నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఎంపీ స్థానంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో మహిళల జనాభానే అధికంగా ఉంది.
పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడంతో వారి ఓట్లే గెలుపోటములను నిర్ణయించనున్నాయి.
మోర్తాడ్(బాల్కొండ): త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి మహిళా లోకానికే ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఉన్న ఓటర్లలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. పురుషుల కంటే మహిళా ఓట్లు అధికంగా ఉండడంతో అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయడంలో మహిళ ఓటర్లే కీలకం అని వెల్లడవుతుంది. ఇటీవల ఆయా నియోజకవర్గాలలో జారీ అయిన ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే అన్ని శాసనసభ నియోజకవర్గాలలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
నిజామాబాద్ ఎంపీ స్థానం పరిధిలో మొత్తం 15,53,301 ఓటర్లు ఉండగా ఇందులో మహిళా ఓటర్లు 8,14,689 ఉండగా, పురుష ఓటర్లు 7,38,577గా నమోదైంది. ఇతర ఓటర్లు 35 మంది ఉన్నారు. అంటే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 76,112 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అంతేకాక గతంలో జరిగిన వివిధ ఎన్నికల పోలింగ్ శాతాన్ని గమనిస్తే ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో మహిళా ఓటర్ల సంఖ్యనే ఎక్కువగా ఉంది. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడమే కాకుండా పోలింగ్‌లోను వారిదే పైచేయిగా నిలవడం గమనార్హం. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,06,383 ఉండగా, మహిళా ఓటర్లు 1,11,458 మంది ఉన్నారు.
పురుషులకు సంబంధించి 94,921 మంది ఓటర్లు ఉండగా, ఇతరులు నలుగురు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 16,537 మంది ఎక్కువ ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 1,92,706 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1,02,704, పురుషులు 89,997 మంది ఓటర్లు ఉన్నారు. ఇతర ఓటర్లు ఐదుగురు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 12,707 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. బోధన్ నియోజకవర్గంలో 2,07,379 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1,07,463 మంది ఉండగా, పురుష ఓటర్లు 99,913 మంది ఉన్నారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. 7,550 మంది మహిళా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 2,69,028 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1,37,738 మంది ఉండగా, 1,31,272 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 18 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. 6,466 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2,36,620 మంది ఓటర్లు ఉండగా, 1,26,511 మంది మహిళా ఓటర్లు ఉండగా, 1,10,107 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఇద్దరు ఇతర ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 16,404 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో 2,27,284 మంది ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లు 1,18,653 మంది ఉండగా, పురుష ఓటర్లు 1,08,631 మంది ఉన్నారు. 10,022 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జగిత్యాల్ నియోజకవర్గంలో 2,13,901 మంది ఓటర్లు ఉండగా, 1,10,162 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,03,736 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు ముగ్గురు ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో 6,426 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యనే ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహిళా ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment