ప్రకృతి ఒడిలో ‘దక్కన్‌ ట్రేల్స్‌’ | Wonder Land in Deccan | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడిలో ‘దక్కన్‌ ట్రేల్స్‌’

Published Thu, Apr 25 2019 12:46 PM | Last Updated on Tue, May 7 2019 12:18 PM

Wonder Land in Deccan  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాలుష్య కాంక్రీట్‌ కీకారణ్యంలో బతుకుతున్న వారికి అప్పుడప్పుడు అహ్లాదం కోసం అడవుల్లోకో, కనీసం ఊరవతలుండే కొండా కోనల్లోకో పోయి రావాలనిపిస్తోంది. అహ్లాదం కోసం కాకపోయినా ఆక్సీజన్‌ కోసమైనా అప్పుడప్పుడు అడవుల అంచుల దాకైన వెళ్లి రావాలి. అలాంటి వారి కోసమే కాకుండా వారి పిల్లా పాపల కోసం కూడా  అందుబాటులో ఉన్నదే ‘దక్కన్‌ ట్రేల్స్‌’ విహార కేంద్రం. అక్కడి ‘సాహస క్రీడల్లో’ పిల్లలు ఊగిపోతుంటే పెద్దలు పిల్లల నాటి ఊసులతో తేలిపోవాల్సిందే. పచ్చటి పచ్చికల మీదుగా వీచే పైరగాలి విసురుకు యవ్వనం నాటి మధురానుభూతుల్లోకి మరొక్కసారి వెళ్లి రావాల్సిందే. ఇక వయస్సులో ఉన్న జంటలు ఊసులాడుకునేందుకు అనువైన చోటు. కాలుష్యం జాడలు కనిపించని ప్రశాంతమైన వాతావరణం. పక్కనే ఉన్న కొండగట్టుకెళితే అక్కడో ‘ఫ్యూ’ పాయింట్‌. అక్కడి నుంచి చూస్తే కళ్లముందు దట్టమైన అడవుల కనువిందు. అక్కడ అడవుల్లోకి ‘ట్రెక్కింగ్‌’ చేయడం అదనపు ఆనందం. ఉదయం, సాయంత్రం మాత్రమే ఇది అందుబాటులో ఉండే సదుపాయం. మనం ట్రెక్కింగ్‌ చేస్తుంటే జింకలు, నెమళ్లు, అడవి పందులు మన ముందునుంచే పరగులు తీస్తాయి. ఇక సీజన్‌లో పక్షుల కిలకిలారావాలు మన వీనులకు విందు చేస్తుంటే, ఇతర అడవి ప్రాణుల సందడి మన మదిలో ఒక విధమైన అలజడి రేపుతాయి.



ఇంతటి అనుభూతిని కలిగించే ప్రాంతం మరెక్కడో కాదు. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్‌ ప్రాంతం. వాటి పక్కనే వికారాబాద్‌ రూట్‌లో, చేవెళ్లకు చేరువలో మన్నెగూడ పక్కన ‘దక్కన్‌ ట్రేల్స్‌’ పర్యాటక కేంద్రం ఉంది. అనంతగిరి హిల్స్‌ను కూడా దక్కన్‌ హిల్స్‌ అంటారుగనుక, వాటి పక్కనే ఉన్నందున దీనికి కూడా ‘దక్కన్‌ ట్రేల్స్‌’ అని పేరు పెట్టి ఉంటారు. పేరు ఎలా పెట్టినా అది మన దక్కన్‌ పీఠభూమిలో భాగమేకదా! ఉద్దేశపూర్వకంగానే అనంతగిరి అడవుల అందాలను ఆస్వాదించడం కోసమే పర్యాటక కేంద్రాన్ని అక్కడ అభివద్ధి చేశారు. పిల్లలు, యువతీయువకుల కోసం అందులో రాక్‌ క్లైంబింగ్, బర్మా తాళ్ల వంతెన, టార్జాన్‌ స్వింగ్, స్పైడర్‌ వెబ్‌ సాహస క్రీడలు ఉన్నాయి. ఇంకా జంపింగ్‌ స్ప్రింగ్‌ నెట్, బాక్సింగ్‌ కిట్‌లు సరేసరి. సైక్లింగ్, వాలీబాల్‌ మామూలే!

అడవివైపు అందమైన ‘వ్యూపాయింట్‌’ ఉండగా, ఇవతలి వైపు నలుగురు కూర్చునే చిట్టి గుడిశె మరో ఆకర్షణ. అక్కడ కూర్చుంటే కొండ వాలుగా వీచే పైర గాలులకు కొదవ లేదు. అక్కడి నుంచి సాయంత్రం సూర్యాస్తమి చంద్రోదయాన్ని ఏకకాలంలో చూడడం అద్భుతమైన అనుభూతి. ఎంత ప్రకతిలో ఐక్యమైనా సమయానికి అన్న పానీయాలు అందకపోతే అదో వెలితే. ఆ వెలితి ఉండకుండా ఎప్పటికప్పుడు మనకు అన్న పానీయాలు అంద చేయడానికి పర్యాటక కేంద్రం సిబ్బంది సిద్ధంగా ఉంటారు. సైనికుల్లాగ దుస్తులు ధరించే వారు సైనికుల వల్లే యుద్ధ ప్రాతిపదికపై పరుగులు తీస్తూ పనిచేయడం మనల్ని ఆకట్టుకుంటుంది. ఎలాంటి పర్యాటక ప్రాంతమైనా, ముఖ్యంగా ఇలాంటి పర్యాటక ప్రాంతం వసంత, హేమంత, శీతాకాలాల్లో ఎక్కువ బాగుంటుంది. మిగతా సీజన్లో అంతటి పచ్చతనం తప్ప ఆహ్లాదకరంగానే ఉంటుంది. చలికాచుకునేందుకు ‘నెగళ్ల’ ఏర్పాటు కూడా ఉంది. అక్కడికి మామాలు రోజుల్లో 50 మంది వరకు వస్తుంటే, వీకెండ్‌లో, సెలవు రోజుల్లో 120కి పైగా పర్యాటకులు వస్తున్నారట. అంతమందికే అక్కడ శాశ్వత ప్రాతిపదికపై వసతులు ఉన్నాయి. వారి కోసం మంచి గుడారాలు (టెంట్లు) అందుబాటులో ఉన్నాయి. గుడారాల భద్రతను దృష్టిలో పెట్టుకొని కామన్‌ డైనింగ్‌ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడం కోసం వసతి సదుపాయాలను పెంచుకుంటూపోతే ప్రశాంత వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే నూతన సంవత్సరం లాంటి వేడుకల్లో భాగంగా ఎక్కువ మందికి ఆతిథ్యం ఇవ్వడం కోసం తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేస్తారట.

ఇంతగా చెబుతుంటే ఏ ఊటి, కొడైకెనాల్, కూర్గ్‌నో ఊహించుకోవద్దు! అవి మనకు చాలా దూరంలో ఉన్న ఖరీదైన పర్యాటకు కేంద్రాలు. ఒక్క హైదరాబాద్‌కే కాకుండా తెలాంగణ ప్రాంతం మొత్తానికి అందుబాటులో ఉన్న పర్యాటక ప్రాంతం ఇది. పైపెచ్చు దేని అందం దానిదే. పర్యాటక కేంద్రం నుంచి మరికొన్ని కిలోమీటర్లు వాహనంలో ప్రయాణిస్తే నాగసముద్రం కాలువ, నాలుగు వందల ఏళ్ల నాటి అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ పర్యాటక కేంద్రంలో ఓ టెంట్‌ను బుక్‌ చేసుకోవాలంటే హైదరాబాద్, బంజారాహిల్స్, రోడ్డు నెంబర్‌ వన్‌లోని ఏబీకే ఓల్బీ ప్లాజాకు వెళ్లాలి. లేదంటే 9440638450 ఫోన్‌ ద్వారా సురేందర్‌ అనే కేర్‌ టేకర్‌ను సంప్రతించవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలంటే ‘డెక్కన్‌ ట్రేల్స్‌ డాట్‌ కామ్‌’ను సందర్శించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement