కార్పొరేషన్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారారు.
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : కార్పొరేషన్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారారు. వివిధ డివిజన్లకు పోటీ పడుతున్న వారి గెలుపోటములను శాసించనున్నారు. నగరపాలక సంస్థలో మహిళా ఓట్లు 1,09,986 ఉన్నాయి. ఇందులో 42,404 మంది అమ్మాయిలు (యూత్) ఉన్నారు. దాదాపు సగం డివిజన్లలో పురుషులతో సమానంగా ఓటర్లు ఉన్నారు. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు వీరి ఓట్లపైనే ఆధారపడుతున్నారు. మహిళలు ఓటు వేస్తామని మాటిస్తే తమ గెలుపు నల్లేరుమీద నడకేనని భావిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలోనూ మహిళలే ముందుంటారని సర్వేలు చెబుతుండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.
స్వశక్తి సంఘాలతో మారిన తీరు
2004 వరకు ఎన్నికల్లో పురుషులదే పైచేయిగా ఉండేది. ఎన్నికలొచ్చాయంటే ఒకచోట సమావేశం ఏర్పాటు చేసి తమకు ఓటేయాలని, గెలిస్తే ఫలానా అభివృద్ధి పనులు చేస్తామని అభ్యర్థించే వారు. కానీ.. ఆ పరిస్థితి నేడు పూర్తిగా మారిపోయింది. స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు అయినప్పటి నుంచి మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంటోంది. దీంతో వారిని ఒప్పించేం దుకు అభ్యర్థులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. నగరంలో మొత్తం 3005 సంఘాలున్నాయి.
ఇందులో 30050 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. సంఘాలకు భవనాలు, కుటీర పరిశ్రమలకు రుణాలు.. తదితర ప్రభుత్వ పథకాలను తెప్పిస్తానంటూ హామీ ఇస్తున్నారు అభ్యర్థులు. మహిళా సంఘాల ఓట్లు రాబట్టగలిగితే.. వారి కుటుంబంలోని ఓట్లు సైతం వస్తాయన్న నేతల్లో ఉంది. అయితే తమకు అభివృద్ధి పనులు చేసిన.. చేస్తారన్న నమ్మకం ఉన్నవారికే ఓటు వేస్తామని మహిళలు తెగేసి చెబుతుండడం గమనార్హం.