మరోమారు | TS CM KCR tour in Nalgonda | Sakshi
Sakshi News home page

మరోమారు

Published Thu, May 21 2015 12:12 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

TS CM KCR tour in Nalgonda

29న జిల్లాకు సీఎం కేసీఆర్ రాక
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ  : యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు.. నక్కలగండి ప్రాజెక్టు.. జిల్లా ప్రజానీకానికి ఎంతో ఉపయుక్తమైన ఈ రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేతుల మీదుగా ఈ రెండు ప్రాజెక్టులకు భూమిపూజ జరగనుంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణ కూడా జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఖరారైనట్టు సచివాలయ వర్గాల సమాచారం. సీఎం హెలికాప్టర్ ద్వారా జిల్లాకు రానున్నారు. హెలికాప్టర్‌లోనే ప్రయాణించి ఆయన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని, ఆ తర్వాత సాయంత్రం న కిరేకల్‌లో జరగనున్న పార్టీ బహిరంగ సభలో పాల్గొని రోడ్డుమార్గంలోహైదరాబాద్‌కు వెళ్లిపోతారని అధికార వర్గాలు చెపుతున్నాయి. అయితే, కేసీఆర్ పర్యటన ఖరారైన ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
 
 ఒకే రోజు... మూడు ప్రాజెక్టులు
 జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు శంకుస్థాపన త్వరలోనే చేస్తానని ఇటీవల జిల్లాలో పర్యటించినప్పుడు కూడా సీఎం కేసీఆర్ చెప్పారు. కలెక్టర్ల సమావేశం జరిగినప్పుడు కూడా వారం రోజుల్లో వస్తానని, శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అయితే, ఆయనకున్న బిజీ షెడ్యూల్‌తో పాటు దామరచర్ల మండలంలోని వీర్లపాలెం అటవీరేంజ్‌లో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు భూసేకరణ వలన నిర్వాసితులైన వారి ప్యాకేజి ఖరారు కాకపోవడంతో ఆయన పర్యటన వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో పునరావాస ప్యాకేజి వివరాలను స్వయంగా కేసీఆరే ప్రకటించనున్నారని తెలుస్తోంది. దీనికి తోడు జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన నక్కలగండి ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
 
 జిల్లా ఫ్లోరైడ్ పీడిత గ్రామాల విముక్తికి ఏకైక పరిష్కారంగా భావించే నక్కలగండి ఎత్తిపోతల కాగా, మొదట ప్రతిపాదించిన విధంగా నక్కలగండి-మిడ్ డిండి-డిండి ప్రాజెక్టు చేపట్టాలని ప్రజలు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.6,500 కోట్ల నిధులు మంజూరు చేశా రు. మిడ్ డిండి-డిండి ద్వారా సుమారు లక్షా 40వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గతంలో నక్కలగండి ఎత్తిపోతల పథకానికి సర్వే నిర్వహించారు. ఇక, వచ్చేమూడేళ్లలో ఇంటిం టికీ కుళాయిల ద్వారా రక్షిత జలాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి చిహ్నంగా జిల్లాలోని చౌటుప్పల్‌లో పైలాన్ ఏర్పాటు చేస్తున్నారు. రూ.1.95కోట్లవ్య యంతో 63ఫీట్ల ఎత్తుతో పైలాన్‌ను నిర్మించారు. దానిచుట్టూ తెలంగాణ రాష్ట్రంలోని 10జిల్లాలకు ప్రాతి నిథ్యం ఉన్నట్టుగా 10బతుకమ్మలు, పైన పూర్ణకుంభం ఏర్పాటు చేశారు. చుట్టూ పార్క్‌ను అభివృద్ధి చేశారు. ఈ పైలాన్‌ను కూడా కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.
 
 నకిరేకల్‌లో బహిరంగ సభ
 వాస్తవానికి 29న సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో జిల్లాకు రానున్నారు. ముందుగా నక్కలగండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకుని, అక్కడి నుంచి దామరచర్ల మండంలోని వీర్లపాలెం అటవీరేంజ్‌లో యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లోనే ఆయన నల్లగొండకు వస్తారని సమాచారం. న ల్లగొండలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన నకిరేకల్‌లో నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొంటారు. వాస్తవానికి ప్రాజెక్టులను ప్రారంభించిన చోట బహిరంగసభలు నిర్వహించే పద్ధతి ఉన్నా.. దామరచర్ల, నక్కలగండి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసే చోట ఆ వీలులేకపోవడంతో నకిరేకల్‌లో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ బహిరంగసభ కోసం లక్షన్నర మందిని సమీకరించాలని టీఆర్‌ఎస్ జిల్లా నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది.
 
  కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా నిర్వహించే బహిరంగసభకు పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించాలని నిర్ణయించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరికిశోర్‌లతో పాటు పార్టీ జిల్లా నాయకత్వం బహిరంగ సభ విజయవంతంపై దృష్టి సారించి పనిచేయనున్నారు. ఈ బహిరంగ సభ అనంతరం కూడా కేసీఆర్ హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలోనే వెళతారని సమాచారం. ఉదయం వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను ఆవిష్కరించని సందర్భంలో సాయంత్రం హైదరాబాద్‌వెళ్లే సమయంలో చౌటుప్పల్‌లో ఆగి ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే, ఇందుకు సంబంధించిన తుది పర్యటన ఖరారు కావాల్సి ఉందని అధికార వర్గాలంటున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement