జీఎస్టీలో జీరో దందా! | Worth hundreds of crores Black market | Sakshi
Sakshi News home page

జీఎస్టీలో జీరో దందా!

Published Wed, Dec 6 2017 1:43 AM | Last Updated on Wed, Dec 6 2017 1:43 AM

Worth hundreds of crores Black market - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జీరో (పన్ను చెల్లించకుండా విక్రయాలు) దందా విజృంభిస్తోంది. ఐరన్‌ అండ్‌ స్టీల్, మసాలా దినుసులు, డ్రైఫ్రూట్స్, సిరామిక్‌ టైల్స్, సిమెంటు వంటి సరుకులకు సంబంధించి జీరో దందా జోరుగా సాగుతోంది. ఏ రాష్ట్రం నుంచి ఏ సరుకు వస్తోందో తెలుసుకునే నిఘా వ్యవస్థ అయిన చెక్‌పోస్టులను ఎత్తివేయడం, మొబైల్‌ తనిఖీలను కూడా చేపట్టకపోవడంతో వేల కోట్ల విలువైన సరుకులు బ్లాక్‌మార్కెట్‌కు తరలివెళుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి వందల కోట్లలో ఆదాయం చేజారుతున్నా... పన్నుల శాఖలో కదలిక రావడం లేదు. ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలు జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలి నెల నుంచే మొబైల్‌ తనిఖీలు చేపట్టి, పన్ను ఎగవేతలను అరికడుతున్నాయి. రాష్ట్రంలో మాత్రం అధికారులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండటం గమనార్హం.

ఒక్క రోజు తనిఖీల్లోనే రూ. 34 లక్షలు
ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనే జీరో దందా తీరును స్పష్టంగా చూపుతోంది. ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా మొబైల్‌ తనిఖీలు చేపట్టి 34 వాహనాలను సీజ్‌ చేసి, రూ.34.36 లక్షల జరిమానా విధించామని ఆ శాఖ కమిషనర్‌ ప్రకటించారు. ఒక్క రోజు తనిఖీల్లోనే ఇలా ఉంటే.. ఇంతకాలంగా ఎన్ని వందల కోట్ల్ల పన్నుకు చిల్లు పడిందో అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బృందాలు తనిఖీలు నిర్వహిస్తే ఏకంగా నెలకు రూ.100 కోట్ల మేర సమకూరే అవకాశముందని అంటున్నారు. దీనివల్ల ఇటు సర్కారుకు ఆదాయంతోపాటు జీరో దందా నడవదని అటు వ్యాపారులకు సంకేతాలు ఇచ్చినట్టవుతుందని పేర్కొంటున్నారు.

సానుకూల దృక్పథమంటే.. వదిలేయడం కాదు!
కొత్త పన్ను విధానాన్ని తీసుకువస్తున్నందున వ్యాపారుల పట్ల కొంత సానుకూల దృక్పథా న్ని కనబర్చాలని జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలినాళ్లలో (ఆరు నెలల క్రితం) కేంద్రం చిన్న సూచన చేసింది. దీనిని సాకుగా తీసుకున్న ఉన్నతాధికారులు రాష్ట్ర పన్నుల శాఖను ఓ రకంగా నిద్రావస్థకు చేర్చారన్న విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు రవాణాదారులు, డీలర్లు కుమ్మక్కై వేల కోట్ల విలువైన సరుకులతో రాష్ట్ర మార్కెట్‌లో జీరో దందా చేస్తున్నా పట్టించుకో వడం లేదని... పాత బకాయిలు వసూలు చేసేందుకు, జీఎస్టీ రిజిస్ట్రేషన్ల కోసమే సిబ్బం దిని వాడుకుంటున్నారని పన్నుల శాఖ అధికా రులే పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మొబైల్‌ తనిఖీలు ముమ్మరం చేసి, పన్ను ఎగవేతదా రులకు చెక్‌ పెట్టాల్సి ఉందని అంటున్నారు. 

కేవలం కాగితాల మీదే..
మొబైల్‌ తనిఖీల విషయంలో ఇటీవలే మేల్కొన్న రాష్ట్ర పన్నుల శాఖ.. తూతూమంత్రంగా చర్యలకు ఉపక్రమిం చింది. రాష్ట్రంలోని 12 వాణిజ్య పన్నుల డివిజన్లకు గాను 24 మొబైల్‌ తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి బృం దంలో ఉపపన్నుల అధికారి (డీసీటీవో), సహాయ పన్నుల అధికారి (ఏసీటీవో)లతో పాటు సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్లు కలిపి నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు వెలువడి పది రోజులవుతున్నా.. ఒక్కరోజు కూడా మొబైల్‌ తనిఖీలు జరగకపోవడం గమనా ర్హం. అంతేకాదు.. అసలు ఎప్పుడు తనిఖీ లు నిర్వహించాలి, జీఎస్టీ నేపథ్యంలో తనిఖీలు ఎలా ఉండాలన్న దానిపైనా స్పష్టత లేకుండా.. కేవలం కాగితాల మీద ఉత్తర్వులిచ్చి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement