గ్రేటర్ నగర విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. అంటే 1.54 లక్షల ఎకరాల్లో విస్తరించింది. సిటీలో 30 శాతం హరితం ఉండాలి.. కానీ ఉన్నది 8 శాతం.. మహానగరంలో సుమారు 12,320 ఎకరాల్లో మాత్రమే గ్రీన్‌బెల్ట్ ఉంది. దీన్ని కనీసం 24,710 ఎకరాలకు(16 శాతం) పెంచడం తక్షణ కర్తవ్యంప్రపంచ పోకడలను ఒంటబట్టించుకుని జెట్ స్పీడ్‌తో దూసుకు పోతున్న మహానగరం పర్యావరణ పరంగాతిరోగమనంలో పయనిస్తోంది. ఉన్న చెట్లను నరికేసి బహుళ అంతస్తుల భవంతులు నిర్మించడంలో చూపుతున్న శ్రద్ధ.. పచ్చదనంపై చూపడం లేదు. దీంతో ఏటా గ్రేటర్‌లో వేసవి ఉష్ణోగ్రతలువిపరీతంగాపెరిగిపోతున్నాయి. మున్ముందు ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారేఅవకాశముంది. కోటికి పైగా జనాభా ఉన్న సిటీలో ‘హరితం’ శాతం గణనీయంగాతగ్గిపోతుండడంతో ఇటీవల 44 డిగ్రీల మేర నమోదైన పగటి ఉష్ణోగ్రతలు సొమ్మసిల్లేలా చేయడం ప్రతి ఒక్కరికీ అనుభవమైంది. ఈ నేపథ్యంలో ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా గ్రేటర్ నగరం గ్రీన్‌చాలెంజ్‌ను స్వీకరించక తప్పదు.
సాక్షి, సిటీబ్యూరో :సుమారు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్‌ఎంసీపరిధిలో గతేడాది కోటి మొక్కలు నాటగా.. వీటిలో 50 శాతం మొక్కలే బతికాయి. ఇందులో ఇళ్లకు పంపిణీ చేసే తులసి, కలబంద, క్రోటన్, పూల మొక్కల వంటి చిన్న మొక్కలే అధికంగా ఉన్నాయి. ఖాళీ ప్రదేశాలు, చెరువులు, పార్కుల వద్ద నాటే విషయంలో బల్దియా యంత్రాంగంవిఫలమైంది. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు ఖాళీస్థలాలు అందుబాటులో లేవనిఅధికారులు చెబుతుండడం గమనార్హం ఏటా వర్షాకాలంలో చేపట్టే హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రభుత్వ విభాగాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సిటీజన్లు ఉద్యమించకుంటే భవిష్యత్ తరాలు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉద్యమంలో మొక్కలు నాటకుంటే వచ్చే వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మహానగరాన్ని ‘గ్రీన్ సిటీ’గా మార్చేందుకు ప్రభుత్వం కొన్నేళ్లుగా నిర్వహించిన హరితహారం ఉద్దేశం బాగానే ఉన్నా.. నగరంలో గ్రీన్‌బెల్ట్‌ను గణనీయంగా పెంచేందుకు అది అంతగా దోహదం చేయలేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మహానగరంలో చేపట్టిన హరితహారంలో 95 శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూల మొక్కలనే పంపిణీ చేశారు. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీస్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు ఇందులో ఐదు శాతం మాత్రమే ఉన్నట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మెట్రోనగరాల్లో హరితం ఇలా..
దేశంలో 35 శాతం గ్రీన్‌బెల్ట్‌తో ప్రణాళికబద్ధ నగరం ఛంఢీగడ్ తొలిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన దేశరాజధాని ఢిల్లీలో 20.20 శాతం, గ్రీన్‌సిటీగా పేరొందిన బెంగళూరులో 19 శాతం, కోల్కతాలో 15 శాతం, ముంబైలో 10 శాతం, చెన్నైలో 9.5 శాతం గ్రీన్‌బెల్ట్ ఉన్నట్లు పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మన నగరంలో మాత్రం హరితం 8 శాతానికే పరిమితమవడం ఆందోళన కలిగించే అంశం.
గ్రేటర్‌లో హరితం హననం
శతాబ్దాలుగా తోటల నగరం(బాగ్)గా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇప్పుడు హరిత వాతావరణం రోజురోజుకూ తగ్గిపోతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండడంతో కాంక్రీట్ మహారణ్యంలా మారిన నగరంలో హరిత వాతావరణం కనుమరుగై మహానగర పర్యావరణం త్వరగా వేడెక్కుతోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్(హరిత వాతావరణం)ఉండాలి. కానీ నగరంలో కేవలం 8 శాతమే గ్రీన్‌బెల్ట్ ఉండడం గమనార్హం. దీంతో పెరుగుతున్న కాలుష్యంతో నగరంలో ప్రాణవాయువు కనుమరుగై సిటీజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అంతేకాదు ఒకప్పుడు ఉబ్బసం వ్యాధి గ్రస్తులకూ నగర వాతావరణం ఉపశమనం కలిగిస్తుందన్న నానుడి ఉండేది. కానీ ఈ పరిస్థితిని మనమే చేజేతులా దూరం చేసుకుంటున్నాం. శరవేగంగా రహదారుల విస్తరణ, బహుళ అంతస్తుల భవంతులు, వాణిజ్య సముదాయాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా.. గ్రీన్‌టాప్ అంతకంతకూ పెరగకపోవడంతో మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న గ్రీన్‌హౌస్ వాయువులైన కార్బన్ డయాక్సైడ్,కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల ఉద్గారాలు పెరిగిపోతన్నాయి. దీంతో వేసవి తాపంఉక్కిరిబిక్కిరిచేస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో చేపట్టే హరితహారంలో ప్రస్తుతం గ్రేటర్‌లో ఉన్నగ్రీన్‌బెల్ట్‌ను 8 శాతం నుంచి కనీసం 16 శాతానికి పెంచాలని చెబుతున్నారు.
ఇలా చేస్తే ఎంతో మేలు
♦ నగరంలోని ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి.
♦ తద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగి, పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుంది.
♦ సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వారికి జీహెచ్‌ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి.
♦ నూతనంగా ఏర్పడిక కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులు ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి.
హరితంతో కాలుష్యం దూరం
చెట్ల ఆకులు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్, సూక్ష్మ ధూళి కణాలను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. దీంతో మనం పీల్చేగాలిలో ఆక్సిజన్ మోతాదు పెరుగుతుంది. చెట్లు ఎయిర్ ఫిల్టర్లుగా పనిచేస్తాయని అందరూ గ్రహించాలి. చెట్లు చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా విద్యుత్ వంటి ఇంధనాన్ని ఆదా చేస్తాయి. కాలుష్య ఉద్గారాలను బాగా తగ్గిస్తాయి.
ఇళ్లలో నాటే మొక్కలతో గ్రీన్‌బెల్ట్ పెరగదు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారంలో నాటుతున్న మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచేవే. వీటితో గ్రీన్‌బెల్ట్ పెరిగే అవకాశం లేదు. దీర్ఘకాలం మన్నికగలవి, ఆక్సిజన్ అందించేవి, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే వేప, రావి, మర్రి, మద్ది, చింత వంటి సంప్రదాయ చెట్లను పెద్దమొత్తంలో నాటితేనే గ్రీన్‌బెల్ట్ పెరుగుతుంది. వాటితో ఆక్సిజన్ శాతం పెరిగి సిటీజన్లకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. ప్రస్తుత హరితహారంతో నర్సరీల నిర్వాహకులకే లాభం చేకూరుతోంది తప్ప ప్రజలకు ఉపయోగకరంగా ఉండడం లేదు.– జీవానందరెడ్డి,పర్యావరణవేత్త
Comments
Please login to add a commentAdd a comment