‘యాదాద్రి’కి నాలుగు లేన్ల రహదారి
- జాతీయ రహదారితో అనుసంధానం
- రూ.110 కోట్లకు నేడు పరిపాలన అనుమతి జారీ!
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారి నుంచి యాదగిరిగుట్ట వరకు నాలుగు వరసల రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రస్తుతం పనులు రాయగిరి వరకు పూర్తయ్యాయి. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు ప్రస్తుతం రెండు లేన్ల రోడ్డే ఉంది.
ఇప్పుడు దాన్ని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. వంగపల్లి, తుర్కపల్లితోపాటు మరో వైపు నుంచి యాదగిరిగుట్టకు ఉన్న సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చాలని నిర్ణయించారు. రోడ్లు,భవనాల శాఖ రూ. 110 కోట్లతో అంచనాలు రూపొందించి ఆ ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేసింది. దీనికి మంగళవారం పరిపాలన అనుమతులు రానున్నాయి. ఆర్నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
నాలుగు లేన్లుగా ఫ్లైఓవర్
ప్రస్తుతం రాయగిరి వద్ద రైల్వేలైన్‌పై రెండు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉంది. ఇప్పుడా రోడ్డును నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నందున ఫ్లైఓవర్‌ను కూడా నాలుగు వరసలుగా మార్చబోతున్నారు. కాగా, గతంలో నగరంలోని ఎల్బీనగర్‌లో రూ. 90 కోట్లు, నర్సాపూర్ కూడలిలో రూ. 73 కోట్లతో రెండు ఫ్లైఓవర్లకు రోడ్లు,భవనాల శాఖ పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఇటీవల ఈ రెండు రోడ్లు జీహెచ్‌ఎంసీకి బదలాయించడంతో మంజూరైన పరిపాలన అనుమతులు రద్దు చేసి వాటి స్థానంలో యాదగిరిగుట్ట రోడ్ల నిర్మాణానికి జారీ చేయనున్నారు.