ఏమిటీ జాప్యం? | KCR angry on delay in yadadri development work | Sakshi
Sakshi News home page

ఏమిటీ జాప్యం?

Published Fri, Mar 18 2016 3:52 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

ఏమిటీ జాప్యం? - Sakshi

ఏమిటీ జాప్యం?

► యాదాద్రి అభివృద్ధి పనులపై సీఎం ఆగ్రహం
► శంకుస్థాపన చేసి 8 నెలలైనా కూల్చివేతలే కావా?
► అభివృద్ధి పనుల తుది డిజైన్ ఎప్పుడిస్తారు?
► వారంలోగా నిర్మాణాలు మొదలు పెట్టాలని ఆదేశం
► దుకాణాలు కోల్పోయినవారికి పునఃకేటాయింపులో ప్రాధాన్యం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి క్షేత్రం అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు నేను శంకుస్థాపన చేసి ఎనిమిది నెలలైంది. గత రెండేళ్లలో రూ.200 కోట్ల నిధులిచ్చాం. ఈ ఏడాది మరో రూ.100 కోట్లు కేటాయించాం. అయినా ఇంకా కూల్చివేతలే పూర్తి కాలేదు. పనులు ప్రారంభమవలేదు. ఇంకెప్పుడు ప్రారంభిస్తారు? పనుల తుది డి జైన్ ఎప్పటికి పూర్తవుతుంది? ఎప్పుడిస్తారు? అని యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి సంస్థ (వైటీడీఏ) అధికారులను, ఆర్కిటెక్ట్ ఏజెన్సీ నిర్వాహకులను ఆయన తీవ్రంగా మందలించారు. వారంలో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అవసరమనుకుంటే ఆలయాభివృద్ధి పనుల డిజైన్లను ఆర్‌అండ్‌బీ అధికారులతో చేయించాలని సూచించారు.

 

యాదగిరీశుడు లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం దంపతులు గురువారం పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఉదయం 10:50 నిమిషాలకు సతీసమేతంగా గుట్టకు వచ్చిన సీఎం ముందుగా ఆండాళ్ నిలయానికి వెళ్లారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలు ధరించి స్వామివార్లకు సమర్పించాల్సిన పట్టువస్త్రాలను, తలంబ్రాలతో మేళతాళాల మధ్య సతీమణి శోభ, మనుమడు హిమాన్షు, ఇంద్రకరణ్‌రెడ్డి తదితర మంత్రివర్గ సహచరులు, ఆలయాధికారులతో కలసి గర్భాలయానికి వెళ్లారు. స్వామి వారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
తుది డిజైన్ ఏమైంది?
పూజల అనంతరం వైటీడీఏ అభివృద్ధి పనులపై ఆండాళ్ నిలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జాప్యంపై అధికారులతో పాటు సంబంధిత ఆర్కిటెక్ట్ డిజైనింగ్ ఏజెన్సీ నిర్వాహకులపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంతవరకూ ప్రధానాలయ అభివృద్ధి పనుల తుది డిజైనే ఏజెన్సీ ఇవ్వలేదని అధికారులు చెప్పడంతో ఆయన ఆగ్రహించారు. ‘మీరు డిజైన్లివ్వకుండా మేం భూములు కొనుగోలు చేసి, సేకరించి, అభివృద్ధి పనులు తలపెట్టి ఉపయోగమేమిటి? వెంటనే తుది డిజైన్లు వైటీడీఏ అధికారులకు అందజేయండి’ అని ఆదేశించారు. లేదంటే ఇప్పటికే సిద్ధంగా ఉన్న డిజైన్లలో ఆర్‌అండ్‌బీ అధికారులతో మార్పులు చేయించి తుది డిజైన్లు సిద్ధం చేయాలన్నారు.

ఆగ్నేయంలో మెట్లుండాలి
ఆలయాధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఆలయ నిర్మాణంలో వాస్తు ధర్మాలను కచ్చితంగా పాటించాలని, దోషముంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘గుట్ట ఆలయానికి ఆగ్నేయం లో ప్రవేశమార్గముంది. వాస్తు ప్రకారం అలాగే ఉండాలి. అందుకే ఇక్కడకు భక్తులు ఎక్కువగా వస్తారు. మా ఇంటికీ మెట్లు ఆగ్నేయంలోనే ఉన్నాయి. అందుకే మా ఇంటికి కూడా పబ్లిక్ ఎక్కువగా వస్తుంటారు’’ అని వ్యాఖ్యానించిన ట్టు తెలిసింది. పనులు ప్రారంభిస్తే విరాళాలిచ్చేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని, పెద్ద పెద్ద కంపెనీలే నిధులు సమకూర్చాలని భావిస్తున్నాయని చెప్పారు. యాదాద్రి అభివృద్ధికి నిధులిచ్చేందుకు ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేదని చెప్పారు. 5 వేల మందికి కల్యాణం జరిపే సామర్థ్యంతో కల్యాణ మండపాన్ని నిర్మించాలని సూచించారు.

భోజనానికి రండి
ఆలయాభివృద్ధి పనుల్లో భాగంగా 100 ఫీట్ల రోడ్డు కోసం కొండపై దుకాణాలు కోల్పోతున్న దుకాణదారుల ప్రతినిధులను సీఎం శుక్రవారం తన ఇంటికి చర్చలకు, భోజనానికి ఆహ్వానించారు. అభివృద్ధి పనుల కోసం తమ దుకాణాలను కూల్చివేసినందున తమకు న్యాయం చేయాలంటూ వారు విజ్ఞప్తి చేయగా ఆయన ఇలా స్పందించారు. ‘‘మీకు ఎలాంటి నష్టమూ కలగనివ్వం. బస్టాండ్ ఎదుట నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్‌లో ముందుగా మీకే ప్రాధాన్యమిస్తాం’’అని హామీ ఇచ్చారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ సునీతా మహేందర్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, స్థపతి సుందరరాజన్ తదితరులు సీఎం వెంట ఉన్నారు.
 
బాలాలయం నిర్మించాకే ప్రధానాలయ మూసివేత
యాదాద్రిలో బాలాలయ నిర్మాణం పూర్తయ్యాకే ప్రధానాలయాన్ని మూసివేసేందుకు సీఎం అంగీకరించారని వైటీడీఏ అధికారులు వెల్లడించారు. గత నిర్ణయం మేరకు ఈ నెల 21న బ్రహ్మోత్సవాలు పూర్తవగానే ప్రధానాలయాన్ని మూసేసి పనులు చేపట్టాలి. ప్రధానాలయం పక్కనే ఉన్న దుకాణాల సమీపంలో గతంలో పాలనా భవనమున్న చోట బాలాలయాన్ని నిర్మించాలని నిర్ణయించి అందుకోసం దుకాణాలతో పాటు ఆలయ భవనాలనూ కూల్చేశారు. కానీ బ్రహ్మోత్సవాల పరిపూర్తి నాలుగు రోజులే ఉన్నా ఇంకా బాలాలయ నిర్మాణమే మొదలవలేదు. రోజువారీ పూజలు, భక్తుల దర్శనార్థం ఏప్రిల్ 24కల్లా బాలాలయ నిర్మాణం పూర్తవాలి. కానీ ఇంకా పనులే మొదలవనందున కనీసం మరో రెండు నెలలైనా పడుతుందని అధికారులు భావిస్తున్నారు. బాలాలయం నిర్మాణానికి గురువారమే సీఎం భూమిపూజ చేస్తారని భావించినా అది జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement