
వెళ్దాం.. వెళ్దాం.. ఆ వెళ్లేదేదో..
అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో ఉన్న మిల్ ఎండ్స్ పార్కుకు వెళ్దాం..
ఆ రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్లు.. పచ్చిక చూసి.. అదే పార్కు అనుకుంటున్నారా.. కాదండీ.. ఎక్కడుందబ్బా అని దిక్కులు చూడకండి.. అదిగో సరిగ్గా రోడ్డు మధ్యన ఆ.. అదే.. అరే.. కరెక్టుగా గుర్తుపట్టేశారే.. అదిగో ఆ రోడ్డుకు సెంటరాఫ్ ఎట్రాక్షన్‌లా కనిపిస్తున్నదే మిల్ ఎండ్స్ పార్కు! ఏమిటి.. ఈ తొక్కలో మొక్కా అని గట్టిగా అనమాకండి.. ఎందుకంటే.. మొక్కే కదా అని పీకేస్తే.. పీక తెగ్గోసే రకాలు అక్కడ.. ఎందుకంటే..
పోర్ట్‌ల్యాండ్ వాసులకు ఈ పార్కు అంటే ఎంతో ప్రీతి.. చాన్స్ దొరికినప్పుడల్లా ఇక్కడ పండగల్లాంటివి చేసేసుకుంటుంటారు. ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన పార్కు మా సొంతం అని కాలరెగరేస్తుంటారు. సాక్ష్యంగా గిన్నిస్ వాళ్లు ఇచ్చిన రికార్డు ప్రతిని కూడా చూపిస్తారు. అంతేనా.. ఈ పార్కు ఎలా ఏర్పడిందన్న విషయాన్ని కూడా మనకు పూసగుచ్చినట్లు వివరిస్తారు.. మరి మనం పూస గుచ్చకుండానే ఆ కథను వినేద్దామా..
అనగనగా.. కొన్నాళ్ల క్రితం.. అంటే 1940ల్లో.. ఇక్కడ కరెంటు స్తంభం పాతడానికి గొయ్యి తవ్వారు. కరెంటు స్తంభమైతే రాలేదు గానీ.. గొయ్యి మిగిలిపోయింది. దీంతో స్థానిక పత్రికలో కాలమిస్టుగా పనిచేసే డిక్‌ఫగాన్ అనే ఆయన ఈ గొయ్యిలో పూల మొక్క నాటాడు. వాళ్ల ఆఫీసు దీని ఎదురుగానే ఉండేది. ఆయన మిల్ ఎండ్స్ పేరిట సదరు పత్రికలో తన అనుభవాలను కథలు కథలుగా రాసేవాడు. దీన్ని ప్రపంచంలోనే అతి చిన్నపార్కుగా పేర్కొంటూ.. ఈ పార్కు దాని చుట్టూ నివసించే జనం గురించి తన కాలమ్‌లో ఊహాజనిత కథనాలు రాసేవాడు.
తాను ఓ సారి ఓ దేవతను తనకో పార్కు కావాలని కోరానని.. అయితే.. దాని సైజు చెప్పకపోవడంతో ఆ దేవత తనకీ చిన్న పార్కును ప్రసాదించిందని.. ఇలా ఉండేవి అతడి కథనాలు. 1969లో ఫగాన్ చనిపోయాడు. 1976లో స్థానిక అధికార యంత్రాంగం దీన్ని సిటీ పార్కుగా ప్రకటించింది. తదనంతర కాలంలో ఈ పార్కు పేరు మీద ఉత్సవాలు కూడా జరిగాయి. కొంతమంది చిన్నచిన్న బొమ్మలతో దీన్ని అలంకరించడం.. ఒక మొక్క ఎండిపోతే.. మరొకటి నాటడం వంటివి చేసేవారు. పార్కులోని మొక్కల పేర్లు మారాయి గానీ.. అతి చిన్న పార్కుగా మిల్ ఎండ్స్ పేరు మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. కథ కంచికి.. మనం ఇంటికి..
– సాక్షి, తెలంగాణ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment