సాక్షి, జనగామ: జిల్లాలో మహిళా ఓటర్లు కీలకంగా మారునున్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఓటరు జాబితాలో పురుషుల కంటే మహిళలు పైచేయిని సాధించడంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆకర్షిస్తున్నారు. మహిళా ఓటర్ల మద్దతు కోసం ప్రధాన పార్టీల నాయకులు రంగంలోకి దిగారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ నాయకులు మహిళా ఓటర్ల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో మహిళలు పురుషులతో సమానంగా ఓటు హక్కును కలిగి ఉన్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 6,98,571 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,48,924 మంది ఉండగా మహిళలు 3,49,635 మంది ఉన్నారు. ఇతరులు 12 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 711 మంది ఎక్కువగా ఉన్నారు.
రెండు నియోజకవర్గాల్లో పైచేయి..
జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో రెండు సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జనగామ నియోజకవర్గంలో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉండగా పాలకుర్తి నియోజకవర్గంలో తక్కువగా ఉన్నారు. జనగామ నియోజకవర్గంలో ఓటర్లుగా పురుషులు 1,11,911 మంది ఉండగా.. మహిళలు 1,12,974 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1063 మంది ఎక్కువగా ఉన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పురుషులు 1,18,335 మంది ఉండగా మహిళలు 1,18,818 మంది ఉన్నారు. 483 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళలు తక్కువగా సంఖ్యలో ఉన్నారు. పురుషులు 1,18,678 మంది ఉండగా మహిళలు 1,17,843 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 835 మంది తక్కువగా ఉన్నారు.
ప్రధాన పార్టీల గురి...
జిల్లాలో మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో గ్రామాల వారీగా వారిని ప్రభావితం చేసే అంశాలపై ఫోకస్ చేస్తున్నారు. గ్రామ, మండలస్థాయి మహిళా సంఘాల నాయకురాళ్లను రంగంలోకి దింపుతున్నారు. ఏ గ్రామంలో ఎక్కువగా మహిళా ఓటర్లు ఉన్నారనే విషయాలను ఆరా తీస్తున్నారు. మహిళా ఓటర్ల మద్దతు దక్కితే విజయం సులువు అవుతుందనే ఆలోచనలో మహిళా ఓటర్ల మద్దతు కోసం పార్టీల నాయకులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.
జిల్లాలో ఉన్న ఓటర్లు వివరాలు...
నియోజకవర్గం | పురుషులు | మహిళలు |
జనగామ | 111911 | 112974 |
స్టేషన్ ఘన్‌పూర్ | 118335 | 118818 |
పాలకుర్తి | 118678 | 117843 |
మొత్తం | 348924 | 349635 |
Comments
Please login to add a commentAdd a comment