సంక్షేమ ప్రదాత వైఎస్సార్
హుజూర్‌నగర్ :బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలనందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని నేటికీ ప్రజలు మరిచిపోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ ఐదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గట్టు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పునాదులు వేసి బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలు, రైతుల అభివృద్ధికి కృషి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి రాష్ట్రాన్ని ప్రాంతాలకతీతంగా అభివృద్ధి చేయడమే గాక ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకున్నారన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడినప్పటికీ ప్రాంతాలకతీతంగా వెఎస్సార్ సంక్షేమ రాజ్యాన్ని ప్రజలు మరువలేకపోతున్నారన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 104, 108, పింఛన్లు, రుణమాఫీ, ఉచిత విద్యుత్ తదితర పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు నేటికీ ఆయనను దైవంలా కొలుస్తున్నారన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేసే దిశగా త్వరలోనే కమిటీల నియామకం జరగనున్నట్టు తెలిపారు.
జిల్లాలో వైఎస్సార్‌సీపీని అభివృద్ధి చేసేం దుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్‌సీపీ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కోడి మల్లయ్యయాదవ్, పోతుల జ్ఞానయ్య, కౌన్సిలర్లు దొంతిరెడ్డి సంజీవరెడ్డి, కాలవపల్లి కృష్ణకుమారి, బ్రహ్మారెడ్డి, నాయకులు పులిచింతల వెంకటరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, జడ రామకృష్ణ, పేరం నర్సింహ, దాసరి రాములు, కస్తాల ము త్తయ్య, గొట్టెముక్కల రాములు, ముసంగి శ్రీను, బత్తిని సత్యనారాయణ, పెద్ది శివ, ముజీబ్, రవీందర్‌రెడ్డి, గండు శ్రీను, దేవరకొండ వెంకన్న, నర్సింహ, కృష్ణారెడ్డి, లక్ష్మమ్మ, మంగమ్మ, సత్యవతి, మల్లీశ్వరి, శ్రీను పాల్గొన్నారు.
వైఎస్‌కు నివాళి
జిల్లాలోని పలుచోట్ల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదానాలు చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు, పలు వృద్ధాశ్రమాల్లో పండ్లు పంపిణీ చేశారు. కోదాడలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్నేని బాబు స్థానికంగా ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి ఎస్సీసెల్ నాయకుడు ఇరుగుసునీల్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా బీబీనగర్‌లో గూడూరు జైపాల్‌రెడ్డి, మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లిలలో పార్టీ మైనార్టీసెల్ అధ్యక్షుడు ఎండీ సలీం వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.