‘బిల్ట్‌’ భూముల అమ్మకంపై ఆగ్రహం | Workers Protest in Front of Built Factory in Warangal | Sakshi
Sakshi News home page

‘బిల్ట్‌’ భూముల అమ్మకంపై ఆగ్రహం

Published Thu, Jul 25 2019 10:20 AM | Last Updated on Thu, Jul 25 2019 10:21 AM

Workers Protest in Front of Built Factory in Warangal - Sakshi

నిడిగొండ వెంచర్‌ వద్ద ఆందోళనలో కార్మికులు, ఎమ్మెల్యే సీతక్క

మంగపేట / రఘునాథపల్లి : ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని బల్లార్‌పూర్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(బిల్ట్‌) కంపెనీకి చెందిన ట్రీటెక్‌ భూములను యజమాన్యం రహస్యంగా విక్రయించడంపై కార్మికులు, జేఏసీ బాధ్యులు కన్నెర్ర చేశారు. 2014 ఏప్రిల్‌ 05 నుంచి ఫ్యాక్టరీలో ఉత్పత్తిని నిలిపివేసిన యజమాన్యం 48 నెలలుగా వేతనాలు చెల్లించకుండా, పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వకుండా రహస్యంగా సుమారు రూ.172 కోట్ల విలువైన భూములను అమ్మడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు బిల్ట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం 20 ఏళ్ల క్రితం రఘనాథపల్లి మండలం నిడిగొండ వద్ద ట్రీటెక్‌ ప్లాంటేషన్‌ కోసం 584 ఖాతా నంబర్‌లో పదకొండు సర్వేనంబర్లపై 59.35 ఎకరాల భూమి కొనుగోలు చేయగా తాజాగా ఈ భూమిని విక్రయించారు. విషయం తెలుసుకున్న భూముల విక్రయాలను అడ్డుకునేందుకు కార్మికులు, వారి కుటుంబ సభ్యులు లారీల్లో బుధవారం నిడిగొండకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. 

సర్కార్‌ స్పందించకుంటే జెండాలు పాతుతాం
అక్రమంగా విక్రయించిన నిడిగొండలోని బిల్ట్‌ కంపెనీ భూములను వెనక్కి తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. నిడిగొండలోని భూములను రియల్‌ సంస్థలకు విక్రయించారన్న సమాచారం తెలియడంతో కార్మికులు పెద్దసంఖ్యలో చేరుకుని ధర్నా నిర్వహించారు. కమలాపూర్‌ నుంచి రెండు లారీల్లో వచ్చిన సుమారు 200 మందికి మద్దతుగా సీతక్క ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా కార్మికులు వినలేదు. తొలుత 52 నెలల వేతనాలు చెల్లించడంతో పాటు ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సీతక్క విలేకరులతో మాట్లాడుతూ బిల్ట్‌ కంపెనీని మూసి కార్మికులకు యజమాన్యం తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు.

52 నెలలుగా వేతనాలు లేక వారి కుటుంబాలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయన్నారు. కష్టాల్లో ఉన్న బిల్ట్‌ కంపెనీకి ఏటా 30 కోట్లు కేటాయిస్తానని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనంతరం ఆ విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. కార్మికుల చెమట చుక్కలతో వచ్చిన లాభాల ద్వారా నిడిగొండలో కొనుగోలు చేసిన భూములను యాజమాన్యం స్వార్థ ప్రయోజనాలకు విక్రయించుకోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు. సర్కార్‌ స్పందించి స్థలాలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో జెండాలు పాతుతామని సీతక్క హెచ్చరించారు. 

కలెక్టర్, ఆర్డీఓకు ఫిర్యాదు
బిల్ట్‌ కంపెనీ భూములను కాపాడి కార్మికులను న్యాయం చేయాలని ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో జనగామ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్డీఓ మధుమోహన్, తహసీల్దార్‌ తిరుమలాచారికి కార్మికులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల వరలక్ష్మి, వివిధ పార్టీలు, బిల్ట్‌ జేఏసీ నాయకులు కోళ్ల రవిగౌడ్, మోకు కనకారెడ్డి, పొదల నాగరాజు, జోగు ప్రకాశ్, రాంచందర్, వెంకట్‌రెడ్డి, కురుబాన్‌ఆలీ, డీవీపీ. రాజు, మునిగాల వెంకటేశ్వర్లు, తిరుపతిరెడ్డి, రవిమూర్తి, వెంకటేశ్వర్లు, వెంకట్‌రెడ్డి, బొట్ల శ్రావణ్, కల్లెపు కుమార్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement