womens votes
-
ఓటర్ల జాబితాలో వారిదే పైచేయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఓటర్లలో అతివలదే అగ్రస్థానం. రాష్ట్రంలో పురుష ఓటర్లు 2,01,34,664 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 2,05,97,544 మంది ఉండటం విశేషం. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 4,62,880 మంది అదనంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసిన తుది నివేదికలో పేర్కొంది. ఒక్క శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో సర్వీసు ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 4,07,36,279. వీరిలో 4,071 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 43,45,322 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా 40,89,216 మంది, విశాఖపట్నం జిల్లా 37,19,438 మంది ఓటర్లతో నిలిచాయి. ఇక విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 19,02,077 మంది ఓటర్లు మాత్రమే నమోదయ్యారు. రాష్ట్ర జనాభాలో ప్రతి వెయ్యి మందికి 743 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ప్రతి వెయ్యిమంది పురుషులకు 1,026 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 18–19 ఏళ్లు ఉండి తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునే యువ ఓటర్ల సంఖ్య 2,07,893గా ఉంది. 1,500 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రం ఉండగా కొత్తగా 33 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 45,917 నుంచి 45,950కి చేరింది. 13.85 లక్షలు పెరిగిన ఓటర్లు రాష్ట్రంలో 2019 సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితాతో పోలిస్తే అదనంగా 13,85,239 మంది ఓటర్లు పెరిగారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో 3,93,51,040 మంది ఉండగా స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్)–22 నాటికి 4,07,36,279కి చేరింది. ఇందులో విదేశీ ఓటర్లు 7,033, సరీ్వస్ ఓటర్లు 67,935 మంది ఉన్నారు. -
ఎవరికో.. ఆ రెండు పీఠాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్‌లోని నాలుగు జిల్లా పరిషత్‌లపై కన్నేసిన టీఆర్ఎస్ నాయకత్వం చైర్పర్సన్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థిగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును ఇప్పటికే ప్రకటించగా, మిగతా మూడు జిల్లాల్లో సందిగ్ధత కొనసాగుతోంది. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక నుంచి గెలిపించుకునే దాకా బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రులకు అప్పగించిన పార్టీ అధినేత కేసీఆర్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటేనే చైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. పెద్దపల్లి జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్ కేటగిరీలో బీసీ జనరల్‌కు కేటాయించడంతో పుట్ట మధు ఎంపిక సులభమైంది. ఓడిపోయిన ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావించడంతో ఆయన పేరును ముందే ప్రకటించారు. కమాన్‌పూర్ జెడ్పీటీసీగా ఆయన పోటీ చేయనున్నారు. జగిత్యాలలో తుల ఉమకే అవకాశం ఉమ్మడి జిల్లా పరిషత్ చివరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఐదేళ్లు కొనసాగిన తుల ఉమ ఈసారి జగిత్యాల జిల్లాకే పరిమితం కానున్నారు. బీసీ జనరల్‌కు కేటాయించిన జగిత్యాల జిల్లా పరిషత్ అధ్యక్ష పదవికి టీఆర్ఎస్ నాయకుడు బాలినేని రాజేందర్, మల్యాల సర్పంచి మిట్టపల్లి సుదర్శన్ కూడా పోటీ పడుతున్నారు. రాజేందర్ సతీమణి రాజ్యలక్ష్మి ప్రస్తుతం జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. కాగా ఈసారి బీసీ జనరల్ సీటుగా మారిన కొత్త మండలం బుగ్గారం నుంచి రాజేందర్ పోటీ చేస్తున్నారు. మల్యాలకు చెందిన మిట్టపల్లి సుదర్శన్ కూడా ఈసారి జెడ్పీటీసీగా పోటీ చేసి జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని భావిస్తున్నారు. సిట్టింగ్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న తుల ఉమ పట్లనే నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివాదరహితురాలుగా ఐదేళ్లు కరీంనగర్ జెడ్పీని నడిపించిన తుల ఉమకే మరోసారి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. ఆమె కథలాపూర్ మండలం నుంచి పోటీ చేయనున్నారు. సిరిసిల్లపై తేల్చని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వుడ్ కావడంతో ఇక్కడ నుంచి రాజకీయంగా ఎదగాలని భావించిన నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లతోపాటు వేములవాడ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండగా, ఎక్కడి నుంచి చైర్‌పర్సన్‌ను ఎంపిక చేస్తారనే విషయంలో స్పష్టత లేదు. వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట నుంచి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి భార్య అరుణ పోటీ చేస్తున్నారు. ఆమెకు అవకాశం లభించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గం తంగెళ్లపల్లి నుంచి సిట్టింగ్ జెడ్పీటీసీ పి.మంజుల కూడా మరోసారి పోటీ చేస్తున్నారు. మంజుల సైతం జెడ్పీ చైర్పర్సన్ బరిలో నిలువనున్నారు. కేటీఆర్ ఎవరి పేరు చెపితే వారే ఇక్కడ జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు. కరీంనగర్లో కుదరని రిజర్వుడు లెక్కలు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కాగా, ఈ కేటగిరీలో రెండు జెడ్పీటీసీలు మాత్రమే జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ నిర్ణయం మీదనే జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి ఆధారపడి ఉంది. హుజూ రాబాద్ నియోజకవర్గంలోని కొత్త మండలం ఇల్లందకుంట, చొప్పదండి మండలాలు ఎస్సీ మహిళకు రిజర్వు చేయబడ్డాయి. ఇల్లందకుంట నుంచి కనుమల విజయను జెడ్పీటీసీగా ఇప్పటికే ఎంపిక చేశారు. ఆమెను జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. మరో మండలం చొప్పదండిలో ఎమ్మెల్యే రవిశంకర్ భార్య జీవన పోటీ చేస్తారని, ఆమెకే జెడ్పీ అధ్యక్షురాలి అభ్యర్థిత్వం ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కాగా బుధవారం ఎమ్మెల్యే రవిశంకర్ తన భార్య పోటీ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. చొప్పదండిలో స్థానికులకే అవకాశం లభిస్తుందని చెప్పారు. మాజీ జెడ్పీ చైర్పర్సన్ ఆరెపల్లి మోహన్ సతీమణిని ఎస్సీ జనరల్ నుంచి గానీ జనరల్ స్థానం నుంచి గాని పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీ నాయకులు స్పష్టత ఇవ్వడం లేదు. చొప్పదండి నుంచి స్థానిక టీఆర్ఎస్ నాయకులు తమ సతీమణులను పోటీలో నిలిపేందుకు పోటీ పడుతున్నా, జెడ్పీ పీఠంపై కూర్చొనే అనుభవం ఉన్నవారు లేకపోవడం గమనార్హం. -
మహిళా ఓటర్లే ‘కీ’లకం
సాక్షి, జనగామ: జిల్లాలో మహిళా ఓటర్లు కీలకంగా మారునున్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఓటరు జాబితాలో పురుషుల కంటే మహిళలు పైచేయిని సాధించడంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆకర్షిస్తున్నారు. మహిళా ఓటర్ల మద్దతు కోసం ప్రధాన పార్టీల నాయకులు రంగంలోకి దిగారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ నాయకులు మహిళా ఓటర్ల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల్లో మహిళలు పురుషులతో సమానంగా ఓటు హక్కును కలిగి ఉన్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 6,98,571 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,48,924 మంది ఉండగా మహిళలు 3,49,635 మంది ఉన్నారు. ఇతరులు 12 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 711 మంది ఎక్కువగా ఉన్నారు. రెండు నియోజకవర్గాల్లో పైచేయి.. జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో రెండు సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జనగామ నియోజకవర్గంలో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉండగా పాలకుర్తి నియోజకవర్గంలో తక్కువగా ఉన్నారు. జనగామ నియోజకవర్గంలో ఓటర్లుగా పురుషులు 1,11,911 మంది ఉండగా.. మహిళలు 1,12,974 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1063 మంది ఎక్కువగా ఉన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పురుషులు 1,18,335 మంది ఉండగా మహిళలు 1,18,818 మంది ఉన్నారు. 483 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళలు తక్కువగా సంఖ్యలో ఉన్నారు. పురుషులు 1,18,678 మంది ఉండగా మహిళలు 1,17,843 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 835 మంది తక్కువగా ఉన్నారు. ప్రధాన పార్టీల గురి... జిల్లాలో మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో గ్రామాల వారీగా వారిని ప్రభావితం చేసే అంశాలపై ఫోకస్ చేస్తున్నారు. గ్రామ, మండలస్థాయి మహిళా సంఘాల నాయకురాళ్లను రంగంలోకి దింపుతున్నారు. ఏ గ్రామంలో ఎక్కువగా మహిళా ఓటర్లు ఉన్నారనే విషయాలను ఆరా తీస్తున్నారు. మహిళా ఓటర్ల మద్దతు దక్కితే విజయం సులువు అవుతుందనే ఆలోచనలో మహిళా ఓటర్ల మద్దతు కోసం పార్టీల నాయకులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. జిల్లాలో ఉన్న ఓటర్లు వివరాలు... నియోజకవర్గం పురుషులు మహిళలు జనగామ 111911 112974 స్టేషన్ ఘన్పూర్ 118335 118818 పాలకుర్తి 118678 117843 మొత్తం 348924 349635 -
ఎం3 ఈవీఎంలు.. పింక్ బూత్‌లు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈసారి కొన్ని ప్రయోగాలకు వేదికగా నిలిచాయి. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా ‘పింక్ బూత్’లు ఏర్పాటు చేయడంతో పాటు.. అత్యాధునిక మూడో తరం ఈవీఎంలను కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం వినియోగించింది. కర్ణాటకలో 75 శాతం ఓటింగ్ నమోదు లక్ష్యంగా ఈ చర్యలకు ఈసీ అధికారులు శ్రీకారం చుట్టారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ట్యాంపరింగ్ చేసేందుకు వీలులేని ‘ఎం3 ఈవీఎం’ల్ని బెంగళూరు నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఎవరైనా ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నిస్తే ఈ సరికొత్త ఈవీఎంలు వాటంతటవే పనిచేయడం మానేస్తాయని ఈసీ అధికారులు తెలిపారు. బెంగళూరులోని శివాజీ నగర్, శాంతి నగర్, గాంధీ నగర్, రాజాజీ నగర్ నియోకవర్గాల్లో వీటి పనితీరును పరీక్షించారు. ఏవైనా లోపాలుంటే హెచ్చరించేలా ‘ఎం3’ ఈవీఎంల్లో ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేలా సఖి పేరుతో 450 పింక్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మహిళా సాధికారతను చాటిచెప్పేలా మొత్తం మహిళా అధికారులే ఈ బూత్‌లను నిర్వహించడం విశేషం. -
తొలి విడత పోలింగులో పడతుల పైచేయి
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: తొలివిడత ప్రాదేశిక ఎన్నికల పోలింగు సందర్భంగా ఓటు హక్కు వినియోగించడంలో పురుషల కంటే తామే మెరుగని మహిళలు నిరూపించుకున్నారు. ఆదివారం జరిగిన పోలింగులో అటు జెడ్పీటీసీ.. ఇటు ఎంపీటీసీల్లోనూ మహిళల ఓటింగ్ శాతమే ఎక్కువగా నమోదైంది. ఈ పరిణామాన్ని వైఎస్ఆర్సీపీకి సానుకూల సంకేతంగా అంచనా వేస్తున్నా రు. తొలిదశలో 17 జెడ్పీటీసీ, 303 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జెడ్పీటీసీలకు 7,42,705 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉండగా, 5,52,967 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 74.45 శాతం పోలింగ్ నమోదైంది. జెడ్పీటీసీ ఓటర్లలో 3,72,794 మంది పురుషులు ఉండగా 71.15 శాతం మేరకు అంటే 2,65,225 మంది ఓట్లు వేశారు. మహిళా ఓటర్ల సంఖ్య 3,69,911గా ఉండగా.. పురుషుల కంటే సుమారు 6.64 శాతం అధికంగా 77.79 శాతం అంటే 2,87,742 మంది ఓట్లు వేసినట్లు తేలింది. ఎమ్పీటీసీ స్థానాల విషయానికొస్తే.. మొత్తం ఓటర్లు 7,68,961 మంది ఉండగా 5,75,773 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ మేరకు 74.88 శాతం పోలింగ్ నమోదైంది. వీరిలో పురుష ఓటర్లు 3,86,129 మంది ఉండగా 71.66 శాతం మేరకు అంటే 2,76,710 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇదే విభాగంలో 3,82,832 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో 78.12 శాతం మేరకు అంటే 2,99,063 మంది ఓట్లు వేశారు. అంటే పురుషుల కంటే 6.46 శాతం ఎక్కువన్నమాట. అంచనాల్లో పార్టీలు తొలిదశ పోలింగ్ సరళి ఆధారంగా విజయావకాశాలను అంచనా వేయడంలో నిమగ్నమైన ప్రధాన పార్టీలు మహిళలు, పురుషుల ఓటింగ్ శాతంలో నమోదైన సుమారు ఆరున్నర శాతం తేడా ఎవరి విజయావకాశాలను ప్రభావితం చేస్తుందని విశ్లేషిస్తున్నారు. మహిళా ఓటింగ్ బాగా పెరగడం ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకే ఎక్కువగా లాభిస్తుందని భావిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలన్నింటినీ మహిళల పేరిటే అమలు చేయడంతో ఇప్పటికీ ఆయన్ను తలచుకుంటున్న మహిళలు ఆయన పేరిట ఏర్పాటైన వైఎస్ఆర్సీపీపై ఆదరణ చూపిస్తున్నారు. అందువల్ల మహిళలంతా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే ఓటు వేసి ఉంటారని భావిస్తున్నారు. దీంతో తెలుగుదేశం అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్నమొన్నటి వరకు వేసుకున్న ఓట్ల లెక్కలను పెరిగిన మహిళల ఓటింగ్ శాతం తారుమారు చేసే అవకాశముందంటున్నారు. బూత్‌ల వారీగా లెక్కలు కడుతూ మహిళా ఓట్లు ఎక్కడెక్కడ ఎవరిని దెబ్బతీస్తాయో.. ఇంకెవరిని అందలమెక్కిస్తాయో అంచనా వేస్తున్నారు. -
ఎంతైనా.. కొనేద్దాం!
ముగిసిన ‘మునిసిపల్’ ప్రచారం ఓటర్లను ఆకట్టుకునే పనిలో నేతలు {పలోభాలకు గురిచేసేందుకు సిద్ధం సాక్షి, హన్మకొండ : మునిసి‘పోల్స్’కు ప్రచారం ముగిసింది.. ఇక ఎన్నికలకు మరో 24 గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఇంతవరకు వినూత్న ప్రచారాలతో ఆకట్టున్న అభ్యర్థులు.. ఇప్పుడు ఓటర్లను మభ్యపెట్టే పనిలో పడ్డారు. మద్యం, నోట్ల కట్టలను ఎరగా చూపుతూ తమకే ఓటేయాలంటూ ప్రమాణాలు సైతం చేయించుకుంటున్నారు. వార్డును బట్టి.. అక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులను బట్టి ఒక్కో ఓటుకు ధర రెండువేల రూపాయల వరకు పలుకుతోంది. మరికొన్ని చోట్ల యువతను ఆకట్టుకునేందుకు క్రికె ట్ కిట్లను సైతం పంపిణీ చేస్తున్నారు. మహిళా ఓట్ల కోసం చీరలు, స్టీలు సామన్లు పంచేందుకు వెనుకడాడం లేదు. ఇక అన్ని మున్సిపాలిటీల్లో మద్యం షాపుల్లో ఉన్న సరుకంతా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులే కొనుగోలు చేశారు. దీంతో సాధారణంగా మద్యం కొనేందుకు వైన్స్‌కు వెళ్లిన వారికి నో స్టాక్ అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వైన్ షాపుల్లో ఆఫీసర్స్ ఛాయిస్, అరిస్ట్రోక్రాట్ ప్రీ మియం, మెక్‌డోవెల్, ఇంపీరియల్‌బ్లూ వంటి బ్రాండ్లు లభించట్లేదంటే అతిశయోక్తి కాదు. అంతకంటే ఎక్కువ మేమిస్తాం జిల్లాలోని జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు, నర్సంపేట, భూపాలపల్లి, పరకాల నగర పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 116 వార్డుల్లో అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఐదింటిలో డిమాండ్ ఉన్న వార్డుల్లో ఓటుకు బహిరంగానే కనిష్టంగా రూ. 500 నుంచి రూ. 1000 వరకు పలుకుతోంది. ఈ ముడుపులు చెల్లించే ముందు అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యర్థి ఓటుకు ఎంత ఇస్తున్నాడో ముందుగానే ఆరా తీస్తున్నారు. ఆ త ర్వాత అంతకు మూడొంతులు ఇస్తామని ఓటరుతో బేరం పెట్టుకుంటున్నారు. కాదు కూడదంటే ఇంకా పెంచేందుకు సిద్ధపడుతున్నారు. ఎటుచేసి ఓటరు మనసును ఎలా కొల్లగొట్టాలనే దానిపైనే అభ్యర్థులు దృష్టి సారించారు. కాగా, నర్సంపేటలోని 12, 16, 17 వార్డుల్లో, పరకాలలోని 8, 9, 18, 16 వార్డుల్లో, మహబూబాబాద్‌లోని 14, 16 వార్డుల్లో ఓటుకు రెండు వేల రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిళా ఓటర్లకు గాలం మహబూబాబాద్, జనగామ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ స్థానం మహిళలకు రిజర్వు కావడం తో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు చీరలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఒకటో వార్డులో చీరలు పంపిణీ చేస్తు న్న సీపీఎం నాయకుడిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. అతడి నుంచి పది చీరలు స్వా దీనం చేసుకున్నారు. మరో పద్ధతిలో కుండ గు ర్తు వచ్చిన అభ్యర్థులు అందుకు గుర్తుగా స్టీలు బిందెలు ఇస్తున్నారు. ఉంగరాలు గుర్తు వచ్చిన అభ్యర్థులు రోల్డ్‌గోల్డ్ ఉంగరాలు ఇస్తూ మహి ళా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. చివరి అస్త్రంగా పొన్నాల ప్రచారం మునిసిపాలిటీ ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగియడంతో టీపీసీసీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య జనగామలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. నర్సంపేటలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మిగిలిన చోట్ల స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ రాలేదు. కాగా, నర్సంపేట నగర పంచాయతీలో 16వ వార్డు టీఆర్ఎస్ అభ్యరి జి.రవీందర్ సతీమణి శుక్రవారం ఎస్బీహెచ్ నర్సంపేట బ్రాంచ్ నుంచి గోల్డ్‌లోన్ కింద రూ. 12 లక్షలు డ్రా చేశారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పోలీసు లు తనిఖీలు చేస్తుండగా, వీరి గుమస్తా వాహ నం దిగి పారిపోవడంతో అనుమానించిన పోలీసులు ఆ సొమ్ము పూర్వపరాలపై విచారణ చేస్తున్నారు. మహబూబాబాద్‌లోని 23 వార్డు లో కాంగ్రె స్ నాయకులు డబ్బు పంపిణీ చేస్తుం డగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 8,000 స్వాధీనం చేసుకున్నారు. -
మహిళా ఓట్లే కీలకం..
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : కార్పొరేషన్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారారు. వివిధ డివిజన్లకు పోటీ పడుతున్న వారి గెలుపోటములను శాసించనున్నారు. నగరపాలక సంస్థలో మహిళా ఓట్లు 1,09,986 ఉన్నాయి. ఇందులో 42,404 మంది అమ్మాయిలు (యూత్) ఉన్నారు. దాదాపు సగం డివిజన్లలో పురుషులతో సమానంగా ఓటర్లు ఉన్నారు. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు వీరి ఓట్లపైనే ఆధారపడుతున్నారు. మహిళలు ఓటు వేస్తామని మాటిస్తే తమ గెలుపు నల్లేరుమీద నడకేనని భావిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలోనూ మహిళలే ముందుంటారని సర్వేలు చెబుతుండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. స్వశక్తి సంఘాలతో మారిన తీరు 2004 వరకు ఎన్నికల్లో పురుషులదే పైచేయిగా ఉండేది. ఎన్నికలొచ్చాయంటే ఒకచోట సమావేశం ఏర్పాటు చేసి తమకు ఓటేయాలని, గెలిస్తే ఫలానా అభివృద్ధి పనులు చేస్తామని అభ్యర్థించే వారు. కానీ.. ఆ పరిస్థితి నేడు పూర్తిగా మారిపోయింది. స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు అయినప్పటి నుంచి మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంటోంది. దీంతో వారిని ఒప్పించేం దుకు అభ్యర్థులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. నగరంలో మొత్తం 3005 సంఘాలున్నాయి. ఇందులో 30050 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. సంఘాలకు భవనాలు, కుటీర పరిశ్రమలకు రుణాలు.. తదితర ప్రభుత్వ పథకాలను తెప్పిస్తానంటూ హామీ ఇస్తున్నారు అభ్యర్థులు. మహిళా సంఘాల ఓట్లు రాబట్టగలిగితే.. వారి కుటుంబంలోని ఓట్లు సైతం వస్తాయన్న నేతల్లో ఉంది. అయితే తమకు అభివృద్ధి పనులు చేసిన.. చేస్తారన్న నమ్మకం ఉన్నవారికే ఓటు వేస్తామని మహిళలు తెగేసి చెబుతుండడం గమనార్హం.