Yadadri Thermal Power Project
-
మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం (గత బీఆర్ఎస్ సర్కార్) బిడ్డింగ్ ప్రక్రియను అనుసరించకుండా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం కుదుర్చుకోవడం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టడంతో రాష్ట్రానికి నష్టం వాటిల్లిందంటూ వచ్చిన ఆరోపణలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ మంగళవారం బహిరంగ ప్రకటన జారీ చేసింది. సంబంధిత అంశాల్లో అవగాహన, అనుభవం, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, సంస్థలు 10 రోజుల్లోగా లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. cio2024.power@gmail.com కి మెయిల్ ద్వారా లేదా తమ కార్యాలయానికి (7వ అంతస్తు, బీఆర్కేఆర్ భవన్, ఆదర్శ్ నగర్, హైదరాబాద్– 500004) పోస్టు ద్వారా పంపాలని సూచించింది. విచారణ కమిషన్‌కు పంపించే విజ్ఞాపనల్లో వ్యక్తులపై ఎలాంటి రాజకీయపరమైన ఆరోపణలు చేయరాదని కోరింది. ఎవరైనా కమిషన్ ముందు హాజరై మౌఖికంగా ఆధారాలు సమరి్పంచాలని భావిస్తే, ఏ విషయంలో వారు హాజరుకావాలని కోరుకుంటున్నారో తెలియజేయాలంది. సంబంధిత నిర్ణయాల్లో తప్పులను గుర్తించడంతోపాటు రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టాన్ని నిర్ధారించడం, బాధ్యులను గుర్తించడం కోసం న్యాయవిచారణ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. -
థర్మల్ పవర్ ప్లాంట్ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
-
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్‌ప్లాంటు వద్దకు చేరుకున్న సీఎం ప్లాంటులోని పనులను దగ్గరుండి పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌కు మ్యాప్ ద్వారా వివరించారు. ఈ మేరకు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ప్లాంట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా సీఎం పరిశీలించారు. కాగా ఇప్పటి వరకు 62 శాతం వరకు పనులు పూర్తి కాగా.. వచ్చే ఏడాది ప్లాంట్ అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఒకే స్థలంలో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థం కలదు. రూ. 2,992 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు. -
‘యాదాద్రి ప్లాంట్’ను గడువులోగా పూర్తిచేయాలి
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో జాప్యంపై జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. 4,000 మెగావాట్ల యాదాద్రి విద్యుత్ ప్లాంట్ పనులపై శుక్రవారం ఆయన బీహెచ్ఈఎల్ డైరెక్టర్ ఉపేందర్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలింద్ కోపికర్తో సమీక్ష నిర్వహించారు. కూలింగ్ టవర్లు, కోల్/యాష్ ప్లాంట్ల పనులు నత్తనడకన జరుగుతున్నాయని, వేగం పెంచాలని కోరారు. అలాగే అన్ని యూనిట్లలో పనులు నిరంతరాయంగా జరగాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కాగా, వచ్చే ఏడాది జూన్ నాటికి యాదాద్రి కేంద్రంలోని రెండు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభించడంతో పాటు మూడో యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయనకు బీహెచ్ఈఎల్ డైరెక్టర్ హామీ ఇచ్చారు. -
‘యాదాద్రి’ @ జీరో కాలుష్యం!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ‘జీరో కాలుష్య’కారక ప్రాజెక్టుగా నిర్మిస్తున్నామని తెలంగాణ జెన్కో, బీహెచ్ఈఎల్ సంస్థలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టు వల్ల గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా పరిరక్షించేందుకు రూ.5,597.44 కోట్ల వ్యయంతో పర్యావరణ పరిరక్షణ ప్రణాళిక అమలు చేస్తున్నామని ప్రకటించాయి. దీనికి అదనంగా కాలుష్య వ్యర్థాల రీసైక్లింగ్ కోసం ఏటా రూ.430 కోట్లను కాలుష్య నివారణకు ఖర్చు చేయనున్నట్లు తెలిపాయి. కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల పురోగతిపై జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు గురువారం బీహెచ్ఈఎల్ అధికారులతో సమావేశంనిర్వహించారు. యాదాద్రి ప్లాంట్‌తో పర్యావరణం, మానవులు, జంతువులకు ఎలాంటి హానీ ఉండదని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం, కేంద్ర అనుమతులతోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని ఉద్ఘాటించారు. ఈ ప్రాజెక్టుతో 10 వేల మందికి ప్రత్యక్ష, మరో 20 వేల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. రాష్ట్ర అవసరాల కోసం వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఇటీవల టెండర్లను ఆహ్వానిస్తే 500 మెగావాట్లకే స్పందన లభించిందని, యూనిట్‌కు రూ.5 నుంచి రూ.10.50 ధరతో విక్రయించేందుకు ప్రైవేటు కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. యాదాద్రి ప్లాంటు నిర్మిస్తే యూనిట్ ధర రూ.4.87తో విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టును రూ.29,965 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తుండగా ఇప్పటి వరకు రూ.2,800 కోట్లతో పనులు పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.లక్ష కోట్లకు పెరుగుతుందని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, పెరిగితే స్వల్పంగా 10 శాతం వరకు పెరగొచ్చని చెప్పారు. నెలాఖరులోగా కేటీపీఎస్ విద్యుదుత్పత్తి పాల్వంచలో తలపెట్టిన 800 మెగావాట్ల కొత్త గూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీఎస్) నిర్మాణం 41 నెలల రికార్డు సమయంలో పూర్తి కానుందని చెప్పారు. ఇదే నెలలో ప్రాజెక్టు నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామని ప్రకటించారు. మణుగూరులో నిర్మి స్తున్న 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని తొలి రెండు యూనిట్లను వచ్చే ఏడాది మార్చిలోగా, మిగిలిన రెండు యూనిట్లను మరో రెండు మూడు నెలల విరామం తర్వాత విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామన్నారు. విద్యుత్ వినియోగంలో రెండో స్థానం రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగి 10,818 మెగావాట్లకు చేరుకుందని, డిమాండ్ 11,500 మెగావాట్లకు పెరిగినా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభించడంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్‌తో పాటు సాగు ఆయకట్టు సైతం పెరిగిందన్నారు. విద్యుత్ వినియోగంలో దక్షిణాదిన తమిళనాడు తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ కేంద్రాల నుంచి 2,560 మెగావాట్లకు బదులు 1,400–1,600 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్లకు బదులు 350 మెగావాట్ల సరఫరా మాత్రమే జరుగుతోందని, 540 మెగావాట్లు సరఫరా చేసే ఓ ప్లాంట్ నుంచి ఉత్పత్తి సైతం ఆగిపోవడంతో మొత్తం 2300 మెగావాట్ల లోటు ఏర్పడిందని ప్రభాకర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్లు సచ్చిదానందం, వెంకటరాజం, బీహెచ్ఈఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ముఖోపాధ్యాయ, బాల సుబ్రమణ్యం, తపాస్ మౌజుందార్, షకీల్ మోనాచీ తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భూమి పూజ
దామరచర్ల : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో జెన్కో ఆధ్వర్యంలో తలపెట్టిన భారీ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. సోమవారం సాయంత్రం వీర్లపాలెం చేరుకున్న కేసీఆర్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని అనంతరం బయల్దేరి నల్లగొండకు వెళ్లారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాగా రైతులకు సీఎం కేసీఆర్ ఎలాంటి భరోసా ఇవ్వలేదంటూ పలువురు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. -
మరోమారు
29న జిల్లాకు సీఎం కేసీఆర్ రాక సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు.. నక్కలగండి ప్రాజెక్టు.. జిల్లా ప్రజానీకానికి ఎంతో ఉపయుక్తమైన ఈ రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేతుల మీదుగా ఈ రెండు ప్రాజెక్టులకు భూమిపూజ జరగనుంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణ కూడా జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఖరారైనట్టు సచివాలయ వర్గాల సమాచారం. సీఎం హెలికాప్టర్ ద్వారా జిల్లాకు రానున్నారు. హెలికాప్టర్లోనే ప్రయాణించి ఆయన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని, ఆ తర్వాత సాయంత్రం న కిరేకల్‌లో జరగనున్న పార్టీ బహిరంగ సభలో పాల్గొని రోడ్డుమార్గంలోహైదరాబాద్‌కు వెళ్లిపోతారని అధికార వర్గాలు చెపుతున్నాయి. అయితే, కేసీఆర్ పర్యటన ఖరారైన ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకే రోజు... మూడు ప్రాజెక్టులు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు శంకుస్థాపన త్వరలోనే చేస్తానని ఇటీవల జిల్లాలో పర్యటించినప్పుడు కూడా సీఎం కేసీఆర్ చెప్పారు. కలెక్టర్ల సమావేశం జరిగినప్పుడు కూడా వారం రోజుల్లో వస్తానని, శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అయితే, ఆయనకున్న బిజీ షెడ్యూల్‌తో పాటు దామరచర్ల మండలంలోని వీర్లపాలెం అటవీరేంజ్‌లో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు భూసేకరణ వలన నిర్వాసితులైన వారి ప్యాకేజి ఖరారు కాకపోవడంతో ఆయన పర్యటన వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో పునరావాస ప్యాకేజి వివరాలను స్వయంగా కేసీఆరే ప్రకటించనున్నారని తెలుస్తోంది. దీనికి తోడు జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన నక్కలగండి ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా ఫ్లోరైడ్ పీడిత గ్రామాల విముక్తికి ఏకైక పరిష్కారంగా భావించే నక్కలగండి ఎత్తిపోతల కాగా, మొదట ప్రతిపాదించిన విధంగా నక్కలగండి-మిడ్ డిండి-డిండి ప్రాజెక్టు చేపట్టాలని ప్రజలు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.6,500 కోట్ల నిధులు మంజూరు చేశా రు. మిడ్ డిండి-డిండి ద్వారా సుమారు లక్షా 40వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గతంలో నక్కలగండి ఎత్తిపోతల పథకానికి సర్వే నిర్వహించారు. ఇక, వచ్చేమూడేళ్లలో ఇంటిం టికీ కుళాయిల ద్వారా రక్షిత జలాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి చిహ్నంగా జిల్లాలోని చౌటుప్పల్‌లో పైలాన్ ఏర్పాటు చేస్తున్నారు. రూ.1.95కోట్లవ్య యంతో 63ఫీట్ల ఎత్తుతో పైలాన్‌ను నిర్మించారు. దానిచుట్టూ తెలంగాణ రాష్ట్రంలోని 10జిల్లాలకు ప్రాతి నిథ్యం ఉన్నట్టుగా 10బతుకమ్మలు, పైన పూర్ణకుంభం ఏర్పాటు చేశారు. చుట్టూ పార్క్‌ను అభివృద్ధి చేశారు. ఈ పైలాన్‌ను కూడా కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. నకిరేకల్‌లో బహిరంగ సభ వాస్తవానికి 29న సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో జిల్లాకు రానున్నారు. ముందుగా నక్కలగండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకుని, అక్కడి నుంచి దామరచర్ల మండంలోని వీర్లపాలెం అటవీరేంజ్‌లో యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్లోనే ఆయన నల్లగొండకు వస్తారని సమాచారం. న ల్లగొండలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన నకిరేకల్‌లో నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొంటారు. వాస్తవానికి ప్రాజెక్టులను ప్రారంభించిన చోట బహిరంగసభలు నిర్వహించే పద్ధతి ఉన్నా.. దామరచర్ల, నక్కలగండి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసే చోట ఆ వీలులేకపోవడంతో నకిరేకల్‌లో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ బహిరంగసభ కోసం లక్షన్నర మందిని సమీకరించాలని టీఆర్ఎస్ జిల్లా నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా నిర్వహించే బహిరంగసభకు పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించాలని నిర్ణయించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరికిశోర్‌లతో పాటు పార్టీ జిల్లా నాయకత్వం బహిరంగ సభ విజయవంతంపై దృష్టి సారించి పనిచేయనున్నారు. ఈ బహిరంగ సభ అనంతరం కూడా కేసీఆర్ హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలోనే వెళతారని సమాచారం. ఉదయం వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను ఆవిష్కరించని సందర్భంలో సాయంత్రం హైదరాబాద్‌వెళ్లే సమయంలో చౌటుప్పల్‌లో ఆగి ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే, ఇందుకు సంబంధించిన తుది పర్యటన ఖరారు కావాల్సి ఉందని అధికార వర్గాలంటున్నాయి.