తొలి విడత పోలింగులో పడతుల పైచేయి
Published Tue, Apr 8 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 5:42 AM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: తొలివిడత ప్రాదేశిక ఎన్నికల పోలింగు సందర్భంగా ఓటు హక్కు వినియోగించడంలో పురుషల కంటే తామే మెరుగని మహిళలు నిరూపించుకున్నారు. ఆదివారం జరిగిన పోలింగులో అటు జెడ్పీటీసీ.. ఇటు ఎంపీటీసీల్లోనూ మహిళల ఓటింగ్ శాతమే ఎక్కువగా నమోదైంది. ఈ పరిణామాన్ని వైఎస్‌ఆర్‌సీపీకి సానుకూల సంకేతంగా అంచనా వేస్తున్నా రు. తొలిదశలో 17 జెడ్పీటీసీ, 303 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జెడ్పీటీసీలకు 7,42,705 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉండగా, 5,52,967 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 74.45 శాతం పోలింగ్ నమోదైంది.
జెడ్పీటీసీ ఓటర్లలో 3,72,794 మంది పురుషులు ఉండగా 71.15 శాతం మేరకు అంటే 2,65,225 మంది ఓట్లు వేశారు. మహిళా ఓటర్ల సంఖ్య 3,69,911గా ఉండగా.. పురుషుల కంటే సుమారు 6.64 శాతం అధికంగా 77.79 శాతం అంటే 2,87,742 మంది ఓట్లు వేసినట్లు తేలింది. ఎమ్పీటీసీ స్థానాల విషయానికొస్తే.. మొత్తం ఓటర్లు 7,68,961 మంది ఉండగా 5,75,773 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ మేరకు 74.88 శాతం పోలింగ్ నమోదైంది. వీరిలో పురుష ఓటర్లు 3,86,129 మంది ఉండగా 71.66 శాతం మేరకు అంటే 2,76,710 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇదే విభాగంలో 3,82,832 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో 78.12 శాతం మేరకు అంటే 2,99,063 మంది ఓట్లు వేశారు. అంటే పురుషుల కంటే 6.46 శాతం ఎక్కువన్నమాట.
అంచనాల్లో పార్టీలు
తొలిదశ పోలింగ్ సరళి ఆధారంగా విజయావకాశాలను అంచనా వేయడంలో నిమగ్నమైన ప్రధాన పార్టీలు మహిళలు, పురుషుల ఓటింగ్ శాతంలో నమోదైన సుమారు ఆరున్నర శాతం తేడా ఎవరి విజయావకాశాలను ప్రభావితం చేస్తుందని విశ్లేషిస్తున్నారు. మహిళా ఓటింగ్ బాగా పెరగడం ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్‌ఆర్‌సీపీకే ఎక్కువగా లాభిస్తుందని భావిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలన్నింటినీ మహిళల పేరిటే అమలు చేయడంతో ఇప్పటికీ ఆయన్ను తలచుకుంటున్న మహిళలు ఆయన పేరిట ఏర్పాటైన వైఎస్‌ఆర్‌సీపీపై ఆదరణ చూపిస్తున్నారు. అందువల్ల మహిళలంతా ఖచ్చితంగా వైఎస్‌ఆర్‌సీపీకే ఓటు వేసి ఉంటారని భావిస్తున్నారు. దీంతో తెలుగుదేశం అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్నమొన్నటి వరకు వేసుకున్న ఓట్ల లెక్కలను పెరిగిన మహిళల ఓటింగ్ శాతం తారుమారు చేసే అవకాశముందంటున్నారు. బూత్‌ల వారీగా లెక్కలు కడుతూ మహిళా ఓట్లు ఎక్కడెక్కడ ఎవరిని దెబ్బతీస్తాయో.. ఇంకెవరిని అందలమెక్కిస్తాయో అంచనా వేస్తున్నారు.
Advertisement
Advertisement