తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తాం
వికారాబాద్: తెలంగాణలోని 10 జిల్లాలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఈ నెల 9న చేవెళ్లలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికీ తెలంగాణలోని ప్రతి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ అభిమానులున్నారని, వైఎస్‌ఆర్ అడుగుజాడల్లోనే తమ పార్టీ నడుస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ పునరువైభవాన్ని సంతరించుకునే రోజులు వస్తాయని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రాంతంలో ఏ రాజకీయ నాయకుడికీ లేనంత ఆదరణ వైఎస్‌ఆర్‌కు ఉందని, ఆ మహానేత ఆశయాలను వైఎస్ జగన్‌మోహ న్‌రెడ్డి సాధిస్తారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జనవరి నెలలో వైఎస్‌ఆర్ తనయురాలు, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పర్యటించనున్నట్లు చెప్పారు.
తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునర్‌వైభవం సాధించే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. 9న చేవెళ్లలో నిర్వహించే సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరు కావాలని కోరారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిందన్నారు.
అర్హులను కూడా అనర్హులుగా ప్రకటించి సంక్షేమ పథకాలకు దూరం చేస్తోందని ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాడం చేయడానికి తమ పార్టీ అన్ని వేళలా ముందుంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగరాజు, గోవర్ధన్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, శంకర్, రమేష్, ఎన్నెపల్లి గోపాల్, బెనర్జీ, రాంరెడ్డి, రాఘవరెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు.