సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ‘జీరో కాలుష్య’కారక ప్రాజెక్టుగా నిర్మిస్తున్నామని తెలంగాణ జెన్‌కో, బీహెచ్‌ఈఎల్ సంస్థలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టు వల్ల గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా పరిరక్షించేందుకు రూ.5,597.44 కోట్ల వ్యయంతో పర్యావరణ పరిరక్షణ ప్రణాళిక అమలు చేస్తున్నామని ప్రకటించాయి. దీనికి అదనంగా కాలుష్య వ్యర్థాల రీసైక్లింగ్ కోసం ఏటా రూ.430 కోట్లను కాలుష్య నివారణకు ఖర్చు చేయనున్నట్లు తెలిపాయి. కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల పురోగతిపై జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు గురువారం బీహెచ్‌ఈఎల్ అధికారులతో సమావేశంనిర్వహించారు. యాదాద్రి ప్లాంట్‌తో పర్యావరణం, మానవులు, జంతువులకు ఎలాంటి హానీ ఉండదని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు.
రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం, కేంద్ర అనుమతులతోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని ఉద్ఘాటించారు. ఈ ప్రాజెక్టుతో 10 వేల మందికి ప్రత్యక్ష, మరో 20 వేల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. రాష్ట్ర అవసరాల కోసం వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఇటీవల టెండర్లను ఆహ్వానిస్తే 500 మెగావాట్లకే స్పందన లభించిందని, యూనిట్‌కు రూ.5 నుంచి రూ.10.50 ధరతో విక్రయించేందుకు ప్రైవేటు కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. యాదాద్రి ప్లాంటు నిర్మిస్తే యూనిట్ ధర రూ.4.87తో విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టును రూ.29,965 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తుండగా ఇప్పటి వరకు రూ.2,800 కోట్లతో పనులు పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.లక్ష కోట్లకు పెరుగుతుందని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, పెరిగితే స్వల్పంగా 10 శాతం వరకు పెరగొచ్చని చెప్పారు.
నెలాఖరులోగా కేటీపీఎస్ విద్యుదుత్పత్తి
పాల్వంచలో తలపెట్టిన 800 మెగావాట్ల కొత్త గూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీఎస్) నిర్మాణం 41 నెలల రికార్డు సమయంలో పూర్తి కానుందని చెప్పారు. ఇదే నెలలో ప్రాజెక్టు నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామని ప్రకటించారు. మణుగూరులో నిర్మి స్తున్న 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని తొలి రెండు యూనిట్లను వచ్చే ఏడాది మార్చిలోగా, మిగిలిన రెండు యూనిట్లను మరో రెండు మూడు నెలల విరామం తర్వాత విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామన్నారు.
విద్యుత్ వినియోగంలో రెండో స్థానం
రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగి 10,818 మెగావాట్లకు చేరుకుందని, డిమాండ్ 11,500 మెగావాట్లకు పెరిగినా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభించడంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్‌తో పాటు సాగు ఆయకట్టు సైతం పెరిగిందన్నారు. విద్యుత్ వినియోగంలో దక్షిణాదిన తమిళనాడు తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ కేంద్రాల నుంచి 2,560 మెగావాట్లకు బదులు 1,400–1,600 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్లకు బదులు 350 మెగావాట్ల సరఫరా మాత్రమే జరుగుతోందని, 540 మెగావాట్లు సరఫరా చేసే ఓ ప్లాంట్ నుంచి ఉత్పత్తి సైతం ఆగిపోవడంతో మొత్తం 2300 మెగావాట్ల లోటు ఏర్పడిందని ప్రభాకర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో జెన్‌కో డైరెక్టర్లు సచ్చిదానందం, వెంకటరాజం, బీహెచ్‌ఈఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ముఖోపాధ్యాయ, బాల సుబ్రమణ్యం, తపాస్ మౌజుందార్, షకీల్ మోనాచీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment