరు నెలలు అవుతోంది. తొలిసారిగా ఎంపీపీ, జడ్‌పీటీసీ పదవులను అధిరోహించిన పలువురు మహిళా నేతలు ఈ ఆరు నెలల అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
వేలమైళ్ల ప్రయాణమైనా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఆ మొదటి అడుగు కాస్త తడబడినా.. ఆత్మవిశ్వాసంతో నిలదొక్కుకోగలిగితే ఇక ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు, అడ్డంకులు వచ్చినా ఎదురుండదు. అందులోనూ ఆడవాళ్లు ఒక్కసారి తమ మనసును లగ్నం చేస్తే ఏపనినైనా విజయవంతం చేసేదాకా వదలరు. ఆరునెలల కిందటి దాకా వంటింటికే పరిమితమై.. ఇంటి బాధ్యతలను పంచుకున్నారు వీరంతా.
కనీసం పక్క ఊరు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇక మండలాఫీసు, జిల్లా పరిషత్తు అంటే.. అవేంటి, ఎక్కడుంటాయి అనేవారు. కానీ ఇప్పుడు.. ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా గెలుపొందారు. తమ మండలంలో ఏ ఊరిలో ఏ సమస్య ఉంది.. దాని పరిష్కారానికి ఏం చేయాలి.. ఏ అధికారి ఏం పనిచేస్తాడు.. ఇలా అన్ని విషయాలపై పట్టు సాధించారు. ఆడవాళ్లు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపిస్తున్నారు. తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఎంపీపీలు, జడ్పీటీసీలుగా దాదాపు ఆరునెలల పదవీకాలం పూర్తిచేసుకున్న పలువురు మహిళా ప్రజాప్రతినిధుల ‘వాయిస్’ ఇది...
ప్రజాసమస్యలపై అవగాహన
నాగిరెడ్డిపేట : ఎంపీపీ పదవి చేపట్టి ఆరునెలలవుతోంది. ఇప్పటిదాకా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహనవచ్చింది. ప్రజాప్రతినిధుల, అధికారుల విధులు, బాధ్యతలు తెలుసుకున్నాను. అంతకుముందు ఇంటికే పరిమితమైన నాకు కొత్తలో కొంత కష్టమైంది. రిజర్వేషన్ కారణంగా ఎంపీపీనైన నాకు ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి సహకరిస్తున్నారు. మండలంలో పలు సమస్యల పరిష్కారానిక ప్రతిపాదనలు చేశాం. నిధుల వస్తే అభివృద్ధి పనులను చేపడతాను.
-ఊశమ్మ, ఎంపీపీ, నాగిరెడ్డిపేట
కొత్త విషయాలు తెలుసుకోవడం..
సదాశివనగర్ : మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎంపికైనప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త విషయాలను నేర్చుకున్నా. రాజకీయ అనుభవం కూడా వచ్చింది. ప్రజలు, అధికారులతో పరిచయాలు పెరిగాయి. ప్రతీ కార్యక్రమానికి తనను ఆహ్వానిస్తున్నారు. ప్రజాసమస్యలపై అవగాహన ఏర్పడింది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో, ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి సహకారంతో మండలాన్ని మరింత అభివృద్ధి చేయాలనేది ప్రధాన ఉద్దేశం.
- బంజ విజయ, ఎంపీపీ, సదాశివనగర్